Sunday, May 10, 2020

కోపం ద్వారా మనమేం సాధించలేమని, కమ్యూనికేషన్‌ ద్వారా మాత్రమే సాధించగలo

ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు ఎన్నికల కాన్వాసింగ్ కోసం పాదయాత్ర చేస్తూ, ఆ సాయంత్రం అటు వచ్చినప్పుడు ‘టీ’ కి ఒకరి ఇంట్లో ఆగుతానన్నాడు. తప్పక గెలిచే రూలింగ్ పార్టీ కాoడిడేట్. ఆ ఇంటి యజమాని సంభ్రమమంతో పొంగిపోయాడు. భార్యని టీ చేయమని పురమాయించాడు. కొడుకుని ఇల్లంతా నీట్‌గా సర్దమన్నాడు.

నాయకుడు వచ్చే టైం దగ్గర పడింది. యజమాని కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. భార్య పాలు వేడి చేస్తోంది. సరీగ్గా ఆ సమయంలో కుర్రవాడు కిటికీ సర్దుతూ ఉంటే ఇంక్‌ సీసా కింద పడి భళ్లున బ్రద్దలైంది. యజమాని కోపంతో ఊగిపోతూ వాడి చెంప చెళ్ళుమనిపించి, నిముషంలో అది క్లీన్ చెయ్యకపోతే వళ్ళు చీరేస్తానన్నాడు. టీ రుచి చూసి పంచదార ఎక్కువైనందుకు భార్యని తిట్టాడు.

ఈ లోపులో అతిథి వచ్చాడు. ముఖం నిండా నవ్వు పులుముకుని అతడిని లోపలికి ఆహ్వానించి అరగంటసేపు అతడి ఎంటర్‌టెయిన్ చేసాడు. భార్యాపిల్లలని పరిచయం చేసాడు. అతడు కూడా టీ చాలా బావుందని మెచ్చుకున్నాడు. తర్వాత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది.

అంతకు ముందు అంత బాగా చిరునవ్వు ముసుగు వేసుకున్న యజమాని, తనేం కోల్పోయాడో గ్రహించలేకపోయాడు. అతడు కోల్పోయింది తన కొడుకు, భార్యలతో ఒక మంచి సంబంధాన్ని..! ముక్కూ మొహం తెలియని అయిదు సంవత్సరాల అతిథి కోసం అంత చిరునవ్వు ముసుగు వేసుకున్న యజమాని, జీవితాంతం కలిసి ఉండవలసిన భార్యా బిడ్డల ముందు ముసుగు తీసేసి ఎందుకు రాక్షసుడి లాగా ప్రవర్తించాడు?

ఈ విధంగా తార్కికంగా ఆలోచిస్తే మనిషికి కోపం రాదు. కోపం ద్వారా మనమేం సాధించలేమని, కమ్యూనికేషన్‌ ద్వారా మాత్రమే సాధించగమని తెలుసుకున్న మనిషి అనవసరమైన టెన్షన్‌కి లోనుకాడు.మరోలా చెప్పాలంటే కోపం అనేది మానవసహజమైన ప్రక్రియే. కాదనటం లేదు. కానీ మనకి కోపం వచ్చినట్టు అవతలివాళ్ళకి తెలియజేస్తే చాలు. హింసాత్మక పద్ధతుల ద్వారా ఎదుటివ్యక్తిని బాధ పెడితే వచ్చే లాభం ఏమిటి? ఆలోచించండి.
👏👏👏👏

No comments:

Post a Comment