Tuesday, October 27, 2020

స్వప్న: గురువుగారూ! నన్ను మీ శిష్యురాలిగా స్వీకరిస్తారా? సద్గురు: (నవ్వుతూ) నేను గురువును కానమ్మా....

1.స్వప్న: గురువుగారూ! నన్ను మీ శిష్యురాలిగా స్వీకరిస్తారా?

సద్గురు: (నవ్వుతూ) నేను గురువును కానమ్మా....
ఎందుకో నాకా పేరు వచ్చేసింది...
అందరూ అలా పిలుస్తుంటారు...
నేను గురువని మీరు అనుకుంటే నేను కాదనను.

గురువు బయట ఉండడు.
మీ లోపలే ఉంటాడు.

లోపలుండే గురువు బయట ఉండే గురువుతో ఏకీభవించినప్పుడు...
బయటున్న గురువును గురువు అని వ్యవహరించడం జరుగుతుంది.

2.స్వప్న: ఆధ్యాత్మికంగా తపన ఉంది....
నిశ్చలత కలుగుతుందేగానీ, పరిస్థితుల ప్రభావం వలన ఎక్కువ సమయం అందులో ఉండలేకపోతున్నాను...

సద్గురు: సముద్రం ఉపరితలభాగంలో అల్లకల్లోలంగా ఉంటుంది....

సముద్రగర్భంలో నిశ్చలత ఉంటుంది...

3.స్వప్న: నేను శక్తివంతురాలిని(strong women)...
అనేది మీకు తెలుస్తోందా? యెందుకిలా అడిగానంటే...
నేను శక్తివంతురాలనే విషయాన్ని యెవరూ గుర్తించడం లేదు.... మీకైనా తెలుస్తోందా అని.

సద్గురు: మీలో ఆ ప్రశ్న పుట్టిందంటేనే మీరు శక్తివంతురాలనే...
శక్తి లేనిదే ఆ ప్రశ్నే పుట్టదు.

మొలక మొలిచిందంటే
విత్తనం లోపల ఉందనే అర్థం.

ఆధ్యాత్మికాన్వేషణ ఉందంటేనే
మీలో ఆధ్యాత్మికశక్తి ఉందనే అర్థం.

4.స్వప్న: నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు...

సద్గురు: అది(ఆధ్యాత్మికం) అందరికీ వీలుకాదమ్మా....



5.స్వప్న: ఆత్మానుసంధానం చేయడం ఎలా స్వామీ....

సద్గురు: ఏదో చేసి అనుసంధానం కావడం కాదు...
'ఎప్పుడూ అనుసంధానమై ఉన్నాను' అని జ్ఞాపకం పెట్టుకోవడమే చేయవలసింది.

నిజానికి నీవు జ్ఞప్తిలో పెట్టుకున్నా, లేకున్నా
సదా నీవు ఆత్మానుసంధానమయ్యే ఉన్నావు.

6.స్వప్న: బాహ్యపరిస్థితుల వలన ఆత్మనిష్ఠలో ఉండలేకపోతున్నాను స్వామీ....

సద్గురు: 'పరిస్థితులు' అనేవి ఉంటే 'ప్రభావము' అనేది
లేకుండా ఎలా ఉంటుంది?

ఏది జరిగినా 'సహజంగా జరుగుతోంది' అన్న జ్ఞప్తి ఉంటే చాలు...

జరుగనిది మీరు జరుపలేరు.
జరుగునది మీరు ఆపలేరు.

అది జరిగిపోతూ ఉంటుంది....
మనం ఊరికే చూస్తూ ఉండాలి....

7.స్వప్న: కాని ఆ స్థితిలో యెక్కువ సేపు ఉండలేకపోతున్నాను....

సద్గురు: ఉండగలిగినంత సేపు ఉండండి.
ఉండలేనప్పుడు మానేయండి...తప్పేముంది?

8.స్వప్న: ఆ స్థితి నుండి జారకూడదు కదా...
జారినప్పుడు మళ్లీ ఏవో ఘర్షణలు పడవలసి వస్తుంది...అన్ని పరిస్థితుల్లోనూ "ఒకే స్థితి"లో ఉండలేకపోతున్నాను....

సద్గురు: ఎప్పుడూ "ఒకటి"గా ఉండాలంటే....దాని అర్థం...ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉండవలసి వస్తే అప్పుడు అలా ఉండడమే....

9.స్వప్న: జ్ఞానప్రసూనాంబ అనుగ్రహం వలననే నేను మిమ్మల్ని గానీ, బాబన్నను గానీ తెలుసుకోగలిగానా?

సద్గురు: అంతమాత్రమే కాదు, మేము మిమ్మల్ని తెలుసుకోవడం కూడా జ్ఞానప్రసూనాంబ అనుగ్రహం వలననే జరిగింది.

10.స్వప్న: అనుగ్రహం నాకు లభిస్తుందంటారా?

సద్గురు: 'నేను స్వప్న'ను అని నీవు తెలుసుకుంటున్నావా?

11.స్వప్న: అవునండీ...

సద్గురు: అనుగ్రహం లభించినట్లే.

12.స్వప్న: పాతవాసనల ప్రభావం నాపై పడడం నాకిష్టం లేదు.....

సద్గురు: నీ ఇష్టాయిష్టాలతో పనిలేకుండా అవి వస్తూ పోతూ ఉంటాయి....

ఆకాశంలో మబ్బులు వస్తూ పోతుంటాయి....
ఆకాశానికి, వాటికి సంబంధం లేదు.

అవి మనల్ని టచ్ చేయవు...
టచ్ చేసినట్లు అనిపిస్తాయి...

13.స్వప్న: కానీ వాటి స్పర్శతో దుఃఖం అనుభవిస్తున్నాను కదా...

సద్గురు: అనుభవించాలి.
ఎప్పుడు ఏ వాసనలు వస్తే అప్పుడు ఆ అనుభూతిని అనుభవించి తీరాలి.

14.స్వప్న: నేను ఇది కాను కదా అనిపిస్తుంది....

సద్గురు: కానిదానిని 'నేను కాదు కదా' అని అనుకోవలసిన పని ఏముంది?
అవునన్నా కానిది అవడమెట్లా అవుతుంది?

15.స్వప్న: కర్మతో యుద్ధం చేయమంటారా? లేక
జరగేది జరుగుతుంది అని ఊరక ఉండమంటారా?

సద్గురు: ఏది జరగవలసి ఉంటే అదే జరుగుతుంది.
అది ఒకరి సలహా తీసుకొని ఉండేది కాదు.

మీరెలా ఉండాలో అలానే ఉంటారు.
మీరేమి చేయాలో అదే చేస్తారు.

Expect చేయడం మానుకో.
Accept చేయడం నేర్చుకో.

16.స్వప్న: నాకు నచ్చినట్టు స్వతంత్రంగా జీవించే హక్కు లేదా? అనిపిస్తుంది....

సద్గురు: అట్లా ఉండగలిగితే ఉండండి...
దానికి ఎవరి అనుమతీ అవసరం లేదు.

ఆ అవకాశం లేనప్పుడు అప్పుడు ఎలా ఉండాలో అలానే ఉండండి.

ఫైట్ చేసే శక్తి, ఓపిక ఉంటే చేయండి.
లేనప్పుడు ఉన్న పరిస్థితినే Accept చేసి కాలాన్ని గడిపేయడమే. అంతే.

17.స్వప్న: ఇప్పటివరకు నా జీవితంలో జరిగినదంతా
అవి జరగాలి కాబట్టి జరిగిందా? లేక నా ప్రమేయంతో జరిగిందా?

సద్గురు: మీ ప్రమేయం ఏమీ లేదమ్మా.....

18.స్వప్న: జరుగవలసింది కాబట్టి జరిగిందంటారా?

సద్గురు: అవును. ఉదయం నిద్రలేచింది మొదలు,
రాత్రి పడుకోబోయే ముందువఱకు ఏమేమి జరిగిందనేది Re-collect చేసుకుంటే, జరిగిందంతా ఈశ్వరేచ్ఛ.

19.స్వప్న: అంటే, నా చిన్నప్పట్నుంచి ఇప్పటివరకు జరిగిందంతా...అంటే మీతో ఈ క్షణంలో మాట్లాడేవఱకు జరిగిందంతా దైవేచ్ఛేనా?

సద్గురు: అవును...ప్రతిక్షణము కూడా అదే(దైవేచ్ఛే).
మన లెక్కేమంటే...ఏది నెరవేరుతున్నదో అదంతా దైవేచ్ఛే.

20.స్వప్న: వికల్పాలన్నీ మనవా?

సద్గురు: మధ్యలో మనం జోక్యం చేసుకోవడం వల్ల అలా అనిపిస్తుంది....వికల్పాలని...

21.స్వప్న: ఇంకాస్త వివరించరా.....

సద్గురు: ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వఱకు జరిగినదానినంతా మనం మార్చలేం కదా!
మార్చడానికి వీలులేకుండా జరిగిందే దైవేచ్ఛ.

22.స్వప్న: అంటే గతమంతానా?

సద్గురు: అవును. గతమంతా దేవేచ్ఛే.
భవిష్యత్తు తెలియదు కాబట్టి అది మన చేతుల్లో ఉందో లేదో అనేది తెలియదు.

వర్తమానం ఏమంటే -
గతము, భవిష్యత్తు కలిసే చోటు అది.

మనం ఆ మధ్య గీతలో నిలబడి ఉంటాం.
ఒక అడుగు గతంలో, ఒక అడుగు భవిష్యత్తులో పెట్టి నిలబడి ఉంటాం.

అదే ప్రతిక్షణంలోను జరిగే ప్రక్రియ.

23. స్వప్న: ఇప్పటివఱకు జరిగిన నా కుటుంబ సమస్యలు... నా రీయాక్షన్ వలన జరిగిందా?

సద్గురు: లేదు లేదు...మీ రీయాక్షన్ తో సంబంధంలేదు...

24.స్వప్న: ఇప్పటివరకు అజ్ఞానంతో ఉన్నాను....

సద్గురు: అదేమీలేదు...
అజ్ఞానం అంటే ఏమీలేదు....
మనకు అర్థంకాని జ్ఞానమే అజ్ఞానం.

25.స్వప్న: ఇప్పటివఱకు నేను తెలుసుకోకపోవడానికి కారణం?

సద్గురు: అందులో మీ జోక్యం ఏమీలేదు.

26.స్వప్న: మేము ఇతరులకు మంచి చేయాలనే మనస్తత్త్వం ఉండేవాళ్లం....

సద్గురు: చెడ్డ చేసేవాళ్లు కూడా వాళ్ల జోక్యంతో చేసేది కాదు....

27. స్వప్న: అది కూడా దైవేచ్ఛేనా?

సద్గురు: దానికి ఏ పేరైనా పెట్టుకోండి.

28.స్వప్న: ఆధ్యాత్మికంగా నేను, నా భర్త, నా పిల్లలు ముందుకు వెళ్లాలని ఆశీర్వదించండి...

సద్గురు: అలాగే....అలాగే....

29.స్వప్న: అది ఉంటే, నా జీవితంలో అన్నీ ఉన్నట్టే.

సద్గురు: అలాగే...

30.స్వప్న: దేవుని అనుగ్రహం కావాలనే తపిస్తున్నాను...

సద్గురు: "కావాలి" అని కోరడం కాదు.....
అది Already ఉన్నది కాబట్టే ఇదంతా జరుగుతోంది.

31.స్వప్న: మీతో మాట్లాడాక నాకు చాలా ప్రశాంతత లభించిందండీ...

సద్గురు: నీకు ప్రశాంతత కాదు, నీవే ప్రశాంతత అయిపోయావు.

32.స్వప్న: మీరు పరిచయం కాకముందు నుంచే
మీరు నన్ను కనిపెట్టుకుని ఉన్నారనిపిస్తోంది...

సద్గురు: అందులో సందేహమేమి?

33.స్వప్న: ఇప్పటివరకు నేను చేసిన ప్రయాణమంతా మిమ్మల్ని చేరుకోవడానికే అన్నట్టుంది...

సద్గురు: ప్రయాణం చేసి నన్ను చేరటం కాదు,
నన్ను చేరుకున్నాక చేసిన ప్రయాణం అది.

*

Source - Whatsapp Message

No comments:

Post a Comment