టిఫిన్ల కథ:: డా. జి వి పూర్ణచందు
తెలుగు వారిది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ప్రొద్దున పూట తేలికగా చద్దన్నం, మధ్యాహ్నం పూట ఘనాహారం, సాయంత్రం పూట అల్పాహారం తీసుకోవటం మన పూర్వాచారం.
ఆంగ్లేయ యుగం చివరి రోజుల్లో ఉదయంపూట టిఫిను తినే అలవాటు మనకు సంక్రమించింది. స్వాతంత్ర్యం వచ్చాక క్రమేణా చద్దన్నం స్థానంలో ఇడ్లీ అట్టు పూరీ, ఉప్మాలు చోటు చేసుకో సాగాయి. 2000వ మిలీనియం సంవత్సరం లో ఉదయం పూట కొత్తగా బజ్జీలు పునుగులు కూడా స్థానం సంపాదించుకున్నాయి. ఒకప్పుడు హోటళ్లలో సాయంకాలాలే చపాతీలు వేసే వారు. సాయంత్రం 6 అయ్యాక బజ్జీలు పునుగుల బళ్ళు రోడ్డుపక్కన వెలిసేవి. ఇప్పుడు నిలబడి తినేసే జంక్‘ఫుడ్స్, ఇతర వేగాహారాల టిఫిన్ సెంటర్లు వెలిశాక మైసూరు బజ్జీలు, పునుగులూ తెల్లారేసరికే దొరుకుతున్నాయి.
పెళ్ళిళ్లలోనూ ఇతర భోజనాల్లోనూ వడ్డించే టిఫిన్లలో రెండు రకాల స్వీట్లు, నాలుగైదు రకాల హాట్లూ ఉంటున్నాయి. ఇవే తినాలనే అభిప్రాయం బలంగా నాటుకు పోవటంతో ప్రొద్దున్నపూట మెతుకు తగలకూడదనే భావన పాతుకుపోయింది. చివరికి ఉదయాన్న కమ్మని చద్దన్నం కనుమరుగైపోయింది.
చద్దన్నం అంటే పెరుగన్నమే!
చల్ల లేదా పెరుగు కలిపిన అన్నాన్ని చలిదన్నం అంటారు. దీనికి తాలింపు పెడితే అది దధ్యోదనం. తాలింపు లేకుండా పెరుగు లేదా చల్లన్నాన్ని అమ్మవారికి నివేదన పెడతారు. దీన్ని చలిది - చద్ది అన్నం అని పిలుస్తారు.
చద్దన్నం అంటే చల్లన్నం లేదా పెరుగన్నమే గానీ, పాచిపోయిన, నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నం అని కాదు. అందువలన ఈ నాటి తరం ఉదయాన్న ఆరోగ్య దాయకమైన చద్దన్నాన్ని వదిలేసి ఎక్కువ కేలరీలు, ఎక్కువ కొవ్వు, తక్కువ పోషకాలు కలిగిన టిఫిన్లను తినటానికి అలవాటు పడ్డారు. ప్రొద్దున్న పూట మెతుకు తగలకూడదంటారు గానీ,
అమ్మవారికి నైవేద్యం పెట్టే చలిదన్నం పవిత్రమైనదని గుర్తించలేకపోతున్నారు.
గోపబాలురంతా కృష్ణుడి చుట్టూ పద్మాకారంలో కూర్చుని ఇళ్ళ దగ్గరనుంచి తెచ్చుకున్న పెరుగన్నాన్ని మాగాయ ముక్కలతో నంజుకు తిన్నట్టు పోతనగారు వర్ణించాడు. కృష్ణుడు చద్దన్నం తినే గొప్పవాడయ్యాడని మనం పిల్లలకు నచ్చ చెప్పాలి గానీ, మనమే చద్దన్నం అనగానే ముఖం అదోలాపెట్టకూడదు. ఆహార పదార్ధాల్లో కెల్లా చద్దన్నమే అత్యంత శక్తిదాయకమైనది, ఆరోగ్యదాయకమైనదీ కూడా! చద్దన్నం (పెరుగన్నం) పెట్టకుండా రెండిడ్లీలు పెట్టి పిల్లల్ని బళ్లకు పంపే తల్లులు తమ బిడ్డల్ని అర్థాకలితో పోషిస్తున్నట్టే లెక్క!
ఇడ్లీ ఇతిహాసం
ఒక తెలుగు సినిమాలో కాఫీలు తిన్నారా, టిఫినీలు తాగారా? అని ఓ హాస్య పాత్ర అడుగుతుంది! టిఫిను కాఫీల
సోదరీబంధం ఓ వందేళ్ళ క్రితమే బలపడింది. కాఫీ హోటలుకు వెళ్ళి ఇడ్లీ, అట్టు, పూరీ లేదా, ఉప్మా తిని, కప్పు “కాఫీ”, లేక “టీ” తాగే అలవాటు మనకి గత వందేళ్ళ నుంచే మొదలయింది. అంతకు మునుపు కాఫీ మనకు మాదక ద్రవ్యమే! గొప్పింటివారి పానీయం!
1907లో బిపిన్ చంద్రపాల్ గారు బందరు వచ్చారు. జాతీయోద్యమం తొలిరోజులవి. వందేమాతర ఉద్యమ సందే శాన్ని ఆయన ప్రచారం చేస్తున్నసమయం. కృష్ణాపత్రిక సంపాదకులు ‘ముట్నూరి కృష్ణారావు’ గారు చంద్రపాల్ గారి గౌరవార్ధం విందు చేసి, అందరికీ ఆవడ, కాఫీ వడ్డించారట. వాటిని సేవించిన బ్రాహ్మణ అతిథులు కాఫీ అనే మాదక ద్రవ్యాన్ని సేవించినందుకు వారికి కులవెలి శిక్ష పడినంత పని అయ్యింది. అయ్యదేవర కాళేశ్వరరావు గారు తన “ నా జీవితము-నవ్యాంధ్రము”లో ఈ సంఘటన గురించి వ్రాశారు. అంటే, 20వ శతాబ్ది ప్రారంభం దాకా టిఫిన్లు చేయటం, కాఫీ సేవించే అలవాట్లు మనకు లేవనీ, ఆ తరువాతే తెలుగు ప్రజలకు అవి అలవాటులోకి వచ్చాయనీ అర్ధం అవుతోంది,..
వీటూరి వాసుదేవశాస్త్రి 1938లో “వస్తుగుణప్రకాశిక” గ్రంథంలో ఇడ్డెనల గురించి వ్రాస్తూ, “కాఫీ హోటళ్ళలో నిది ప్రథానమగు ఫలహారపు వస్తువు. ఇరువది సంవత్సరముల ను౦డి దీనికి కలిగిన ప్రభావము, వ్యాప్తి వర్ణనాతీతము. దీనికై ప్రత్యేకముగ ఇడ్లీపాత్రలు బయలు దేరినవి, నాగరికత గల ప్రతి కుటుంబములోనూ యుదయము నిడ్డెన తయారు చేయుచునే యు౦దురు” అని వ్రాశారు. ఈ మాటల్నిబట్టి 1920కి పూర్వ౦ మనపూర్వులు ఇప్పటి పద్ధతిలో ఇడ్డెనులను వండేవారు కాదనీ, ఇలా తినే వారు కాదని తేలికగా గ్రహించవచ్చు.
ఉప్పుడురవ్వ అంటే పులవబెట్టిన బియ్యపు రవ్వ. దీనితో చేసిన ఇడ్లీని సా౦బారు, చట్నీలతో తిని వెంటనే, పాలు పోసి కాచిన కాఫీ/టీ తాగటం వలన, విరుధ్ధ పదార్థాలు సేవించినట్టు అవుతుందనీ, అందువలన అజీర్తి పెరుగుతుందనీ ఈ గ్ర౦థ౦ 1938లోనే హెచ్చరించింది. ఇడ్లీ కాఫీ అక్కా చెల్లెళ్ళే గానీ తోడికోడళ్ళు కాదన్న మాట.
ఆ రోజుల్లో ఇంగ్లండులో కూడా కాఫీ హౌసులు ఉండేవి. అక్కడ కాఫీతో పాటు కొద్ది పాటి శ్నాక్స్ మాత్రమే దొరికేవి. భారతదేశంలో మాత్రం కాఫీ హోటలంటే టిఫిన్లు తినే చోటు అనే అర్థం స్థిరపడింది.
600 యేళ్ళ క్రితం శ్రీనాథుడు దమయంతీ స్వయంవరానికి వచ్చిన అతిథులకు భోజనంలో వడ్డించిన అనేక రకాల వంటకాల్లో ఇడ్డెనలు కూడా ఉన్నట్టు వ్రాశాడేగానీ, ఉదయం పూట ఇడ్లీ ఉప్మా చట్నీ సాంబారు వడ్డించినట్టు వ్రాయలేదు.
వెనకటికి ఓ అత్తగారు కొత్తల్లుణ్ణి” నాయనా! చద్దన్నం తింటావా? చక్కిలాలు తింటావా? మధ్యాన్నం మీ మావగారితో భోజనం చేస్తావా?” అనడిగిందట. దానికి ఆ అల్లుడు “ముందు చద్దన్నం తింటాను, తరువాత చక్కిలాలు తింటాను. ఆనక మావగారితో అన్నం తింటాను” అన్నాడట. ప్రొద్దున్న పూట చద్దన్నమో, చక్కిలాలో తిన్నారే గానీ బక్కెట్టు సాంబారుతో రెండిడ్లీ తినేవారు కాదని ఈ సామెత చెప్తోంది.
టిఫిన్లపుట్టు పూర్వోత్తరాలు
1611లొ ఆంగ్లేయులు గ్లోబ్ అనే ఓడలో మొదటగా బందరు ఓడరేవులో దిగారు. క్రమేణా దేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలపాటు దేశాన్ని ఏలారు. బ్రిటిష్ యుగంలో మనం తెలివి మీరింది తక్కువే గానీ దొరల అలవాట్లు వంటబట్టి నాగరికత మీరింది ఎక్కువ. టిఫిన్లు తినే అలవాటు అలా సంక్రమించిందే మనకి.
ఇక్కడో. విచిత్రమైన కథ ఉంది. మద్రాసు కేంద్రంగా మనల్ని పరిపాలించటం మొదలెట్టిన తరువాత ఆంగ్లేయులు ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మాలను కూడా ఇష్టపడి మధ్యాహ్నం తేలికగా వాటిని తినటానికి అలవాటు పడ్డారు. సాధారణంగా ఆంగ్లేయులు ఉదయంపూట చాలా తేలికగా ఆహారం తీసుకుంటారు. మధ్యాహ్నం అల్పాహారం, రాత్రికి ఘనమైన ఆహారం తీసుకోవటం వాళ్ళ అలవాటు. మధ్యాహ్నం పూట తీసుకునే అల్పాహారాన్ని(లంచ్) ఇంగ్లీషు పామరజనులు ‘టిఫింగ్’ అనే వాళ్ళట. ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మాలను మధ్యాహ్న భోజనంగా తీసుకొనేవాళ్లు కాబట్టి, ఈ టిఫింగ్ లేదా టిఫిన్ అనే మాట వాటికి వర్తించటం మొదలయ్యింది. అది క్రమేణా ప్రధాన ఆహారానికన్నా భిన్నమైన దాన్ని తీసుకోవటం అనే అర్ధంలో వ్యాప్తిలోకి వచ్చింది. చివరికి అదే మన భారతీయ సాంప్రదాయం, తరతరాల సంస్కృతి అన్నంతగా మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చింది.
భారత దేశంలో అలా కొత్త అర్థాన్ని సంతరించుకున్న ఈ టిఫింగ్ మన పామర భాషలో టిఫిన్‘ గానూ ప్రామాణిక ఆంగ్ల భాషలో ‘లంచ్’ కి పర్యాయ పదంగానూ మారిపోయింది. ఆంగ్లేయులకు లంచ్ అంటే స్వల్ప భోజనం. అదే టిఫినంటే!
మనకు పగలు పెద్ద భోజనం, రాత్రి అల్పారం అలవాటు. 30-40 యేళ్ల క్రితం వరకూ తెలుగు వారి పెళ్ళి భోజనాల్లో రాత్రిపూట చాలా తేలికగా అరిగేవే ఉండేవి. పగటి పూట భోజనంలో పప్పు వడ్డిస్తే రాత్రి భోజనాల్లో కందిసున్ని వడ్డించేవాళ్లు. కానీ, యూరోపియన్లు రాత్రి భోజనాన్ని (సప్పర్) చాలా ఎక్కువగా తీసుకుంటారు. ఆ మోజుకొద్దీ మనం విందుభోజనాలను రాత్రి పూట (డిన్నర్) ఏర్పాటు చేస్తున్నాం. యాబై నుండి అరవై వంటకాలను వడ్డించి అత్యంత హెవీ ఆహారం తినటాన్ని వారినుండే అలవాటు చేసుకున్నాం.
స్వాతంత్ర్యానంత్యరం టిఫిన్లు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. బొంబాయి ఒక మహానగరం కాబట్టి, అక్కడ ఉద్యోగం ఒక చోట, నివాసం మరెక్కడో ఉండటాన, ఉదయాన్నే నిద్ర లేచి భోజనం క్యారియర్ కట్టుకు వెళ్లటానికి తగినంత సమయం ఉండదు. దీనికి పరిష్కారంగా ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళకి మధ్యాహ్నానికి భోజనం క్యారియర్‌లు తెచ్చి ఆఫీసుల దగ్గర అందించే ఒక కొత్త కొరియర్ వ్యవస్థ ఏర్పడిందక్కడ. మధ్యాహ్న భోజనాన్ని తెచ్చే భోజనం డబ్బాని ‘టిఫిన్ బాక్స్’, ‘టిఫిన్ క్యారియర్’ అన్నారు. ఇక్కడ టిఫిన్ అంటే ‘మధ్యాహ్న భోజనం’ అని అర్థం.
ఎటుతిరిగీ మహారాష్ట్రులకు భోజనం అంటే చపాతీ, పూరీ, పుల్కాలే కాబట్టి, వాటిని టిఫిన్ అనటం ఒక ఆచారం అయ్యింది. అది చూసిన తెలుగు వాళ్ళు వరి అన్నం కన్నా భిన్నమైన ఆహార పదార్ధాల్ని టిపిన్ అనటం మొదలు పెట్టారు. బొంబాయిలో టిఫిన్ అంటే మధ్యాహ్న భోజనం. తెలుగులో టిపిన్ అంటే ‘అల్పాహారం’ అని కొత్త అర్థాలు స్థిరపడ్డాయి.
టిఫినొద్దు- అన్నమే మేలు
గురువారం , శుక్రవారం, శనివారం ఇలా ఏదో ఒక దేవుడి పేరుతో రాత్రిపూట అన్నం తినకుండా ఉపవాసాలు ఉండాలనుకునేవాళ్ళు ‘ఫలహారం’ అంటే ఏ అరటిపళ్ళో తిని గ్లాసు మజ్జిగ తాగి పడుకోవాలి. కానీ, ఇడ్లీలు, అట్లు, వడలు వీటిని తేలికపాటి ఆహారం అంటూ, లైటుగా తీసుకున్నామని భావించుకోవటం అన్యాయం. శనగచట్నీ, అల్లప్పచ్చడి. నెయ్యి కారప్పొడి, సాంబారు ఇన్నింటితో తిన్న ఇడ్లీ కన్నా అన్నమే మిన్న!
బియ్యపు రవ్వని సంబారాలేమీ లేకుండా కేవలం జీలకర్ర తాలింపు పెట్టుకుని తినటాన్ని ‘ఉప్పిడి ఉపవాసం’ అంటారు. ఇది ఇడ్లీకన్నా మేలైన ఆహారం. శరీరాన్ని శుష్కింపచేస్తుంది. కేలరీలను, కొవ్వునీ పెంచదు. నూనెలు కక్కే, మషాలాలు మండే కర్రీలతో బట్టర్ నానులు తింటూ డైటింగు చేస్తున్నా మనుకోవటం అనాలోచనే అవుతుంది.
కొలిచి చూస్తే, అన్నం కన్నా టిఫిన్ల ద్వారా ఎక్కువ కేలరీలు, కొవ్వు, అనేక విషపదార్ధాలు, మషాలాలు మన కడుపులోకి వెడుతున్నాయి. తాజాగా పీజాలు, బర్గర్లు కూడా ఈ టిఫిన్ల జాబితాలో చేరాయి. మనకు నోరుతిరక్కుండా చం చం, జంజం అనే పేర్లు పెడితే మనం ఒళ్ళు మరిచి తినేస్తున్నాం. టిఫిన్లు ఇలా మనల్ని నానారకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయి. డైటింగ్ చేయాలంటే టిఫిన్లకు బదులు కొద్దిగా అన్నమే తినండని వైద్యులు సూచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. దేవుడికి హాయ్ చెప్పి పీజ్జాలు, బర్గర్లు, చైనా నూడిల్స్ మహానివేదన పెట్టే కాలం దరిదాపుల్లోనే ఉంది.
2017 ఏప్రిల్ నెల ఆంధ్రప్రదేశ్ పత్రికలో ప్రచురితం

No comments:
Post a Comment