Wednesday, October 28, 2020

మనస్సును అదుపులో పెట్టుకొనుట ఎలా..!

💫 మనస్సును అదుపులో పెట్టుకొనుట ఎలా..!

[శ్రీరమణమహర్షి ఇచ్చిన సూచనలు ]

భక్తుడు :
స్వామి, కళ్ళు మూసి ఉంచి ధ్యానములో కూర్చుంటే పర్వాలేదు కాని, అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచపు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఏమి చెయ్యమంటారు ?

శ్రీరమణమహర్షి :
కళ్ళు తెరచి ఉంచినంత మాత్రాన ఏమి అవుతుంది ? ఎలాగైతే నీవు ఇంట్లో కిటికీలు తెరచుకుని నిద్రపోతావో అలాగే మనసును నిద్ర పోయేలా చెయ్యగలిగితే కళ్ళు తెరచి ఉంచినా ఇబ్బంది ఉండదు.

భక్తుడు :
మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా, దానిని నియంత్రించుట మాకు సాధ్యపడడం లేదు స్వామి.

శ్రీరమణమహర్షి :
అవును అది నిజమే. ఎలాగయితే చిన్న పిల్లవాడు తన నీడను తానూ పట్టుకోవాలని పరిగెడుతూ, పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని ఆ పని చెయ్యకుండా అడ్డుకుంటుందో, అదే విధముగా మనము కూడా మన మనస్సు ఎటూ వెళ్ళకుండా అడ్డుకోవాలి.

భక్తుడు :
ఎలా అడ్డుకోగలం స్వామి ?

శ్రీరమణమహర్షి :
వేదాంతమును వినుట మరియు దానిపై ధ్యానము చేయుట ద్వారా మనస్సును అదుపులో పెట్టవచ్చు.

భక్తుడు :
అంటే మనము బాహ్య సుఖాలను వదిలి పెట్టి , ఆత్మానందమును అనుభవించాలి అనా స్వామి ?

శ్రీరమణమహర్షి : ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. మనము చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి. అప్పుడు మిగిలేది ఆనందమే. ఆనందము మన స్వభావము. దాని కోసము మనము ఎక్కడ వెతకక్కరలేదు.

భక్తుడు :
అది అంతా సరే స్వామి, కాని మేము ఎంత కృషి చేసినా మా మనస్సును అదుపులో పెట్టడం మా వాళ్ళ కావటం లేదు. ఏమి చెయ్యమంటారు ?

శ్రీరమణమహర్షి : నవ్వుతూ... తన చేతి వేలిని కంటిపై పెట్టుకుని, "చూడండి, ఈ చిన్న చేతి వేలు కంటికి అడ్డుగా ఉండి ఈ ప్రపంచాన్నే కనపడ కుండా చేస్తోంది. అలాగే ఈ చిన్ని మనస్సు ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించి ఆత్మ జ్ఞానమునకు అడ్డు పడుతుంది. చూడండి అది ఎంత శక్తివంతమైనదో !" 🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment