Monday, August 24, 2020

బ్రహ్మ ముహూర్తం

బ్రహ్మ ముహూర్తం

ఒక కోతి తన పిల్లకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమురాలుగా తీర్చిదిద్దాలనుకుని ఎలుగుబంటి నిర్వహిస్తున్న పాఠశాల్లో చేర్పించి, తన పిల్ల చదువులో ముందంజలో ఉండాలంటే ఏమి చేయాలని గురువుని అడిగింది ..

పాఠశాల్లో చెప్పిన విషయాలను వేకువనే మననం చేసుకుంటే సరిపోతుంది సూచన చేసింది ఎలుగు గురువు.

కోతికి కోడి గుర్తుకు వచ్చింది. వేకువనే నిద్రలేపే ఒకే ఒక సాధనం కోడి మాత్రమేనని గుర్తించింది. కోడిని వెతుక్కుంటూ నడవసాగింది కోతి. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు కోడి ఎదురైంది.

'కోడిబావా..!' అంటూ ఆప్యాయంగా పిలిచింది కోతి.వయ్యారంగా నడుస్తున్న కోడి చటుక్కున ఆగి కోతి వైపు చూసింది.
'నీతో పని పడింది. నా పిల్లకు వేకువ చదువు అవసరమని ఎలుగు గురువు చెప్పింది. వేకువనే మేల్కొలిపే శక్తి నీ ఒక్కదానికే ఉంది. నా నివాసం పక్క నీ నివాసం ఏర్పుచుకుంటే చాలు. నువ్వు నాకు మేలు చేసినదానివవుతావు' కోడిని ప్రసన్నo చేసుకునే పనిలో పడింది కోతి.
'నీ నివాసం పక్క నా నివాసం ఏర్పర్చుకుంటే నా తిండి విషయం ఎవరు పట్టించుకుంటారు?' గడుసుగానే అడిగింది కోడి.
'నీకు కావాల్సిన తిండిని నేను సమకూరుస్తాను' హామీ ఇచ్చింది కోతి.

కోడి అంగీకరించి కోతి నివాసముంటున్న చెట్టు వద్దకు వెళ్లింది. అక్కడే పక్కనున్న మరో చెట్టు కింద నివాసం ఏర్పర్చుకుంది. దినచర్యలో భాగంగా కోడి తన కూతలను వినిపించసాగింది.
వేకువనే కోడికూతతో మేల్కొని, తన పిల్లచే పాఠశాలలో నేర్చుకున్న విషయాలను వల్లెవేయించడం అలవాటు చేసింది కోతి.

కూతకు ప్రతిఫలంగా కోడి మాత్రం తనకిష్టమైన ఆహార వస్తువుల జాబితా కోతికి చెప్పి తెప్పించుకుని తింటుండేది. హాయిగా రోజులు గడవడంతో కోడికి గర్వముతో పాటు బద్ధకం పెరిగింది. రోజులు గడుస్తున్నాయి. పిల్లకోతికి పరీక్షలు దగ్గరపడ్డాయి. తల్లికోతి మరింత శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టింది.

అది వేసవికాలం కావడంతో ఆహారపదార్థాల కొరత కనిపించసాగింది. బద్ధకస్తుడికి ఆకలెక్కువ అన్న చందాన కోడి రోజు రోజుకి ఆహార పదార్థాల జాబితా పెంచుకుపోవడం మొదలుపెట్టింది. ఆహారపదార్థాల సంపాదనలో కోతి నానా పాట్లు పడుతుండేది. ఇటు పిల్ల చదువు కోసం సమయం వెచ్చించలేక అటు కోడి కోరిన ఆహారపదార్థాలు అందించలేక తల్లికోతి సతమతమౌతుండేది.

తను కోరుకున్న ఆహారపదార్థాలు తెచ్చి ఇవ్వడంలో కోతి శ్రద్ధ వహించడంలేదని భావించిన కోడి, కోతిపై చిర్రుబుర్రులాడుతుండేది. చివరకు కోతిని ఇరకాటంలో పెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలనుకుని 'కోతిబావా! మా బంధువు నన్ను రమ్మని పిలిచింది. వారం రోజుల పాటు అలా వెళ్లొస్తాను. అంది కోడి.

ఆహార సంపాదనలో పడే పాట్లు గుర్తుకువచ్చి, కోడికి ఆహారం సమకూర్చే కన్నా చుట్టాలింటికి పంపడమే మంచిది అనుకుంది కోతి. 'కోడిబావా! బంధువు పిలిచాక వెళ్లకతప్పదు. నువ్వు వెళ్లి రా!' అంది.

బతిమాలుతుందనుకున్న కోతి, అలా చేయకపోవడంతో కోడికి కోపం రెట్టింపు చేసి నా కూత విలువ తెలిసి వచ్చేలా చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉన్నపళంగా అక్కడ నుంచి వెళ్లిపోయింది.

బద్ధకస్తుడికి శ్రమించడమంటే మహా కష్టంగా ఉంటుంది. వారం రోజులు తిండి కోసం నానా తంటాలు పడింది కోడి. కోతి ఆతిథ్యమే మేలని అప్పుడనిపించింది. తిరుగు ప్రయాణమై కోతి నివాసానికి చేరింది.

'కోతిబావా! నేను లేకపోవడం వలన నీ పిల్ల చదువుకు ఇబ్బoది కలిగి ఉంటుంది. బంధుత్వo కన్నా నీ స్నేహమే గొప్పదనిపించింది. అందుకే వచ్చేశాను' అని ఇచ్చకపు మాటలు కలిపింది కోడి.

'కోడిబావా! అలవాటు అనేది గొప్పది. ఇన్ని రోజులుగా సమయానికి కూతతో మేల్కొల్పడం నీ వంతైతే, అది నా పిల్లకు అలవాటుగా మారింది. నువ్వు లేనప్పుడు కూడా అదే సమయానికి మెలుకువ వచ్చేది. యథావిధిగా నా పిల్ల చదువుకుంటుండేది. మంచైనా చెడైనా మనం పిల్లలకు అలవాటు చేస్తే అది స్థిరంగా వాళ్ల బుర్రలో ఉండిపోతుందని అర్థమైంది. ఇక నీ అవసరం లేదు' కోడి ముఖాన్నే అనేసింది కోతి.

నేను కూయకపోతే లోకానికే తెల్లారదనే భావన తప్పని రుజువుకావడంతో కోడి సిగ్గుపడింది. కోతి మాటలతో పెట్టిన వాత చురకలా తగలడంతో ఉసూరుమంటూ అక్కడ నుంచి కదిలింది.

అందుకే మనకు ఐశ్వర్యం వచ్చే కొద్దీ అనిగిమనిగి ఉండవలెను.
శక్తి వచ్చేకొద్దీ చక్కగా ప్రవర్తించడం నేర్చుకొనవలెను.
విజ్ఞానం పెరిగే కొద్దీ విజ్ఞతతో నడుచుకోవడం అలవాటు చేసుకొనవలెను.అంతేగాని నేను లేకపోతే ఈ లోకం నడవదు అనేటువంటి దురాలోచన మన భవిష్యత్తు కి అంత మంచిది కాదు.

అవి నీకు సమకూర్చిన వారికి,వాటిని వెనక్కి తీసుకోవడం తెలుసు. అది అంత పెద్ద పనేమీ కాదు, ఎలా వచ్చాయో
అలాగే పోయే ప్రమాదం కూడా ఉంది.


ఎందుకంటే ఎందుకంటే ఈ సృష్టిలో శతకోటి లింగాలలో మనం ఒక చిన్న లింగం అంతేకాని సృష్టిని నడుపుతున్నది మనం కాదు. మన ఉన్నా మన లేకపోయినా ఈ సృష్టిలో ఏ పని ఎప్పుడూ ఆగిపోదు, ముందుకు సాగిపోతూనే ఉంటుంది అదే సృష్టి ధర్మం.

విజయం మనల్ని వరించాలంటే పనులను బ్రహ్మ ముహూర్తం లో ప్రారంభించడం అలవాటు చేసుకోవాలి.
ఇదే అలవాటు మనం మన పిల్లలకి కూడా చేయాలి.
ఆచరణ అలవాటు అయి వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్షును, ఐశ్వర్యాన్ని, అద్వితీయమైన శక్తులను అందించడంలో తోడ్పడుతుంది.

మనం ఉన్నా లేకున్నా
మన చేసిన అలవాట్లు మన పిల్లలకి శ్రీరామరక్ష ల ఎప్పుడూ కాపల ఉంటాయి.అవి వారిని నిరంతరం రక్షిస్తూ, వారి
విజయాలలో వాటి వంతు సహాయాన్ని అందించేస్తూ ఉంటాయి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment