Tuesday, July 21, 2020

పురంజనోపాఖ్యానం

పురంజనోపాఖ్యానం

👌పూర్వకాలంలో ‘పురంజనుడు’ అనబడే రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమయిన కోట, తాను నివసించడానికి యోగ్యమయిన రాజ్యమును అన్వేషిస్తూ బ్రహ్మాండములు అన్నిటా తిరిగాడు. కానీ ఆయనకు ఏదీ నచ్చలేదు. చిట్టచివరకు హిమవత్పర్వతపు దక్షిణ కొసను ఉన్నటు వంటి ఒక దుర్గమును చూశాడు. ‘ఇది చాలా బాగుంది. నేను ఇందులో ప్రవేశిస్తాను’ అని అనుకున్నాడు. అపుడు అందులో నుంచి చాలా అందమయిన యౌవనము అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనుక అయిదు తలల పాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన పదకొండు మంది కాపలా కాసే భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనుక నూర్గురు చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడను చూసి పురంజనుడు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించాడు.

పురంజనుడు తాను ఒక్కడినే ఉన్నానని తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన వెనక ‘అవిజ్ఞాతుడు’ అనబడే మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అనగా తెలియబడని వాడు అని అర్థం. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు. కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడు. అటువంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను ‘నీవు ఎవరు’ అని అడిగాడు. అపుడు ఆమె ‘ఏమో నాకూ తెలియదు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నేను పుట్టి బుద్ధి ఎరిగి ఇక్కడే వున్నాను. ఈ కోటలో ఉంటూ ఉంటాను. నువ్వు మంచి యౌవనంలో ఉన్నావు. నా పేరు ‘పురంజని’, నీ పేరు పురంజనుడు. అందుకని నీవు ఈ కోటలోనికి రా. వస్తే మనిద్దరం మానుషమయినటువంటి భోగములను అనుభవిద్దాము. నూరు సంవత్సరములు నీవు ఇందులో ఉందువు గాని.

ఈ కోటకు ఒక గమ్మత్తు ఉంది. ఈ కోటకు తూర్పు దిక్కుగా అయిదు ద్వారములు ఉంటాయి. ఈ అయిదు ద్వారముల నుండి బయటకు వెళ్ళవచ్చు. కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడినే తీసుకువెళ్ళాలి. ఆ మిత్రులకు పేర్లు ఉంటాయి. వాళ్ళతోనే బయటకు వెళ్ళాలి. అలా ఆ ద్వారంలోంచి బయటకు వెడితే ఒక భూమి చేరతావు. ఆ దేశంలో నీవు విహరించవచ్చు మరల వెనక్కి వచ్చేయవచ్చు’ అని చెప్పింది. ఆయన చాలా సంతోషించి ఆవిడని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు.

పురంజనుడు అంటే ఎవరో కాదు, మనమే. మనకథే అక్కడ చెప్పబడింది. పురంజనుడు కోట కోసం వెదుకుతున్నాడు. వెతికి వెతికి దక్షిణ దిక్కున హిమవత్ శృంగము నందు వ్రేలాడుతున్న కోటను చూశాడు. దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. అనగా ఎనాటికయినా శ్మశానములో చేర వలసినటు వంటి శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. పురంజనుడు అక్కడికి వెళ్లేసరికి ఒక అందమయిన మేడ కనిపించింది. ఇక్కడ మేడగా చెప్పబడినది శరీరములో గల తల. శరీరమునకు పైన చక్కటి ఒక అందమయిన తలకాయ ఉంటుంది. దాని మీద ఉన్న వెంట్రుకలే పూలలతలు. చేతులు కాళ్ళు ఇవన్నీ అగడ్తలు. లోపల ఉన్నటు వంటి ఇంద్రియములు భోగస్థానములు. లోపల రత్నములతో కూడిన వేదికగా చెప్పబడినది హృదయ స్థానము. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. దానిమీద మనం రాత్రివేళ నిద్రపోతాము. అనగా ఇంద్రియములు మనస్సు బడలిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి.

అప్పుడు మనకి ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది.
పురంజని ఎదురు వచ్చి తనను వివాహం చేసుకోనమన్నది. అపుడు పురంజనుడు ఆమెను నీవు ఎవరు అని ప్రశ్నించాడు. ఆవిడ నాకు తెలియదు అంది. ఆవిడ... బుద్ధి... ఆవిడని అయిదు తలల పాము కాపాడుతూ ఉంటుంది. అవే పంచ ప్రాణములు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానము. లనేటటువంటి అయిదు ప్రాణములు.

ఈవిడతో పాటు 11మంది భటులు వచ్చారు. వారే పంచ జ్ఞానేంద్రియములు.. పంచ కర్మేంద్రియములు.. మనస్సు.. ఈ పదకొండింటికి ఒక్కొక్క దానికి కొన్ని వందల వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వారి వెనక వున్న భటులు. ఇంత మందితో కలిసి ఆవిడ వచ్చింది. వివాహం చేసుకోమన్నాడు చేసుకుంది. ఆవిడ ఒక మాట చెప్పింది ఈ కోటకు తూర్పు దిక్కుగా అయిదు ద్వారములు ఉన్నాయి... అందులోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నీవు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలి అని చెప్పింది. అంటే..

మనం అందరమూ అనుభవించేటటువంటి సుఖములే ఈ ద్వారములు. పనులు చేయడానికి మనం అందరం ద్వారంలోంచే కదా బయటకు వెళతాము. జీవుడు కూడా వాటిలోంచే బయటకు వెళ్ళి వ్యాపకములు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కున వున్న రెండు ద్వారములే ఈ రెండు కళ్ళు. ఈ రెండు కళ్ళతో జీవుడు బయటి ప్రపంచమును చూసి దానితో సమన్వయము అవుతూ ఉంటాడు.

ఒకటవ ద్వారము పేరు ‘ఖద్యోత’,
రెండవ ద్వారము పేరు ‘ఆవిర్ముఖి’.

..అవి ఎంత చిత్రమయిన పేరులో చూడండి. ఈ రెండు ద్వారముల లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకొక్క స్నేహితుడితో వెళతాడు..

ఒకడు ‘ద్యుమంత్రుడు’,
రెండవ వాని పేరు ‘మిత్రుడు’..

ద్యు’ అంటే కాంతి. మిత్రుడు అంటే సూర్యుని పేరు. మీరు ఈ కళ్ళతో లోకమును వెలుతురూ వున్నపుడు మాత్రమే చూడగలరు. అందుకని ఈ కంటితో ఈ ఇద్దరు మిత్రులను పట్టుకుని ‘విభ్రాజితము’ అనబడే దేశమునకు వెడుతూ ఉంటాడు. వెళ్ళి ఈ లోకమునంతటిని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి రెండూ రెండు ద్వారములు.

క్రిందను మరో రెండు ద్వారములు ఉన్నాయి. వాటి పేర్లు ‘నళిని’, ‘నాళిని’. ఈ రెండు ద్వారముల నుండి బయలు దేరినపుడు ‘అవధూతుడు’ అనే స్నేహితుడితో వెడతాడు. ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉండరు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు.. వాయువు.. వాయువు అనే స్నేహితునితో ‘సౌరభము’ అనే దేశమునకు వెళతాడు. అనగా ఈ ముక్కుతో వాసనలు పీలుస్తూ ఉంటాడు. సౌరభము అంటే వాసన. ఈవిధంగా అవధూతుని సాయంతో నళిని, నాళిని గుండా సౌరభము అనే దేశమునకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు.

మూడవది.. ఒకటే ద్వారం. దీనిపేరు ‘వక్తము’ అనగా.. నోరు. ఈ ద్వారం లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక స్నేహితుడి భుజమ్మీద చెయ్యి వేస్తాడు. ఆయన పేరు ‘రసజ్ఞుడు’. ఒకోసారి బయటకు వెళ్ళేటప్పుడు రసజ్ఞుడితో వెళ్ళడు. ‘విపణుడు’ అనే ఆయనను పిలిచి ఆయన భుజమ్మీద చేయివేస్తాడు. ‘రసజ్ఞుని’తో వెళ్ళినప్పుడు ‘బహూదకము’ అనే దేశమునకు వెళతాడు. ‘విపణుడి’తో వెళ్ళినప్పుడు ‘అపణము’ అనే దేశమునకు వెడతాడు. రసజ్ఞుడితో వెళ్ళడం అంటే పండుకాయ, అన్నం, పులిహోర, చక్రపొంగలి మొదలయినవి నోట్లో పెట్టుకొని రుచిని తెలుసుకొనుట. విపణుడితో వెళ్ళినపుడు ‘ఆపణం’ చేస్తాడు. ఆపణం చేయడం అంటే మాట్లాడడం. పనికిమాలిన వన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఈశ్వర సంబంధమయిన విషయములు తప్ప మిగిలినవి అక్కర్లేని వన్నీ మాట్లాడతాడు.

కుడిపక్కన ఓక ద్వారం ఉంది. దీనిపేరు ‘పితృహు’. ఇది కుడిపక్క చెవి. ఈ ద్వారంలోంచి ఒకే స్నేహితుడితో బయటకు వెళ్ళాలి. ఆయన పేరు ‘శృతిధరుడు’. అనగా వేదం. దీనితో వెళ్ళినపుడు పాంచాల రాజ్యమునకు వెడతాడు. అనగా వేదములో పూర్వభాగమయిన కర్మలను చేసి ఇక్కడ సుఖములను స్వర్గాది పైలోకములలో సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక క్రిందకు తోసేస్తారు. చాలాకాలమయిన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఎడమ చెవి ద్వారం లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు కూడా శ్రుతిధరుడి మీదనే చేయి వేసుకుని బయటకు వస్తాడు. కానీ ఉత్తర పాంచాల రాజ్యమునకు వెళతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గ. సుఖములను కోరుకోడు. అది వేదము ఉత్తర భాగము. అందుకని ఎడమ చెవి ద్వారం లోంచి వెళ్ళినపుడు మోక్షమును కోరతాడు.

ఆ తర్వాత ఉత్తరము నుండి వెళ్ళే ద్వారమునకు ‘దేవహూ’ అని పేరు. అలాగే తూర్పున తిరిగి ఈ కోటకు క్రింది భాగంలో ఒక ద్వారం ఉంది. అదే మూత్ర ద్వారం. దాని పేరు ‘దుర్మదుడు’ అక్కడ మదమును కల్పించే ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటకు వెళ్ళినపుడు దుర్మదుని భుజమ్మీద చెయ్యి వేసి సుఖమనే సామ్రాజ్యమును చేరతాడు. ఆ సామ్రాజ్యము పేరు ‘గ్రామికము’ పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖమును పొందుతున్నాడు. అందుకని గ్రామికమయిన దేశమునకు వెళతాడు.

పడమట అనగా వెనుక భాగమందు ఒక ద్వారముంది. అది మలద్వారము. దాని పేరు ‘లుబ్ధకుడు’. అంటే ఉన్నదానిని బయట పెట్టని వాడు. లోపలే కూర్చుని వుంటుంది. బలవంతంగా తోస్తే బయటకు వెళుతుంది. అందుకని దాని పేరు ‘వైశసము’. అలా రెండు రకములుగా వెళుతుంది. జీవుడు నేను వెళ్ళను అని ఈ పురమును పట్టుకు కూర్చుంటాడు. ఇందులోంచి బలవంతంగా తీసేస్తారు. అంత పెచీపెట్టి తన శరీరం మీద భోగముల మీద తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాడిని తరిమి తరిమి ఇదే శరీరంలో అధోభాగమున ఉన్న అపానవాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనే భయంకరమయిన నరకంలో యాత్ర మొదలుపెడతాడు.

ఇన్ని.. ద్వారములు ఉన్నాయి. ఇవి కాకుండా తన రాజ్యము నందు ఎందరో ప్రజలు ఉన్నారు. అందులో ఇద్దరు కళ్ళులేని వాళ్ళు ఉన్నారు. వారు పుట్టుకతో అంధులు. పురంజనుడు వారిద్దరి భుజముల మీద చేతులు వేసి వాళ్ళతో కలిసి వెళుతూ ఉంటాడు. ఒకాయన భుజమ్మీద చేయి వేస్తె ఆయన తీసుకువెళుతూ ఉంటాడు. కళ్ళు లేని వాడు. ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. ఆయన పేరు ‘దిశస్మృత్’. రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. వాటిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి.

ఇంకొక అంధుడి మీద చెయ్యి వేసి వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు. చేతులకు కన్నములు ఉండవు. వాటిని ఏమి చెయ్యమంటే దానిని చేస్తూ ఉంటాయి. అలా తాను చేతులతో చేసిన దుష్కర్మల చేత తానె బంధింపబడుతూ ఉంటాడు. అందుకని ఇద్దరు గుడ్డివాళ్ళతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు ‘విషూచుడు’ అనబడే వాడితో అంతఃపురంలో భార్యాబిడ్డలతో ఎప్పుడూ సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒక రోజున గుర్రం ఎక్కాడు. దానికి తన పక్కన 11మంది సేనాపతులను పెట్టుకున్నాడు. ఇవె పది ఇంద్రియములు, ఒక మనస్సు.. వాటికి ఒకటే కళ్ళెం. ఒకడే సారధి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి, చంపకూడని వాటిని కూడా చంపేశాడు. అనగా తాను చెయ్యవలసిన, చెయ్యకూడనివి అయిన పనులను చేశాడు. చంపకూడని వాటిని చంపడం వలన అవి అన్నీ పగబట్టి ఇనుపకొమ్ములు ధరించి కూర్చున్నాయి.

అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యను చూశాడు. ‘అయ్యో నిన్ను విడిచి పెట్టి వెళ్ళిపోయాను. బాగున్నావా.. అన్నాడు. ఆవిడ అలకా గృహంలో ఉంది. అనగా మరల సాత్విక బుద్ధి యందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దది అయిపోతోందేమోనని అనుమానం వచ్చింది. అనగా మెల్లిమెల్లిగా బుద్ధి యందు స్మృతి తప్పుతోంది. వీడికి అనుమానం రాగానే ఒక రోజునస్నానం చేసి ‘ఉజ్వలము’ అనే వస్త్రం కట్టుకుని వచ్చింది. ‘అబ్బో, మా ఆవిడకి యౌవనం తరగడం ఏమిటి’ అనుకున్నాడు. మళ్ళీ కౌగలించుకున్నాడు. ‘ఉజ్వలము’ అంటే తన బుద్ధియందు తనకు భ్రాంతి. అయినా ‘నా అంతవాడిని నేను’ అంటూ ఉంటాడు...

Source - Whatsapp Message

No comments:

Post a Comment