Thursday, November 19, 2020

మత్స్యావతారం

మత్స్యావతారం

👉 దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ చేయడం కోసం పరంధాముడు ఎన్నో అవతారాలెత్తాడు. సాధారణంగా అవతారం అంటే జన్మించడం ... పుట్టడం అనే చాలా మంది అనుకుంటూ వుంటారు. కానీ అది సరైనది కాదు ... కర్మవశాత్తు పుట్టడాన్ని జన్మించడం అంటారు ... తన సంకల్పానికి అనుగుణంగా పుట్టడాన్ని అవతరించడం అంటారు.

👉 ఇష్టమైన వారి ఇంట ... కోరుకున్న రీతిగా జన్మించడం మనుషులకు సాధ్యం కాదు. అదే భగవంతుడైతే లోక కల్యాణం కోసం, తాను కోరుకున్న వారి ఇంట ... కోరుకున్న విధంగా అన్నింటినీ ఎంపిక చేసుకుని మరీ దివ్య జన్మలెత్తుతాడు. అందుకే ఆయనను అవతారపురుషుడని అంటారు. తాను అనుకున్న కార్యాన్ని పూర్తి చేయడం కోసం తాను ప్రధాన పాత్ర ధారియై ... మిగతా పాత్రలను సైతం సమర్ధవంతంగా నడిపిస్తుంటాడు. అందుకే ఆయనను జగన్నాటక సూత్రధారి అని ముచ్చటగా పిలుచుకుంటూ వుంటారు.

👉 శ్రీ మహావిష్ణువు ... వేదాలను రక్షించడం కోసం 'మత్స్యావతారం', అమృతాన్ని చిలికే సమయంలో 'కూర్మావతారం', భూదేవిని రక్షించడానికి 'వరాహావతారం' ఇలా లోక కల్యాణం కోసం దశావతారాలెత్తాడు. ఒక్కో అవతారానికి ఒక్కో ప్రత్యేకత ... ప్రయోజనము కనిపిస్తాయి. వాటిలో ముందుగా 'మత్స్యావతారం' గురించి తెలుసుకుందాం.

👉 బ్రహ్మ దేవుడి ముఖాల నుంచి వెలువడిన వేదాలను, 'హయగ్రీవుడు' అనే రాక్షసుడు అపహరించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. బ్రహ్మ కోరిక మేరకు హయగ్రీవుడిని సంహరించి, వేదాలను రక్షించి తీసుకు వచ్చే బాధ్యతను విష్ణుమూర్తి తీసుకున్నాడు.

👉 ఇక సత్య వ్రతుడనే రాజు అనుక్షణం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండేవాడు. ఒకరోజున
ఆ మహాభక్తుడు 'కృతమాల' అనే నదిలో తర్పణం వదులుతుండగా, అతని చేతికి ఒక చిన్న చేప పిల్ల తగిలింది. తనని కాపాడమంటూ ఆ చేపపిల్ల కోరడంతో, అతను ఆశ్చర్య పోతూనే దానిని ఇంటికి తీసుకు వచ్చి కమండలంలో ఉంచాడు. మరుసటి రోజుకి దాని ఆకారం పెరిగి పోవడంతో కుండలో వేశాడు.

👉 దాని ఆకారం అలా పెరిగిపోతూనే ఉండటంతో, బావిలో ... నదిలో ... సముద్రంలోకి మారుస్తూ వచ్చాడు. అది మామూలు చేపకాదనీ ... శ్రీ మహావిష్ణువు అవతారమని గ్రహించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై ప్రళయకాలం ఆసన్నమైందని చెప్పాడు. వారంరోజులలోగా నౌకను సిద్ధం చేసుకుని ... అందులో కొన్ని జీవులకూ, ధాన్యపు విత్తనాలకూ, సప్త ఋషులకు స్థానం కల్పించమని చెప్పాడు. ప్రళయకాలం పూర్తి అయ్యేంత వరకూ మత్స్యావతారంలో తాను ఆ నౌకను కాపాడుతూ ఉంటానని అన్నాడు.

👉 సత్యవ్రతుడు.. స్వామి చెప్పినట్టుగానే చేసి ప్రళయకాలం నుంచి బయటపడ్డాడు. ఈ లోగా సముద్ర గర్భంలో దాగిన హయగ్రీవుడిని సంహరించి వేదాలను కాపాడిన విష్ణుమూర్తి, వాటిని బ్రహ్మ దేవుడికి అప్పగించాడు. ఇలా విష్ణు మూర్తి నూతన సృష్టి రచనకూ, వేదాలను కాపాడటానికి మత్స్యావతారమెత్తి యుగ యుగాలుగా పూజలు అందుకుంటున్నాడు.

జై శ్రీ కృష్ణ. ఓం నమో నారాయణాయ

👉 మీ
నారాయణం వెంకటరెడ్డి* 👈

Source - Whatsapp Message

No comments:

Post a Comment