Tuesday, October 13, 2020

ఫిలాసఫీ

ఫిలాసఫీ

ఫిలాసఫీ ని బోధించే ఒక ప్రొఫెసర్ గారు తన తరగతిలో బల్ల మీద కొన్ని వస్తువులతో నిలుచుని ఉన్నాడు.

విద్యార్థులు మౌనంగా, ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారు.

కొన్ని క్షణాల తర్వాత, ప్రొఫెసర్ తను తెచ్చిన వస్తువుల్లోంచి ఓ పెద్ద ఖాళీ గాజు జాడీని, కొన్ని గోల్ఫ్ బంతులని బయటకి తీసారు. గోల్ఫ్ బంతులని ఒక్కొక్కటిగా జాడీలోకి జారవిడిచారు. క్లాసంతా నిశ్శబ్దం.

జాడీ నిండిందా ?
అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.

పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.

అప్పుడు ప్రొఫెసర్ తను తెచ్చిన గులకరాళ్ళ కవరు విప్పి, వాటిని కూడా జాడీలో జారవిడిచారు. జాడీని కొద్దిగా కదిలించారు. గులక రాళ్ళన్ని గోల్ఫ్ బంతుల మధ్యకి, అట్టడుగుకి చొచ్చుకుపోయాయి.

క్లాసంతా నిశ్శబ్దం.

జాడీ నిండిందా ?
అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.

తర్వాత ప్రొఫెసర్ తనతో తెచ్చుకున్న ఒక చిన్న పొట్లంలోంచి ఇసుకని తీసి జాడీలో ఒంపారు.అది జాడీలోకి నిరాటంకంగా జారిపోయింది.
క్లాసంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

జాడీ నిండిందా ?
అని విద్యార్థుల్ని ప్రొఫెసర్ అడిగారు.

"నిండింది! నిండింది!" అంటూ విద్యార్థులు ఒకే గొంతుతో అరిచారు.

అప్పుడు ప్రొఫెసర్ అప్పటి దాకా మూత పెట్టి ఉన్న రెండు కాఫీ కప్పులని దగ్గరికి తీసుకున్నారు. వాటి మీది మూతలను తీసి, కాఫీని జాడీలోకి వొంపారు. ఇసుక రేణువుల మధ్య ఉండే ఖాళీ స్థలంలోకి కాఫీ సులువుగా జారుకుంది.

ఈ చర్యకి విద్యార్థులు విరగబడి నవ్వారు.

కాసేపటికి నవ్వులు ఆగాయి. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఇలా అన్నారు --

ఈ జాడీ మీ జీవితాన్ని ప్రతిబింబిస్తోందని గ్రహించండి!

గోల్ఫ్ బంతులు ముఖ్యమైనవి!

దేవుడు, కుటుంబం, మీ పిల్లలు, మీ అరోగ్యం, స్నేహితులు, ఇంకా మీకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలు!
మీ సిరిసంపదలన్నీ పోయినా, ఇవి మీతో ఉంటే మీ జీవితం పరిపూర్ణంగా ఉన్నట్లే !.

గులక రాళ్ళు
మీ ఉద్యోగం, సొంతిల్లు, కారు వంటివి !

ఇసుక - అన్ని చోట్ల ఉండే చిన్నా , చితక విషయాలు!
.
మీరు జాడీని ముందుగా ఇసుకతో నింపేస్తే, గోల్ఫ్ బంతులకి, గులక రాళ్ళకి అందులో చోటుండదు!

జీవితంలో కూడ ఇంతే!

మనం ఎప్పుడూ అంతగా ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలకి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, అసలైన, ముఖ్యమైనవాటిని విస్మరిస్తూంటాం.

మీకూ, మీ వాళ్లకు సంతోషం కలిగించే వాటిపైనే దృష్టి నిలపండి.

మీ పిల్లలతో హాయిగా ఆడుకోండి.

మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

అప్పుడప్పుడు మీ జీవిత భాగస్వామిని బయటకి డిన్నర్‌కి తీసుకెళ్ళండి.

మీరు 18 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారో, అంతే ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపండి.

ఇంటిని శుభ్రం చేసుకోడానికి, నిరూపయోగమైన వాటిని వదుల్చుకోడానికి ఎప్పుడూ సమయం ఉంటుంది
.
గోల్ఫ్ బంతుల వంటి ముఖ్యమైన అంశాలపై ముందు దృష్టి పెట్టండి.

ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి.

మిగిలేదంతా ఇసుకే" –

క్లాసంతా నిశ్శబ్దం

ఇంతలో ఒక కుర్రాడు తనకో సందేహమన్నట్లు చెయ్యి ఎత్తాడు.

"మరి కాఫీ దేనికి ప్రతిరూపం?"
అని అడిగాడు.

"శభాష్, ఈ ప్రశ్న అడిగినందుకు నాకు సంతోషంగా ఉంది.

"మీ జీవితం దేనితో నిండిపోయినా,
ఒక మంచి మిత్రుడితో ఓ కప్పు కాఫీకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది"

అంటూ ప్రొఫెసర్ క్లాస్ ముగించి వెళ్ళిపోయారు.

( ఒక ఆత్మీయుడు పంపిన పోస్టు ).

Source - Whatsapp Message

No comments:

Post a Comment