Sunday, October 4, 2020

వైదిక సంస్కారాలు,షోడశ కర్మలు అంటే ఏమిటి?

వైదిక సంస్కారాలు,షోడశ కర్మలు అంటే ఏమిటి?
🌻🌺🍀🌻🌺🍀🌻

సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము, తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.

సంస్కారములు మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. అవి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత). మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.

వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:

1.గర్భాదానము

స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భములో మంచి పుత్రుని ఆశించి జరిపే కార్యక్రమము ఇది. ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్సంతానాన్ని (పురుష) ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి.

2.పుంసవనం

స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.

ఇది, సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున ఈ రెండు గర్భా కాలమునందే చేయవలెను. పుంసవనము గర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పదిరోజులలో చేయవలెను. ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడింది.

3.సీమంతం

తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం). సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.

4.జాతకర్మ

బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలు. దీంట్లో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయి:

మేథాజనన:
బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలనుఒక సన్నని బంగారుదారంతో శిశువు నోటికందిస్తారు. దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తారు. హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో దీని ద్వారా మనకు తెలుస్తుంది.

ఆయుష్య:
దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువుముందు చదువుతారు.

శక్తి:
తండ్రి బిడ్డ చెవిలో "త్వం...శతమానం భవతి:" అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుతాడు కోసి, శిశువును శుభ్రం చేసి, చనుబాలు పట్టిస్తారు.

5.నామకరణం

నామకరణం అనగా పేరు పెట్టడం. ఆడ, మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్యసూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్యసూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్యసూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాలుండి పేరు చివర అ ఉండాలి.

పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి:

మొదటిది జన్మనక్షత్రాన్ని బట్టి;
రెండవది పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి;
మూడవది ఇలవేలుపును బట్టి;
నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి.
చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. ఐతే లేకలేక కలిగిన సంతానానికి, కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టినవారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచడం కోసం విడ్డూరంగా ఉందే పేర్లను పెడతారు.

6.నిష్క్రమణ

బిడ్డను మొదటిసారిగా ఇంట్లోనుంచి బయటికి తీసుకురావడం. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగుపెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు (అధిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

7.అన్నప్రాశన

మొదటిసారిగా ఘనాహారం తినిపించడం (సాధారణంగా ఆరో నెలలో) అన్నప్రాశన. పెరుగుతున్న బిడ్డ భౌతికావసరాలను తీర్చడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ. సుశ్రుతుడు కూడా ఆరవనెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించి ఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇందుకవసరమైన ఆహారాన్ని కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు. ఒక్కో రకమైన గుణాన్ని పెంపొందించడానికి ఒక్కో రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంస్కారం జరపడం వల్ల వయసుకు తగిన ఆహారం అందడమే గాక ఆహారం పట్ల పవిత్రభావన ఏర్పడుతుంది.

8.చూడాకరణ

పుట్టు వెండ్రుకలు తీయించడం.
పుట్టువెండ్రుకలు తీయించడం. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడొ ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు.

9.కర్ణవేధ

ఇదే చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు. చెవులు కుట్టడానికి వాడే సూది:

క్షత్రియులకు బంగారంతో,
బ్రాహ్మణ, వైశ్యులకు వెండితో,
దేవలుడనే స్మృతికర్త "చెవిరంధ్రాలగుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటివరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది." అని పేర్కొన్నాడు.

10.అక్షరాభ్యాసం

బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని ఏడొ ఏటివరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ ఐన వెంటనే చేయాలని నిర్దేశించారు.

11.ఉపనయనం

అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెందవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.

ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది.

తగిన వయస్సు:
బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;
క్షత్రియుడికి పదకొండు సంవత్సరాలు;
వైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు;

గరిష్ఠ వయోపరిమితి:
బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు;
క్షత్రియుడికి ఇరవైరెండు సంవత్సరాలు;
వైశ్యుడికి ఇరవైనాలుగు సంవత్సరాలు;
కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం (జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు.

12.వేదారంభం

అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీ, దీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది

రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేది,
మూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేది,
నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది.

13.కేశాంత

పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి (గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.

14.సమావర్తన

చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ, యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.

సమావర్తనతో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావడం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం. స్నాతకుడు పెళ్ళి చేసుకుని గృహస్థ జీవితం గడపడానికైనా, తాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడు. మొదటిమార్గం పాటించేవాళ్ళను ఉపకుర్వనులని, రెండవ వర్గం వారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి. అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్తోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.

15.వివాహం

హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి (సవర్ణ), భిన్న గోత్రాలకు, భిన్నపిండాలకు చెందినవారిని ఎంచుకోవడమనే ఆనవాయితీ కొనసాగుతోంది. సపిండకుల (రక్తసంబంధీకుల) మధ్య వివాహాలను అన్నికాలాల్లో నైతికంగానూ, శాస్త్రపరంగానూ పూర్తిగా నిషేధించడం జరిగింది.

వివాహాల్లోని రకాల గురించి తెలుసుకోవడానికి అష్టవిధవివాహాలు చూడండి.

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:

వాగ్ధానం: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)

వర-వరణం: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం

కన్యాదానం: కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం

వివాహ-హోమం: పెళ్ళిలో చేసే హోమం

పాణిగ్రహణం: వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం

హృదయస్పర్శ:హృదయాన్ని తాకడం

సప్తపది: సౌభాగ్యానికి, దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు

అశ్మారోహణ: సన్నికల్లు తొక్కడం

సూర్యావలోకనం: జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం

ధృవదర్శనం: స్థిరత్వానికి సూచిక ఐన ధ్రువనక్షత్రాన్ని చూడడం

త్రిరాత్ర-వ్రతం: మూడురాత్రులు విడిగా ఉండడం

చతుర్ధి-కర్మ: లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.

16.అంత్యేష్టి

హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.

మరణానికి ముందు: మరణమాసన్నమైన వ్యక్తి తన కుటుంబసభ్యులను, బంధువులను, ఆత్మీయులను పిలిపించుకుని కన్నుమూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకుని, వారికి, ప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. వారు తృప్తిగా కన్నుమూయడానికి, మరణానంతరం వారు సంతోషంగా ఉండడానికి వీలుగా వారిపేరుమీద, వీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతాయి.

అంతిమయాత్రకు ముందు: వారు జీవితపర్యంతం రగిలించిన పవిత్రాగ్నిలోకి ఆహుతులు సమర్పిస్తారు. దగ్గరివారు చనిపోతున్నవారి నోట్లో తులసితీర్థం, గంగాజలం వదులుతారు.

పాడె: శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి నిర్మాణం. శవాన్ని దానిమీదికి చేరుస్తారు.

అంతిమయాత్ర: మరణించినవారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి శ్మశానస్థలిని చేరుకుంటారు.

అనుస్తరణి: జీవితసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించినవ్యక్తి తరపున దానంగా ఇస్తారు.

దింపుడుకళ్ళెం: భగవదనుగ్రం వల్లో, చనిపోయినవారి ఆయుస్సు ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపెయ్యడం వల్లో చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతో, బ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్ని నిమిషాలసేపు ఆలస్యం చేయడానికి పాడెను శ్మశానానికి తీసుకువెళ్ళే దారి మధ్యలో దించి శవం చెవిలో మూడసార్లు పేరుపెట్టి పిలుస్తారు. ఒక్కోసారి మరణించారని పొరబాటుగా భావించినవారు తర్వాత తిరిగి లేవడం వల్ల ఈ ఆచారం పుట్టి ఉంటుంది.

దహనం: శరీరాన్ని దహనం చెయ్యడానికి చితిపై ఉంచేముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించడంతోబాటు అంత్యక్రియల్లో భాగంగా వేసే కర్మ కొంత ఉంటుంది. అది పూర్తయాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు.

ఉదకకర్మ: చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం (నీళ్ళు) సమర్పిస్తారు.

ఓదార్పుఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలను, జీవితసత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.

అశౌచం: చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు (సూతకం రెండురకాలు: జాతాశౌచం, మృతాశౌచం).

అస్థిసంచయనం: శరీరం కాలి బూడదైనా ఎముకలు పూర్తిగా కాలిపోవు. ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవడం అస్థిసంచయనం.

శాంతికర్మ

స్మారకం

శ్రాద్ధం

సపిండాకరణ.
🙏🙏💐💐🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment