Tuesday, June 9, 2020

బీష్ముడు

బీష్ముడు

భీష్ముడు రోజూ యుద్ధం చేసేవాడు. అనంతరము శిబిరమునకు వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి ‘నీవు ఎంతో గొప్పవాడివని యుద్ధంలో దిగాను. ఎంతమందిని చంపావు? ఏమి చేశావు? నువ్వు తలుచుకుంటే ఆర్జునుడిని చంపలేవా? నువ్వు కావాలని పాండవులను వెనక వేసుకు వస్తున్నావు. నువ్వు పాండవ పక్షపాతివి. అని సూటీపోటీ మాటలతో ములుకులతో పొడిచినట్లు మాట్లాడేవాడు. పాపం భీష్ముడు, ఆ వయస్సులో అన్నిమాటలు విని ఒకరోజు దుర్యోధనునితో ‘దుర్యోధనా! ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు కాని!’ అని మండలాకారమయిన ధనుస్సును పట్టుకున్నాడు.
ఆ రోజు భీష్ముడు వేసిన బాణములు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్నివేల మందిని తెగటార్చాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు, చేతులు, ఏనుగులతో నిండిపోయింది. ఆయన యుద్ధమునకు పాండవులు గజగజ వణికి పోయారు. అర్జునుడిని భీష్ముని మీద యుద్ధమునకు పంపించారు. అర్జునుడు యుద్ధమునకు వచ్చాడు. భీష్మునికి సర్వ సైన్యాధిపతిగా అభిషేకం చేశారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారధ్యం చేస్తున్నాడు. ఆయన యుద్ధంలో తన చేతితో ధనుస్సు పట్టనని ఏ విధమయిన అస్త్ర శస్త్రములను పట్టాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విషయమును దూతలు వచ్చి భీష్మునికి చెప్పారు. భీష్ముడు ‘సర్వ సైన్యాధిపతిగా నేనూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవాళ కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను’ అన్నాడు.
కృష్ణుడు పరమాత్మని భీష్ముడికి తెలుసు. కృష్ణునితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు. ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆరోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో అర్జునుడు ఎన్ని ధనుస్సులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్యసాచి, ఎందుకూ పనికిరాకుండా పోయాడు. భీష్ముడు కొట్టిన బాణములకు కృష్ణ పరమాత్మ కవచం చిట్లిపోయింది.
కృష్ణుని మోదుగచెట్టును కొట్టినట్లు కొట్టేశాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుని శరీరంలోంచి నెత్తురు కారిపోతున్నది. కృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞను మరచిపోయి భీష్ముడిని చంపి అవతల పారవేస్తానని తన చక్రం పట్టుకుని రథం మీద నుండి క్రిందికి దిగిపోయాడు. భీష్ముడు తన కోదండమును పక్కనపెట్టి కృష్ణుడికి నమస్కరించాడు.
పదిరోజుల యుద్ధం పూర్తయిన తరువాత ధర్మరాజుగారు కృష్ణుడిని పిలిచి ‘పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంక మనం యుద్ధం చేయలేము. ఆయన సామాన్యుడు కాదు అరివీర భయంకరుడు. ఆయనను యుద్ధం నుండి ఆపడం ఎలా? అని కృష్ణ పరమాత్మని అడిగాడు. కృష్ణ పరమాత్మ అన్నారు ‘దీనికి ఒక్కటే పరిష్కారం. నీవు నీ సోదరులతో కలిసి భీష్ముని శిబిరమునకు వెళ్ళి నమస్కారం చేసి ఆయననే అడుగు. నేను మీతో వస్తాను పదండి’ అన్నాడు.
అందరూ కలిసి భీష్ముని వద్దకు వెళ్ళారు. ధర్మరాజుగారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు ‘ధర్మజా ! ఇంత రాత్రివేళ పాదచారివై ఎందుకు వచ్చావు? మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చేయమనడం తప్ప ఇంకేదయినా కోరుకో’ అని చెప్పాడు. ధర్మరాజు ‘తాతా ! నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాతా?’ అని అడిగాడు. భీష్ముడు ఒక నవ్వు నవ్వి ‘నా చేతిలో ధనుస్సు ఉన్నంత కాలం నేను మరణించను. మనవడు అర్జునుని ప్రజ్ఞచూసి అతను వేసిన బాణములకు పొంగిపోయాను. నా ధనుస్సును కొన్ని సందర్భములలోనే ప్రక్కన పెడతాను. రథం మీద స్త్రీవచ్చి బాణం వేస్తే, ఎవరిదయినా పతాకం క్రిందికి జారిపోతే, వెన్నిచ్చి పారిపోతున్న వానితో నేను యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వానితో నేను యుద్ధం చెయ్యను. ఇందులో స్త్రీని పెట్టుకుని యుద్ధానికి వచ్చే అవలక్షణం మీలో లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు. మీలో ఎవరి పతాకము క్రిందకు జారిపోదు. మీకు ఉన్న అవకాశం ఒక్కటే. మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు. శిఖండిని అర్జునుని రథమునకు ముందు నిలబెట్టండి. శిఖండి బాణములు వేస్తే నేను ధనుస్సు పక్కన పెట్టేస్తాను. ధనుస్సు పక్కన పెట్టిన పిదప మరల నేను బాణం వెయ్యను. వెనకనుండి అర్జునునితో బాణపరంపరను కురిపించి, నా శరీరమును పడగొట్టండి’ అని చెప్పాడు. పాండవులు ‘అలాగే తాతా’ అని చెప్పి వెళ్ళిపోయారు.
శిబిరములోకి వెళ్ళిన తరువాత అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు. ‘మహానుభావుడు! తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో నాన్నా అని మేము ఎవరిని పిలవాలో తెలియక కౌరవులు మమ్మల్ని బాధపెడుతుంటే మాపట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళి మేము నాన్నని పిలిస్తే నేను నాన్నను కాను నేను తాతనని చెప్పి ఒడిలో కూర్చోపెట్టుకుని మాకు గోరుముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలములయందు మా ఉన్నతిని కోరాడు. మాకు ఆశీర్వచనం చేశాడు. మాకు విలువిద్య నేర్పాడు. అంతటి ధర్మమూర్తియై తన వంశమును చూసుకోవాలని ఇంతకాలం నిలబడి పోయాడు. సవ్యసాచియై గాండీవం పట్టుకుని, శిఖండిని అడ్డుపెట్టుకుని ఆయన మీద బాణ పరంపర కురిపిస్తుంటే, ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నేను కొట్టగలనా అన్నయ్యా?’ అని అడిగాడు. కృష్ణుడు ‘కొట్టక తప్పదు ధర్మం కోసం కొట్టవలసిందే. నీవు కొట్టు’ అన్నాడు.
యుద్ధమునకు శిఖండిని ఎదురుపెట్టి తీసుకువచ్చారు. భీష్ముడు తన ధనుస్సును పక్కన పెట్టేశాడు. శిఖండి భీష్ముని మీదకు ఒకేసారి నూరుబాణములు వేశాడు. భీష్ముని కవచం పిట్లి పోయింది. అర్జునుడు ఆ రోజు వేసిన బాణ పరంపరకు అంతేలేదు. భీష్ముని శరీరములో బొటనవేలంత సందు కూడా లేకుండా ఆయనను బాణములతో కొట్టాడు. చుట్టూ బాణ పంజరమే! మధ్యలో భీష్ముడు ఉన్నాడు. అన్ని వైపులనుంచి నెత్తురు కారిపోతోంది. వీపు చూపించలేదు. ఒక్క తలవెనక మాత్రం బాణములు తగలలేదు. ఒంటినిండా బాణపరంపరను వేసిన తరువాత సూర్యుడు అస్తమిస్తున్న సమయములో భీష్ముడు రథం మీదనుంచి పడిపోయినపుడు ఆయన శరీరము భూమికి తగలలేదు. బాణములతో పడిపోయి ఉండిపోయాడు. యుద్ధం ఆపి అందరు పరుగు పరుగున భీష్ముని దగ్గరకు వచ్చారు. భీష్ముడు ‘నాపని అయిపోయింది. నేను స్వచ్ఛంద మరణమును కోరాను. ఇంకా బ్రతికే ఉన్నాను. ఉత్తరాయణం వరకు నా శరీరమును విడిచిపెట్టను. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తరువాత రథసప్తమినాడు రథం ఉత్తరదిక్కుకు తిరిగాక, ఏకాదశి ఘడియలలో నా ప్రాణం విడిచి పెడతాను’ అని అర్జునుని పిలిచి, ‘నా తల వెనక్కి వ్రేలాడి పోతున్నది. నా మర్మ స్థానములు అన్నీ కదిలిపోతున్నాయి. బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతున్నది. నాకు తలగడ అమర్చు’ అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకు వచ్చారు. ‘ఈ తలగడలు కాదు. నాకు కావలసింది యుద్ధ భూమియందు పడుకున్న వానికి బాణములతో తలగడను ఏర్పాటు చేయాలి. అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు’ అని భీష్ముడు అంటే అర్జునుడు బాణములతో తలగడను ఏర్పాటు చేశాడు. ఆ తలగడను ఏర్పాటు చేసుకుని ‘నేను ఈ యుద్ధభూమి యందే పడి ఉంటాను. ఎవరూ నా వైపు రాకుండా నా చుట్టూ కందకం తవ్వండి’ అని కందకం తవ్వించుకుని ఆ భూమిమీద పడి ఉండిపోయాడు.

🕉️🌞🌎🏵️🌼🚩

No comments:

Post a Comment