Saturday, October 10, 2020

అసలు గొప్పతనం అంటే ఏమిటి...? ఎవరు గొప్పవారు...? మనిషిని ఏది గొప్పగ తయారు చేస్తుంది...?

"గొప్పవారమని గొప్పలు పోతూ
గొప్పలు చెప్పుతు తిప్పలు పడక
దివ్యాత్మను కాంచుచు అంతట
గొప్పగ మారుదమందరు నిజముగ"

అసలు గొప్పతనం అంటే ఏమిటి...? ఎవరు గొప్పవారు...? మనిషిని ఏది గొప్పగ తయారు చేస్తుంది...? ఈ ప్రశ్నలకు సమాధానం మనలో చాలా మందిమి చెప్పలేం.కానీ.....

చాలా విషయాల్లో మనల్ని మనం గొప్పవాళ్ళుగా భావించేసుకుంటూ ఉంటాం.

ఇతరుల కన్నా రెండు పైసలు ఎక్కువున్నప్పుడు, అందమైన మొఖకవళికలు ఉన్నప్పుడు, శరీరసౌష్టం ఉన్నప్పుడు, ఇతరుల కన్నా తెలివితేటలు మనకు కొంచం ఎక్కువున్నాయని నిరూపించబడినప్పుడు, ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, సామాజికంగా గౌరవస్థానంలో ఉన్నప్పుడు, "గొప్ప "కులంలో జన్మించినప్పుడు... ఇలా ఎన్నో సందర్భాలు మనల్ని ఎదుటి వారికంటే గొప్పవారమని భ్రమింపజేస్తూ ఉంటాయి. .

అయితే, కొన్ని సందర్భాలలో ఆ గొప్పతనం "మనది "కాదు.. ఒక్కోక్కసారి డబ్బుది,ఒక్కొక్కసారి హోదాది, ఒక్కొక్కసారి పలుకుబడిది, ఒక్కొక్కసారి కులానిదీ వగైరా వగైరా... ఈ "గొప్పతనాల " అస్తిత్వం క్షణభంగురమే ! .

నిజమైన గొప్పతనం గొప్పవారమని భావించేసుకోవడంలో ఉందా....? ఇతరులలో గొప్పతనాన్ని గుర్తించడంలో ఉందా... ? ఇతరులను తక్వచేయడం ద్వారా వచ్చే గొప్పతనంలో గొప్పతనం ఎక్కడ...? ఆలోచిస్తే గొప్పతనమన్నది మనోజనిత మిథ్యాపరికల్పన అని అర్థమౌతుంది.

శరీర కదలికలో గర్వం ప్రతిక్షణం తొంగిచూస్తూ ఉంటుంది. పరస్పర గౌరవం అనే విలువను జీర్ణం చేసుకొనేవరకు మానవ సమాజం అన్ని స్తరాలలోను ఈ గొప్పతనమనే దోషం నుండి బయటపడటం దుస్సాధ్యమే..

నిజమైన గొప్పతనం ఆస్తిలో లేదు, అంతస్థులో లేదు, హోదాలో లేదు...మరెక్కడుంది...?

సృష్టిలో ప్రతి అణువులో, ప్రతి అంశంలో దాగిన గొప్పతనం గుర్తించడంలో ఉంది. అహంభావాన్ని అదుపులో ఉంచుకోవడంలో ఉంది.

అంతేకాదు... ప్రతివారు ఎవరికి వారే వారి వారిఎవరు స్థానాలలో గొప్పవారని తెలుసుకోవడంలో ఉంది. ఎవరు తాము గొప్పవారమని భావిస్తారో వారు నిజానికి గొప్పవారు కానే కాదు..

నిజమైన గొప్పవారికి తాము గొప్పవారమనే ఆలోచన కూడా ఉండదు. అందుకే గొప్పతనమన్నది ఒక మిథ్యాభావం.

నిజమైన గొప్పతనం ఇతరులను కించపరచదు. నిజమైన గొప్పతనం భేదాలను సృష్టించదు.భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించేది. దర్శింపజేసేదే నిజమైన గొప్పతనం.

భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అంటే..... సృష్టి అంతా వ్యాపించిన దివ్యత్వాన్ని దర్శించడమే !.

-సర్వేజనాః సుఖినోభవంతు._*

Source - Whatsapp Message

No comments:

Post a Comment