Friday, September 4, 2020

వ్యక్తిత్వ వికాసం క్రోధం...ఒక ఆయుధం

వ్యక్తిత్వ వికాసం

క్రోధం...ఒక ఆయుధం
🦚🦚🦚🅰️🦚🦚🦚
సేకరణ:: Admin...

కామం-క్రోధం – ఈ రెండూ దుర్గుణాలు అని ధర్మగ్రంథాలు చెబుతుంటాయి.

మనం వింటుంటాం, కాదనం.

కానీ లోతుగా ఆలోచిస్తే వాటి ప్రయోజనాలు వాటికీ ఉన్నాయి.

సృష్టిలో ఉన్న ఏ భావానికైనా ఒక శక్తి ఉంది. ఆ శక్తిని వినియోగించుకొనే విధానం పైనే వ్యక్తి ఉన్నది, సమాజ ప్రగతి ఆధారపడి ఉంటాయి.

క్రోధం కూడా ఒక శక్తి.

దానికి వినియోగం బట్టి మంచి చెడులను ఆపాదించవచ్చు.

క్రోధమనే ఆయుధాన్ని తెలివైన యోధునిలా వాడుకోవాలి.

అనుకూలతపట్ల కలిగే ప్రీతిని ‘రాగం’ అనీ, ప్రతికూలతవల్ల కలిగే అసహనాన్ని ‘క్రోధం’ అనీ నిర్వచించవచ్చు.


అనుకూలత, ప్రతికూలతలు సాపేక్షాలు. వ్యక్తి స్వార్థం హేతువుగా రేగే క్రోధం పతనహేతువు కానీ ఆత్మరక్షణకు , ధర్మ ప్రతిష్ఠాపనకు ఉపయోగించే క్రోధం ప్రగతి హేతువు.

ధర్మానికీ, సమాజ శ్రేయానికీ భంగం కలుగుతుంటే చూస్తూ ఊరుకోవడం ఉత్తమ లక్షణం కాదు.

అన్యాయంపట్ల, అధర్మం పట్ల ఆగ్రహం శాశ్వత శాంతికి దోహదపడుతుంది.

కనుక సృష్టిలోని ఈ క్రోధ లక్షణాన్ని అంగీకరించవలసిందే, ఆమోదించవలసిందే.


వీలైనంత వరకు హింసకు తావులేని విధంగా సమస్యలు పరిష్కరించేందుకు క్రోధాన్ని వినియోగించుకోవాలి – కత్తిని హంతకుడు వాడినట్లుగా కాక, వైద్యుడు ఉపయోగించినట్లు నిర్వహించడం లాంటిదే ఇది కూడా.


ఒక సర్పం కనిపించిన ప్రతివానినీ కాటు వేస్తుంటే, ఒక మహర్షి ఆ తోవన వెళుతూ మందలించాడు. శాంతి, సహనాల గొప్పదనాన్ని బోధించాడు. సర్పం సిగ్గుపడింది. తన ప్రవర్తనను మార్చుకుంది. కొన్నాళ్ళకు మళ్ళీ అటువైపు వచ్చిన మహర్షి సర్పాన్ని పలకరించి కుశల ప్రశ్న వేశాడు. గాయపడిన శరీరంతో ఉన్న పాము “మహాత్మా! మీ మాటవిని ఔదార్యంతో ఉన్న నన్ను చూసి అందరూ చులకన చేశారు. రాళ్ళతో కొట్టారు. మీ మాటలు విన్నందుకు నా గతి ఇది. సహనం వల్ల శాంతీ సౌఖ్యం లేదనిపిస్తోంది. కానీ గురువాక్యాన్ని ధిక్కరించరాదని మౌనం వహించాను. నా దుస్థితికి మీ సమాధానం ఏమిటి? అని నిలదీసింది.
అందుకు మహర్షి సమాధానంగా ‘నాయనా! ప్రతిదానికీ హద్దు ఉంటుంది. హింసకీ, స్వార్థానికీ వినియోగించే అసహనం, అనవసరపు క్రోధం వదలాలని నీకు చెప్పాను. కాటువేయవద్దని హెచ్చరించానే గానీ, బుసకొట్టవద్దన్నానా?’ అని హితవు చెప్పాడు.


మహిషాసురుని దౌర్జన్యాలను చూసి దేవతలకు కలిగిన కోపం వల్ల వారిలో దాగిన పరాక్రమమంతా వేలికివచ్చి ఆ ప్రతాపం ఒక రూపు దాల్చి దుర్గాదేవి’గా అవతరించింది. అంతర్గత ప్రతాపాన్ని వెలికితీసి, తద్వారా ధర్మాన్ని ప్రతిష్ఠించేందుకు కోపం సాధనమయింది. అందుకే జగన్మాతను ‘క్రోధ సంభవా’ అని కీర్తిస్తున్నాం.


అదేవిధంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వంటి దనుజుల విజ్రుంభణను ఔదార్యంతో సహించరాదు కనుక విశ్వ నిర్వాహకుడైన విష్ణువు వరాహనారసింహాది రూపాలతో ఉగ్రుడయ్యాడు. ధర్మాన్ని నిలిపాడు.


క్రోధగుణం విషయంలో ఆలోచించవలసిన ముఖ్యవిషయాలు –

1. అది స్వభావంగా మారకూడదు

. 2. కోపంతో మనం తన్మయం చెందరాదు.


1. కోపం మన సహజలక్షణం అయితే మనకు కాసింత ప్రతికూలమైన దానిని కూడా తట్టుకోలేక వాగ్రూపంగా, క్రియా రూపంగా భయంకరంగా ప్రతిస్పందిస్తాం. దాని పరిణామాలు భయంకరం. నోటి దురుసు, చేతి విసురు – ఈ రెండూ రాక్షస గుణాలే.

2. క్రోధం కలగగానే దానితో తన్మయం చెందరాదు. క్రోధాన్ని అభినయించాలి. అదీ జీవించుతున్నామా అన్నంత సహజంగా. ఒక అధికారి మెత్తగా ఉండి అమిత ఔదార్యాన్ని చూపించినా ప్రమాదమే. అసలు ఉదారత లేకుండా నిరంతరం ముక్కోపిగా ఉన్నా ఇబ్బందే.


“కోపం వచ్చినప్పుడు నిగ్రహించుకోవాలి. కోపం తెచ్చుకొని శిక్షించాలి” అని శాస్త్రవచనం. కోపం రావడం మనోవికారం. తెచ్చుకోవడం కార్య సాఫల్యతకు కారణం.


తల్లిదండ్రులు పిల్లల తప్పుల్ని చూసిన వెంటనే అసహనంతో దండిస్తారు. భీకరంగా కొడతారు కూడా. గురువులు కూడా అదేపని చేస్తుంటారు.

కానీ ఇది తగిన పని కాదు. పిల్లల్ని తీర్చిదిద్దేటప్పుడు లాలనతో పాటు దండన కూడా అవసరమే కానీ, దాని ప్రయోజనం నెరవేరాలంటే కోపాన్ని అభినయించాలి తప్ప తన్మయులమై కోప ప్రదర్శన చేస్తే అది విపరీత పరిణామాలకు హేతువౌతుంది.

🍁🍁🍁🍁

Source - Whatsapp Message

No comments:

Post a Comment