Sunday, July 12, 2020

అందరూ బాగుండాలి

అందరూ బాగుండాలి

🌹🙏తిండి, నిద్ర, సంతానోత్పత్తి, విసర్జనలాంటి దేహ ధర్మాల్లో మిగతా ప్రాణులకు, మనిషికి భేదం లేదు. జనన మరణాల మధ్య నడిచే ప్రాణుల జీవన ప్రయాణంలో మనిషికి మాత్రమే ఉన్నత లక్ష్యంతో జీవించే అవకాశం దక్కింది. మిగతా ప్రాణులు యాంత్రికంగానే జీవించగలవు !!

సృష్టిలోని సమస్త జ్ఞానాన్ని అందిపుచ్చుకోగల బుద్ధి సమర్థత, వాక్‌ శక్తి, అసాధ్యకార్యాలను సుసాధ్యం చేసేందుకు అనువైన శరీర నిర్మాణం మానవ జన్మకు ఉత్కృష్టత కల్పించాయి.
పరిశ్రమల్లో వాడే ఒక యంత్ర పరికరం విలువను దాని నాణ్యత, సామర్థ్యాన్ని బట్టి నిపుణులు నిర్ణయిస్తారు. అలాగే మానవ దేహమనే యంత్రం విలువను, దాని అసాధారణ శక్తి సామర్థ్యాల ఆధారంగానే లెక్కించి, మానవ జన్మ దుర్లభమని మహర్షులు నిర్ధారించారు. ఇంతటి శక్తిమంతమైన సాధనా పరికరం సృష్టిలోనే మరొకటి ఉండే అవకాశమే లేదన్నారు. అద్భుతంగా పనిచేయగలిగే ఈ దేహమనే యంత్రాన్ని పొందిన మనిషి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి !!

ఒక సాంకేతిక పరికరం ఎంతటి శక్తిమంతమైనదైనా వినియోగించే వ్యక్తికి నైపుణ్యం లేకపోతే వృథా అయినట్లే. మనిషిగా పుట్టినా సార్థకతకు ప్రయత్నించని జీవితమూ వ్యర్థమవుతుంది. దేహాన్ని వాంఛలు తీర్చే ఉపకరణంగా భావించకు, చీము నెత్తురుతో నిండినదని నీచంగానూ చూడకు, దీన్ని ఒక వరంగా దర్శించు అంటాయి ఉపనిషత్తులు.
మనిషి తనను తాను ఉన్నతుడిగా భావించినప్పుడే, ఉన్నత కార్యాలపై దృష్టి సారించి, ఉత్తమ లక్షణాలను అలవరచుకోగలడు !!

ఆదర్శవంతమైన జీవితం వైపు అడుగులు వేయగలడు. జన్మ సార్థకతకు చేసే ప్రయత్నమంటే ముక్కు మూసుకుని తపస్సు చేయడం కాదు- ముందుగా తనను తాను సంస్కరించుకుని ఇతరులనూ సంస్కరించడం. మనిషి జన్మకు ఇదే సార్థకతను చేకూరుస్తుంది. ఇదే నిజమైన ముక్తి మార్గం. మనసును అంటిపెట్టుకున్న సంకుచిత స్వార్థ స్వభావం, కపట అసూయాద్వేషాల వంటి దుష్ట సంస్కారాలే బంధనాలు. తాను నిర్మించుకున్న బంధనాల్లో తానే ఇరుక్కుని, బయట సహాయాన్ని అర్థించడం అంటే ఇంటిలోపల నాలుగువైపుల తలుపులు బిగించుకుని తీయమని బయటవారిని ప్రాధేయపడటంలాంటిది.
మనిషి తన కల్పన, అనుమానాలతో రూపొందిన లోకంలో జీవిస్తాడు. అనుభవం అసంపూర్ణంగానే ఉంటుంది. స్వీయ బలహీనతల ఆధారంగానే మనోబుద్ధులూ ఉంటాయి. ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి, పుష్కలంగా వెలుతురు రావాలంటే- తలుపులు విశాలంగా తెరవాలి. అలాగే మనసును విశాలం చేసి చూస్తేనే, తనలోని లోటుపాట్లను మనిషి గ్రహించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలడు. ఈ ప్రయత్నం సత్‌ పురుషుల సాంగత్యానికి దారి చూపుతుంది. వారి నుంచి నిస్వార్థచింతన అలవరచుకొనే అవకాశం కలుగుతుంది !!

సత్పవ్రర్తన, సత్కర్మలు, సేవా భావాలకు ఇక్కడే బీజాలు పడతాయి. ‘నా ఎదుగుదల ఇతరులకోసం’ అనే భావనతో ఉన్నత స్థితిని పొందగలడు.
పరులకు ఏ విధంగా నేను సహాయపడగలను అనే ఆలోచన మొదలైతే మనిషి జన్మ సార్థకమైనట్లే. ‘ఇవ్వడంలోనే నాకు ఆనందం ఉంది...ఇతరులకు సహాయపడనప్పుడు నేను బతికి ఉండి ఏమి ప్రయోజనం?’ అని తరచూ అనేవారు కంచి పరమాచార్యులు. ‘లోకాస్సమస్తా స్సుఖినోభవంతు’ ఆర్ష వాక్యాన్ని తపస్సుగా చేసుకొని జీవించడమే సార్థకత. అదే ముక్తి, కైవల్యం, పరమపదం.🙏🌷

Source - whatsapp message

No comments:

Post a Comment