Sunday, November 22, 2020

ప్రాణాయామం, ధ్యానంతో సత్వగుణం

🌸ప్రాణాయామం, ధ్యానంతో సత్వగుణం🌸

తృప్తిగా ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. ఆనందంగా ఉంటాడు. భౌతిక సంపదలతో పొందిన తృప్తిలాంటిది కాదది.. మానసిక తృప్తి.బయటి విషయాలతో కలిగిన ఆనందంలాంటిది కాదది.. అంతరంగిక ఆనందం. ప్రశాంతంగా ఉండే మనసు.. చేస్తున్న పని మీద నిమగ్నమై ఉంటుంది. ఆ పని చక్కగా జరగడానికి దోహదపడుతుంది. అలా తృప్తితో కర్మలు చేసేవాడికి కర్మఫలాపేక్ష తొలగి.. చేస్తున్న పనులు కర్మయోగంగా మారే అవకాశం కలుగుతుంది. మనసు ప్రసన్నతను పొందిన వారి దుఃఖాలన్నీ నశిస్తాయని.. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి బుద్ధి అన్ని విషయాల నుంచీ వైదొలగి పరమాత్మయందు మాత్రమే స్థిరమవుతుందని.. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు.

శరీరంలో శ్వాస నిరంతరం జరిగే ప్రక్రియ.మన ప్రమేయం లేకుండా జరుగుతూనే ఉంటుంది. మనం ఉన్నస్థితిని బట్టి శ్వాసలో హెచ్చుతగ్గులు జరుగుతాయి. మనసు ఉద్వేగానికి లోనైనప్పుడు శ్వాస వేగంగా జరుగుతుంది. విశ్రాంతి స్థితిలో లేదా గాఢ నిద్రలో శ్వాసక్రియ నెమ్మదిగా జరుగుతుంది. మనసు ఆందోళచెందితే ప్రశాంతతను కోల్పోతాం.ఊపిరితిత్తుల చలనాన్ని నిరోధించడమే ప్రాణాయామం. ఊపిరితిత్తులకు చలనాన్ని కలిగించేది ప్రాణమే. శ్వాసిస్తున్నది, భుజిస్తున్నది ప్రాణమే. ఊపిరితిత్తుల చలనాన్ని నిరోధించడమంటే ప్రాణాన్ని నిరోధించడమే. అదే ప్రాణాయామం. శరీరానికి, మనసుకు ప్రాణమే ఆధారం కాబట్టి ప్రాణాయామంతో మనసునిశ్చలమై ప్రశాంతత లభిస్తుంది. శ్వాస క్రమపద్ధతిలో నిదానంగా జరగడానికి ప్రాణాయామాన్ని అభ్యసించాలి.

ప్రాణాయామం అభ్యాసం చేస్తున్న సమయంలోనే సాధకుడు శ్వాస నిదానంగా జరగడాన్ని అనుభవిస్తాడు. అభ్యాసం సాధనగా మారి, పత్రిరోజూ ప్రాణాయామం చేస్తుంటే ఆ సమయంలోనే కాక, దినమంతా శ్వాస నెమ్మదిగా జరుగుతుంది. ప్రశాంతతను అనుభవిస్తాం. శరీరం చైతన్యవంతమవుతుంది. శరీరంలోని ప్రతి అణువుకూ ప్రాణశక్తి ప్రసారం జరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సాధన దీర్ఘ కాలం కొనసాగితే అనేక ఫలితాలు కలుగుతాయి. గుణాలను కలుగజేసేది మనసే కాబట్టి ప్రశాంతమైన మనసు సత్వగుణాన్ని కలుగజేస్తుంది. శాంతిని పొందగలుగుతాం. ప్రాణాయామం, ధ్యానం మనసును జయించడానికి చేసే యోగ సాధనలు.

🌹జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః
శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయోః

మనస్సును జయించినవాడు శాంతిని పొంది ఉండడంతో.. పరమాత్మను చేరిన వాడే అవుతాడు. అలాంటివారికి సుఖదుఃఖాలు, చలి, వేడి, గౌరవం, అవమానం.. అన్నీ సమానమే.

Source - Whatsapp Message

No comments:

Post a Comment