Saturday, September 5, 2020

జీవిత కాలంలో ఏ క్షణమూ.. విడవకూడనిది, మరవరానిది- సచ్ఛీలం !

💫 జీవిత కాలంలో ఏ క్షణమూ.. విడవకూడనిది, మరవరానిది- సచ్ఛీలం !
🕉🌞🌏🌙🌟🚩

శీల సంపద ‘సౌశీల్య సంపద కలవాడికి సముద్రం పిల్ల కాలువలా కనిపిస్తుంది. మేరు పర్వతం చిన్న రాయిలా అగుపిస్తుంది. సింహం- జింకపిల్లలా తోస్తుంది’ అంటాడు భర్తృహరి మహాకవి.


సచ్ఛీలత కలిగినవాడికి పాము పూలదండగా, కాలకూట విషం అమృతంగా మారతాయని ఆయన సుభాషితం చెబుతుంది.


సదాచారుడికి పరాజయమే ఉండదు. ఎందుకంటే- అతడు ధర్మవర్తనుడు, సత్యసంధుడు, పర హిత వ్రతుడై ఉంటాడు. ఏ ఆపదా ఏమీ చేయలేదు. ఏ సమస్యా కుంగదీయదు. ఏ దుఃఖమూ దుర్బలుణ్ని చేయదు.


మనిషి తన జీవిత కాలంలో ఏ క్షణమూ విడవకూడనిది, మరవరానిది- సచ్ఛీలం !


ఆరోగ్యం లోపించినా, సంపద తరిగినా మళ్లీ ఏదో విధంగా సంపాదించుకోవచ్చు. శీలసంపద పోతే, తిరిగి పొందడం దుర్లభం !


భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సౌశీల్య సంపదను మానవుడు ఎంతగా పెంచుకుంటే అంత మంచిదని ‘మను స్మృతి’ చెబుతోంది. అతడు ఆర్జించే విద్య, విత్తం, కీర్తి- అవి ఏవైనా శీలసంపద లేనిదే శోభిల్లవని సనాతన ధర్మం స్పష్టీకరిస్తోంది.


మనిషికి మంచి నడవడి ప్రధానమని, అది నశిస్తే ఏ విధమైన శక్తీ అతణ్ని రక్షించలేదని ‘విదుర నీతి’ వెల్లడిస్తోంది. సచ్ఛీలి కానివాడు కుటుంబంలో, సమాజంలో ఒంటరివాడవుతాడు. ఎంత బలగం ఉన్నా అతణ్ని ఎవ్వరూ కాపాడలేరు.


శీలవంతుడు అంటే ఎవరు ?


ధార్మికుడు, సకల ప్రాణుల్ని ప్రేమించేవాడు, సాటివాడైనా అపరిచితుడైనా మేలు చేసేవాడు- సచ్ఛీలుడు. సంయమనం, క్షమ, సహనం కలిగి ఉండటంతో పాటు- తల్లిదండ్రుల్ని, గురువుల్ని, ఇతర పెద్దల్ని ఆదరించే సంస్కారం గలవాడు శీలవంతుడు. అహింస, ప్రేమ, సత్యసంధత వంటి సద్గుణాల్ని అలవరచుకున్నవాడు; క్రమశిక్షణ, సమయపాలన, చిత్తశుద్ధి కలిగినవాడే సచ్ఛీలుడని మన శాస్త్రాలు చెబుతున్నాయి.


సజ్జనుడనేవాడు అరిషడ్వర్గాలకు, సప్త వ్యసనాలకు నిరంతరం దూరంగానే ఉంటాడు. మనిషికి సచ్ఛీల సంపద సిద్ధింపజేయడానికి పూర్వులు ప్రత్యేక సూత్రాల్ని నిర్దేశించారు.

యాజ్ఞవల్క్య స్మృతిలో వాటిని ‘ యమ-నియమాలు ’గా పేర్కొన్నారు.
1. బ్రహ్మచర్యం,
2. దూషణ భూషణలకు అతీతంగా ఉండటం,
3. పరమాత్మ ధ్యానం,
4. నిష్కపటం,
5. పరుల సంపద ఆశించకపోవడం,
6. మధుర సంభాషణ,
7. ఇంద్రియ నిగ్రహం- వీటిని యమము లంటారు.
a. స్నానం,
b. మౌనం,
c. ఉపవాసం,
d. యజ్ఞ నిర్వహణ,
e. వేదాధ్యయనం,
f. గురు శుశ్రూష,
g. బ్రహ్మచర్య దీక్ష,
h. శాంత స్వభావం,
7i. విధి నిర్వహణలో జాగరూకత
- వీటిని నియమాలు గా పేర్కొంటోంది స్మృతి. తేజస్సు, క్షమ, ధైర్యం, అంతశ్శుద్ధి, బాహ్యశుద్ధి, నిరహంకారం - మానవుడి శీల సంపదను రెట్టింపు చేస్తాయి.


ఈ లక్షణాలతో మానవుడు భగవంతుడు కాగలడని ‘భగవద్గీత’లో కృష్ణపరమాత్మ బోధిస్తాడు.


రామాయణ భారత భాగవతాల్లో, అష్టాదశ పురాణాల్లో సౌశీల్యవంతుల పాత్రలు మనకు కొల్లలుగా కనిపిస్తాయి. అవే నేటి మానవాళికి అనుసరణీయాలు. శీలానికి అంతశ్శుద్ధి, బాహ్యశుద్ధి రెండూ అవసరమే !


విద్య, ధనం, యశస్సు పుష్కలంగా లభించినా కొందరు మాననీయులు కాలేరు. వారి మనసు వికారాలతో నిండి ఉండటమే అందుకు కారణం.


శీలాన్ని మించిన సిరులు లేవని, అదే మనిషిని అందరికన్నా గొప్పగా చేస్తుందని యోగి వేమన అంటాడు.


సచ్ఛీలుడి సాత్విక బుద్ధి ఒక్కటే దైవ తత్వాన్ని అందించగలుగుతుంది.దైవ చింతన సచ్ఛీలుడికే సత్ఫలితమిస్తుంది-


అధర్మార్జనతో గుళ్లు గోపురాలు కట్టించేవాడికో, కీర్తి కాంక్షతో దానధర్మాలు చేసేవాడికో కాదు.


ప్రాపంచిక విషయ కశ్మలంలో కొట్టుమిట్టాడేవాడికీ పారమార్థిక చింతన అసలే ఒంటపట్టదు.


వ్యామోహ మమకారాలు తగ్గించుకుంటున్న కొద్దీ, మానవుడు సుగుణాలు పెంచుకోగలుగుతాడు.అప్పుడే ముక్తిసాధనకు ఏ కంటకాలూ లేని చక్కటి బాట ఏర్పడుతుంది !

🕉🌞🌏🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment