Tuesday, October 6, 2020

కర్మలు చేస్తూ కర్మఫలాన్ని ఏం చెయ్యాలి ?!

💥🧡💥కర్మలు చేస్తూ కర్మఫలాన్ని ఏం చెయ్యాలి ?!💥🧡💥

కొందరికి మనస్సు కుదురుగా ఉండదు. పూర్తిగా దైవకార్యాలలో మునిగిపోతే బ్రతుకుతెరువు ఎట్లా ? అని సందేహం. వాళ్ళు స్వంతపనులు మానుకోలేరు. "అయితే కర్తృత్వాన్ని వదిలి ఎట్టి పనులు చేసినా సరిపోతుంది. అప్పుడవి భగవత్ కర్మలే అవుతాయి గదా !" అని తెలిసినా అలా కర్తృత్వాన్ని వదిలి ఉండలేరు.

కర్తృత్వంతో కర్మలు చేయటం అలవాటు. ఎంతకాదనుకున్నా నేను కర్తననే అహంకారం వదిలిపోదు. మరి అలాంటి వారి గతిఏమిటి ? వారికి కూడా భగవానుడు ఇక్కడొక ఉపాయాన్ని తెలియజేస్తున్నాడు. అదే "సర్వకర్మ ఫలత్యాగం" మనం పనులు చేస్తున్నప్పుడు ఏదో ఒక ఫలితం వచ్చి తీరుతుంది. ఆ వచ్చే ఫలితం మీదనే దృష్టి పెట్టి వస్తుందా ? రాదా ? అనుకున్నంతగా వస్తుందా ? తక్కువగా వస్తుందా ? అని ఆలోచిస్తూ ఉంటే చేసేపని మీద శ్రద్ధ ఉండదు. అందువల్ల నైపుణ్యంగా పనులు చేయలేము. అలా కాకుండా వచ్చే ఫలితాన్ని గురించి పట్టించుకోకుండా, దానిమీద ఏమాత్రం ఆసక్తి లేకుండా శ్రద్ధగా, కర్తవ్య భావంతో, తన విద్యుక్త ధర్మంగా కర్మలు చేస్తుంటే ఆ కర్మలు సక్రమంగా జరుగుతాయి, పనిలో నైపుణ్యం కూడా ఉంటుంది. కనుక కర్మఫలాలను భగవంతునికి అర్పించాలి. అలాచేస్తే లోపల పేరుకున్న రజోగుణం అణగిపోతుంది !

సరే సర్వకర్మ ఫలత్యాగం అన్నారు గదా ! అంటే పాపకర్మల ఫలాన్ని కూడా అర్పించాలా ? చెడ్డకర్మలను, పాపకర్మలను వదిలివేయాలని ముందే చెప్పుకున్నాం. కనుక శాస్త్రవిహిత కర్మలనే చేయాలి. వాటి ఫలాన్నే వదిలివేయాలి. పాపకర్మలు అసలు చేయకూడదు.

ఈ సర్వకర్మల ఫలత్యాగం అనేది దాదాపుగా అందరికీ అనుకూలమైనదే. కొద్ది ప్రయత్నంతో ఎవరైనా అనుసరించవచ్చు. అందుకే "యతాత్మవాన్" అన్నారు. ప్రయత్నించి సాధించుకోవాలి.

నిజంగా భగవద్గీత యొక్క సారమంతా ఇదే. "కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన". కర్మలు చేయుటయందే నీకు అధికారం. ఫలితాన్ని ఎప్పుడూ కోరవద్దు. ఫలాలు కోరేవాడు పిసినిగొట్టు - 'కృపణా ఫల హేతవః' - అని అన్నారు. ఇది భగవద్గీత సారమేగాదు. భగవానుని జీవితసారం కూడా ఇదే.

1. దేవకీ వసుదేవులకు జన్మించినా తల్లిదండ్రుల వాత్సల్యాన్ని కోరలేదు.

2. నంద గోకులంలో వెన్న దొంగిలించినా తనకోసం కాదు, స్నేహితులకు కోతులకు పెట్టేవాడు.

3. కంసుని చంపినా రాజ్యాధికారాన్ని కోరలేదు. అతడి తండ్రి ఉగ్రసేనునికే కట్టబెట్టాడు.

4. జరాసంధుని చంపించినా రాజ్యాన్ని అతడి కుమారుడు సహదేవునే పట్టాభిషిక్తుని చేశాడు.

5. శిశుపాలుని వధించినా అతని కుమారుడు దృష్టకేతువుకే రాజ్యాన్ని అప్పగించాడు. నరకుని చంపి అతని కుమారుడు భగదత్తుని రాజుగా చేశాడు.

6. దంతవక్త్రుని చంపి అతడి రాజ్యాన్ని అతని కుమారునికే ఇచ్చాడు.

7. పౌండ్రక వాసుదేవుని చంపి అతని కుమారునే రాజ్యాభిషిక్తుని చేశాడు.

8. దుర్మార్గుడైన దుర్యోధనుడు సాయం కోరితే తన సైన్యం మొత్తాన్ని త్యాగం చేశాడు. నాకేం ఇస్తావు ? అని అడగలేదు.

9. పాండవులకు ఎంతమేలు చేసినా, యుద్ధంలో ఎంత సాయపడినా తానేమీ ఫలితాన్ని కోరలేదు. రాజ్యంలో వాటా కోరలేదు.

10. రథాన్ని తోలేపని అప్పగించినా అప్పగించిన పనిని శ్రద్ధగా - సక్రమంగా నిర్వర్తించాడే గాని ఏ ఫలితాన్ని ఆశించలేదు. ఇంత చిన్నపనియా ? అనలేదు.

ఆయన ఏపని చేసినా, ఆ పనిని సక్రమంగా నిర్వర్తించటమే గాని కర్మఫలంపై ఏమాత్రం ఆసక్తి లేదు. దేనినీ కోరలేదు.

మరి మనం మాత్రం ఏఫలితం లేకుండా ఎందుకు కర్మలు చేయాలి ? అంటాం.

సూర్యుడు వెలుగునిచ్చి నీవద్ద నుండి ఏం కోరుతున్నాడు ?

వాయుదేవుడు గాలినిచ్చి నీ ప్రాణాన్ని నిలబెడుతూ ఏం కోరుతున్నాడు ?

నదులు నీటినిచ్చి దప్పిక తీర్చి నీనుండి ఏమి కోరుతున్నాయి ?

భూమి నీకు ఆధారంగా ఉండి, పంటల నిచ్చి ఏమి కోరుతున్నది ?

చెట్లు ఫలాలను, పుష్పాలను, నీడను ఇచ్చి ఏమి కోరుతున్నాయి ?

చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఏమి కోరుతున్నాడు ?

మన సమస్త ఇంద్రియాలకు శక్తి నిచ్చి పరమాత్మ ఏమి కోరుతున్నాడు ?

కానీ దేవాలయంలో పూజగాని, అభిషేకం గాని చేయించిన తరువాత "ఏతత్ ఫలం సర్వం పరమేశ్వరార్పణ మస్తు" అని పూజారి మంత్రం చదవగానే ఖర్చు మనదీ ఫలితం పరమాత్మకా ? అని లోలోపల గొణుక్కుంటాం అర్థం తెలిస్తే. మనకు పనికన్నా ఫలితం ముఖ్యం. అందువల్ల మనకు బంధమే గాని మోక్షం లేదు.

కర్మఫలం కోరినందువల్ల మళ్ళీమళ్ళీ జన్మలను తెచ్చిపెడుతుంది. జన్మలు మళ్ళీమళ్ళీ కర్మలకు - కర్మఫలాలకు కారణమౌతాయి. ఇలా కర్మ - కర్మఫలం - జన్మ - కర్మ - కర్మఫలం - జన్మ అనే కర్మ - జన్మ వలయంలో, జననమరణ చక్రంలో, కర్మసుడిగుండంలో చిక్కుకుపోతాం. కనుక కర్మలు చేస్తూ కర్మఫలాన్ని త్యాగం చెయ్యాలి. సర్వం శ్రీకృష్ణార్పణం, రామార్పణం, భగవదార్పణం అంటూ సర్వకర్మలను చేయటం నేర్చుకోవాలి. 'గాలికి పోయే పేలపిండిని కృష్ణార్పణం' అనటం కాదు. ఇంట్లో ఉన్నదానిని, నోట్లోకి పోయేదానిని కూడా అనగలగాలి !

🧡💥🧡💥🧡💥🧡💥

Source - Whatsapp Message

No comments:

Post a Comment