Wednesday, October 28, 2020

రమణాశ్రమ లేఖలు

అరుణాచల శివ 🙏


రమణాశ్రమ లేఖలు

ఒక దినం కొత్తగా ఆశ్రమానికి వచ్చిన ఆంధ్రులొకరు, నడివయస్సు వారు, భగవానుని సమీపించి “స్వామీ! నేను రామనామం నియమంగా ఉదయం ఒక గంటా, సాయంత్రం ఒక గంటా జపిస్తూంటే, కొంచెం సేపటికే తలపులు ఒకటొకటిగా బయలుదేరి, అంతకంతకు అధికమై, ఎప్పటికో మనం చేసే జపం మరచి పోయామే అని తోస్తుంది. ఏం చేసేదీ?” అన్నాడు.

“ఆ, అప్పుడు మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి” అన్నారు భగవాన్.

అందరికీ నవ్వు వచ్చింది. పాపం, ఆయన ఖిన్నుడై “ఈ అంతరాయాలు రావటానికి కారణం సంసారం గదా. అందువల్ల సంసారం వదలివేద్దామా, అని యోచిస్తున్నా” నన్నాడు.

“ఓహో! అలాగా! అసలు సంసారమంటే ఏమి? అది లోపల ఉన్నదా? బయట ఉన్నదా?” అన్నారు భగవాన్.

“భార్యా, పిల్లలూ ఇత్యాదులండీ” అన్నాడాయన

. “అదేనా సంసారం? వారేం చేసారండీ? అసలు సంసారమంటే ఏదో తెలుసుకోండి ముందు. ఆ తరువాత విడవటం మాట యోచిద్దాం” అన్నారు భగవాన్.

ఆయన నిరుత్తరుడై తలవంచి ఊరుకున్నాడు.

భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది.

కరుణాపూర్ణ దృష్టితో చూస్తూ “భార్యా పిల్లలను వదలి వస్తారనుకోండి, ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారం అవుతుంది. సన్న్యసిస్తారనుకోండి. కఱ్ఱ, కమండలం ఇత్యాదులతో అదొకరకపు సంసారంగా పరిణమిస్తుంది. ఎందుకదీ?

సంసారమంటే మనస్సంసారమే.

ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటే, ఏదీ బాధించదు” అన్నారు భగవాన్.

పాపం ఆయనకి ఇంచుక ధైర్యం వచ్చి “ఆ, అదే స్వామీ, ఆ మనస్సంసారం ఎలా విడవటం?” అన్నాడు.

“అదేనండీ, రామనామం జపం చేస్తున్నా నన్నారు కదా. తలపుల ఒరవడిలో అప్పుడప్పుడు 'అరే! మనం చేసే జపం మరచినామే’ అన్న జ్ఞప్తి వస్తున్నది కదా. ఆ జ్ఞప్తినే వృద్ధిపరచుకొని, ఆ నామాన్నే పట్టుకొంటూ ఉండండి. క్రమంగా తలపుల బలం తగ్గుతుంది.

నామ జపానికిన్నీ క్రమానుసారం అంతరాంతరాలు చెప్పే ఉన్నవి.

పెద్దగా జపించడంకన్న పెదిమ కదిలీ కదలనట్లు జపించడం లెస్స. అంతకన్న చిత్తజపం, దానికన్న ధ్యానం ఉత్తమం” అన్నారు భగవాన్.

ఉత్తమస్త దుచ్చమందతః
చిత్తజం జపధ్యానముత్తమం||

-----భగవాన్ రమణ మహర్షి ఉపదేశసారం నుండి...

అందరూ రమణుల ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ....🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment