Wednesday, August 5, 2020

మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట శ్రీ అబ్దుల్ కలాం

మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట
శ్రీ అబ్దుల్ కలాం

ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి అన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...
భారతరత్న, మాజీ భారతదేశాధ్యక్షులు స్వర్గీయ శ్రీ అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ, విద్యార్థులకు మార్గ దర్శనం చేస్తూ పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన ప్రసంగంలో స్వర్గీయ అబ్దుల్ కలాం గారి జీవితంలోని ఘట్టాలు వివరిస్తూ అలవర్చుకోవలసిన విషయాలు చెప్పిన సందర్భంలోవి ఈ మాటలు...

....శారీరక, మానసిక వికలాంగులైన బాలలకు హైదరాబాద్‌లో ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి కలాంగారు ముఖ్యఅతిథిగా వెళ్లారు. 9 మంది పిల్లలకు పరుగు పందెం పెట్టారు. తుపాకీ శబ్దంతో పందెం ప్రారంభమైంది. వాళ్లకున్న ఓపిక, సౌకర్యాన్ని బట్టీ వాళ్లు కుంటుకుంటూ వెడుతున్నారు. ఒకపిల్ల రెండోసారి కూడా కిందపడి లేవలేక ఏడుస్తున్నది. పోటీలోనే ముందు పోతున్న మరో పిల్ల ఇది చూసి వెనక్కొచ్చేసింది. వచ్చి ముద్దు పెట్టుకుని... “ఈ ముద్దుతో నీ బాధ తీరిపోయింది. ఏడవకు. నేనున్నా నీతో” అంది. ఇది చూచి మిగిలిన ఏడుగురూ వెనక్కి వచ్చేశారు. పడిపోయిన పిల్ల చేయి పట్టుకుని లేపారు. తొమ్మిదిమందీ కలిసి జడ్జీల వంక చూస్తూ... “మాకు ఏ బహుమతీ అక్కర్లేదు. మేం కలిసికట్టుగా ఉంటాం. మాకది చాలు. మీరు బహుమతి ఇవ్వాలనుకుంటే అందరికీ ఇవ్వండి లేదా తిరస్కరించాలనుకుంటే అందర్నీ తిరస్కరించండి” అన్నారు. కలాం గారి కంట కన్నీళ్లు బొటబొటా రాలాయి. కలాం గారు తర్వాత సభల్లో విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఇది చెప్పి అలాంటి టీం స్పిరిట్ పెంపొందించుకోమని చెబుతుండేవారు. మీరు కూడా అలా ఒకరికొకరు చెయ్యి పట్టుకుని నడవండి. ఒకరికొకరు ఆదర్శం కండి. మీరు మంచి మాటలు చదవండి. పక్కవాడికి చెప్పండి. మంచిమాటలతో మనుషులను, మనసులను సంస్కరించండి.

మీరు ఏ ఉద్యోగంలోకి ఏ పదవిలోకి వెళ్లాలని కాదు, మిమ్మల్ని అందరూ ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అందుకే అబ్దుల్ కలాం గారు అంటారు... “ఒక చిన్న కాగితం తీసుకోండి. దాని మీద మీరు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి పేరు రాయండి. అతన్ని అనుసరించండి. అతనికి ఋణపడి ఉన్నామనుకోండి. మీరేదయినా మంచి పని చేస్తే ఆయనను గుర్తు తెచ్చుకోండి. ఆ పని చేసినందుకు మిమ్మల్ని చూసి ఆయన గర్విస్తాడని భావించుకోండి. మీరు ఆ పని చేసిన తరువాత, అది ఏదైనా కావచ్చు, అన్యాయం మీద పోరాటం కావచ్చు, ఒక అన్వేషణ కావచ్చు, ఒక ఆవిష్కరణ కావచ్చు. మీరు అందరికీ శాశ్వతంగా గుర్తుండిపోతారు. మీ జీవితమే నలుగురికీ ఆదర్శప్రాయం కావచ్చు. రేపు పొద్దున అది మానవ చరిత్రలో అది ఒక మరిచిపోలేని పేజీ కావచ్చు.” అందుకే మీకందరికీ వినమ్రంగా నేను మనవి చేసుకునేదొక్కటే... సనాతన భూమి, ప్రపంచానికంతటికీ మార్గదర్శనం చేసిన భూమి, నాయకత్వం వహించిన భూమి, ఆదర్శవంతంగా నిలబడిన భూమి ఇది. దీని గౌరవం మీ చేతుల్లో ఉంది.
ఒకసారి కలాంగారు ఒక కాన్వెంట్‌కు వెళ్లారు. అంతా చిన్ని చిన్ని పిల్లలు. వీళ్లకేం తెలుస్తుందకుంటూనే... “పిల్లలూ, జాతీయ సమైక్యత (నేషనల్ ఇంటిగ్రేషన్) అంటే ఏమిటో మీకేవయినా తెలుసా” అని అడిగారు. ఎవ్వరూ చెప్పలేదు. ఇంతలో ఒక చిన్న పిల్లాడు చెయ్యెత్తాడు. మైక్ పుచ్చుకుని వాడిలా అన్నాడు... “ఒక అడవి ఉంది. చాలా పక్షులు, జంతువులున్నాయి. ఉన్నట్టుండి అడవికి నిప్పంటుకుంది. అన్నీ పారిపోతున్నాయి. ఒక చిన్న గోరింకంత పిట్ట దగ్గర్లో ఉన్న ఒక చెరువు దగ్గరకెళ్లి ముక్కుతో నోటి నిండా నీళ్లు పట్టుకుని వచ్చి మంటల మీద చల్లుతున్నది. మంటలన్నాయి కదా... “ఓసి పిచ్చిదానా, నా దెబ్బకు పులులు, సింహాలే పారిపోతున్నాయి. నీవు ఒక్కో చుక్క పోస్తుంటే నేను ఆరిపోతానా” అని వెటకారం చేసింది. దానికా చిన్న పిట్ట “నేను నీరు పోయడాన్ని పారిపోతున్న జంతువులన్నీ చూసి వెనక్కి వచ్చి నీళ్లు తెచ్చి నీ మీద పోస్తే నీవుండవని గుర్తుపెట్టుకో” అని కోపంగా అంది. అన్ని భేదాలు మరిచి అవన్నీ అలా కలసి నీళ్లు తెచ్చిపోయడమే జాతీయ సమైక్యత! అదే నాకు అర్థమైన సమైక్యత సార్” అని చెప్పాడు. కలాంగారు ఆ పిల్లవాడిని ఎత్తి కౌగిలించుకుంటూ... ఇటువంటి పిల్లలు కావాలి దేశానికి అంటూ పొంగిపోయారు. ఇవన్నీ తన "ఇన్‌డామిటబుల్ స్పిరిట్" అనే గ్రంథంలో రాసుకున్నారు. మీరూ చదవండి. స్ఫూర్తి పొందండి. ఇటువంటి వాటితో మీరూ దిశా నిర్దేశం చేసుకోండి.

- శ్రీగురువాణి

Source - Whatsapp Message

No comments:

Post a Comment