మనిషే మహనీయుడన్న మహా మానవవాది..!!!
———————————————————————
భారతీయ సమాజంలో బౌద్ధం ఒక నిశ్శబ్ద విప్లవం. అది హింసలేకుండా సామాజిక పరివర్తనకు దోహద పడిన విప్లవం. అందరినీ అక్కున చేర్చుకునే విధంగా బుద్ధుడు కుల వ్యతిరేక సమాజాన్ని దర్శించాడు. ఆయన బోధనలు ఎంతో వాస్తవికమైనవి కాబట్టి, శతాబ్దాల తరువాత కూడా మన సమాజానికి ఆ ఆలోచనలు సమకాలీనంగా అనిపిస్తున్నాయి. వైదిక సమాజం ఏర్పరిచిన కులవ్యవస్థను బౌద్ధం విమర్శించడమే కాక, నైతిక విలువలపై ఆధారపడ్డ బౌద్ధ ధర్మాన్ని నిర్మించింది. ఆసియా కంతటికీ దాన్ని వ్యాపింజేసింది. బౌద్దం సమ సమాజాన్ని, మానవ సమానత్వాన్ని కోరింది. పుట్టుకతో వచ్చే హౌదా, ప్రత్యేక అవకాశాల్ని అది నిరాకరించింది. అందుకే బౌద్ధ - బ్రాహ్మణ సామాజిక భావనలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. అందరికీ ఒకే నైతిక విలువను బౌద్ధం ప్రభోదించింది.
బ్రాహ్మణులు ముక్తిమార్గం చూపుతారన్న వాదాన్ని బుద్ధుడు అంగీకరించలేదు. ఎందుకంటే వారు గానీ, వారి పూర్వీకులుగానీ బ్రాహ్మను చూడలేదు. క్రతువుల్లో దేవుళ్ళను ఉద్దేశించి బ్రాహ్మణులుచేసే ప్రార్థనలు పనికిరానివని, బుద్ధుడు ధిఘనికాయం, తేవిజ్జ సుత్తంలో వ్యాఖ్యానించాడు. అవి-ఒక నది ఒడ్డున నిలబడి ఉన్న వ్యక్తి, మరో ఒడ్డును తన దగ్గరికి రావాలని బతిమిలాడుతూ పిలవడం లాంటిదని - అన్నాడు. యజ్ఞయాగాల్లో బ్రాహ్మణులిచ్చే జంతు బలులను కూడా బుద్ధుడు తిరస్కరించాడు. (దిఘనికాయ, కూట దంతస్తుత1) బలులకంటే మనిషి ప్రవర్తన ముఖ్యమని చెప్పాడు. బలులను, క్రతువులను, ప్రార్థనలను బౌద్ధం తిరస్కరించి, మానవ నైతికతకు అత్యంత ప్రాధాన్యాన్నిచ్చింది.
మాటిమాటికీ చన్నీళ్ళలో మునిగి, ఆత్మ శుద్ది చేసుకుంటున్నామనుకునే వారికి బుద్ధుడు జ్ఞానబోధ చేశాడు. ఆత్మ-నీటి ద్వారానో, స్నానం చేయడం ద్వారానో శుద్ధికాదనీ, సత్యానికి కట్టుబడి ఉంటూ, సచ్చీలురై నైతికతతో జీవించడం వల్ల మనసు పరిశుభ్రమవుతుందని, ప్రశాంతత చేకూరుతుందనీ చెప్పాడు. ''పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాదని - శీలం, జ్ఞానం కలిగిన వ్యక్తే మనుషుల్లో గొప్పవాడు అవుతాడు - అని చెప్పాడు (దిఘనికాయం - అగ్గన్న సూత్తాంత).
ఎవరు ఏ కులంలో పుట్టిన వారైనా, బౌద్ధ సంఘంలో చేరిన తర్వాత కులాన్ని వదులుకోవాలి. ఇంటిపేరు వదులుకోవాలి. కుటుంబ నేపథ్యాన్ని వదులుకోవాలి - ఎలాగైతే యమున, గంగ, కృష్ణ, గోదావరి నదులు సముద్రంలో కలిశాక, అవి వాటి అస్థిత్వాన్ని కోల్పోయి మహా సముద్రంగా మారుతాయో - అలాగే 'శ్రమణులు'గా మారినవారు - తధాగతుని ధమ్మ నియమం ప్రకారం 'శాక్యముని కుమారులు'గా వ్యవహరింపబడతారు. అంతకుముందు వైదిక ధర్మానుసారం ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర విభజనలు ఏవీ ఉండవు. సముద్రంగా మారిపోయిన తర్వాత, అందులో ఏ నీరు ఏ నదిలోది అనేది ఎలా తెలుస్తుంది? కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు నాశనమైతే.. మనుషులంతా ఒక్కటేనని ఆధునిక జన్యుశాస్త్రం నిర్ధారించిందే ఒప్పుకోవాల్సి ఉంటుంది.
వైజ్ఞానిక పరిశోధనలేవీ లేకపోయినా, తన తాత్త్విక - ఆలోచనా పటిమతో వేల సంవత్సరాలకు ముందే, ఈ విషయం ప్రకటించిన దార్శనికుడు - బుద్ధుడు! అంతేకాదు, ఆయన మరొక అర్థవంతమైన పనికి పూనుకున్నాడు. సంస్కృతం అగ్రవర్ణాల భాషగా ఉన్న కాలంలో బుద్ధుడు తన బోధనలు - రచనలు అన్నీ ప్రజల భాషలో చేశాడు.జన బాహుళ్యంలోకి పోవాలంటే జనభాషను ఉపయోగించాలన్న ఆలోచన సరైంది. ఆ కాలంలో ప్రజల భాష ప్రాకృతం (పాళీ).. అది శూద్రుల భాష! తన వాక్యాల్ని (బోధనల్ని) ప్రజల భాషలోనే ఉండనివ్వాలని, ప్రజల్ని వారి భాషలోనే వాటిని స్వీకరించనీయాలని చెప్పాడు. ఎవరూ తన మాటల్ని వైదిక - సంస్కృతంలోకి మార్చకూడదని కూడా చెప్పాడు. (వినయ పిటక 2వ సంపుటి 5.33)
వైదిక ధర్మంలో తక్కువగా పరిగణించబడినవారు బౌద్ధ సంఘంలో చేరిన తర్వాత ఉన్నతంగా గౌరవంచబడ్డారు.
మంగలి కుమారుడు ఉపాలి బుద్ధుని ప్రధాన శిష్యుడయ్యాడు. వైశాలి నర్తకి, ఆమ్రపాలి (అంబపాలి) బుద్ధుని శిష్యురాలైంది. మరొక ప్రధాన బిక్కు సునీతుడు బుద్ధునితో తన అనుభవాలను 'థేరగాథ'లో వివరించాడు. ఒకరకంగా తన ఆనందాన్ని వెల్లడించాడు. ధేరగాథ ఉల్లేఖనల ప్రకారం బందిపోటు అంగుళిమాలుడు, పాకీ స్త్రీ సునీత, మాంసభక్షకుడు స్వాపాకుడు, చేపలు పట్టే స్వాతి, గోవులు కాచే నందుడు, వ్యభిచారిణి కుమార్తె విమల, బానిస కూతురు పూర్ణ, వేటగాని కూతురు చాపా వంటి వారంతా భిక్షిణిలయ్యారు. భిక్షువులయ్యారు. నిమ్నవర్గానికి చెందిన సునీతను ఉద్దేశించి ఒక సందర్భంలో బుద్ధుడు ఇలా అన్నాడు.. చిత్తశుద్ధితో ధమ్మాన్ని ఆశ్రయిస్తే నిర్వాణం - ఏ ఒక్క కులానికీ ప్రత్యేక సౌకర్యం కాదు. గాలి అన్ని కులాలకు ఎలాగైతే సమానంగా అందుతుందో.. బౌద్ధ మార్గం కూడా అందరికీ సమానమే! తేడాల్లేవ్-'' అని. ఆ కాలంలో ఎన్నో గణతంత్రాలు బౌద్ధాన్ని స్వీకరించాయి.
మగధ మహారాజు బింబి సారుడు, కోసల ప్రసేనజిత్తు, కాశాంబి, ఉదయినుడు బౌద్ధభిక్షువు లయ్యారు. కుల, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా బుద్ధుడు అందరినీ తన సంఘంలో చేర్చుకున్నాడు. సమ భావానికి, సమానత్వానికి బౌద్ధం ఒక సంకేతమన్నాడు. మూఢత్వాన్ని వదిలించుకుంటూ, వాస్తవాల్ని గ్రహిస్తూ బతకమనిచెప్పిన బుద్ధుడు, ఎంతటి మహా మానవవాది కాకపోతే వేల ఏండ్ల క్రితమే ఇంతటి అత్యాధునిక ఆలోచనా సరళిని ప్రచారం చేస్తాడూ?
జంబూద్వీపంలో అంటే భారతదేశంలో బౌద్ధ సమతా ధమ్మ తత్త్వవేత్తల్లో తొలి తరంలో నాగార్జున, ఆర్యదేవ, అశ్వఘోషుడు - మధ్య తరంలో వసుబంధు, సంఘ మిత్ర, అసంగ భావ వివేకులు - చివరితరంలో ధమ్మపాల, ధర్మకీర్తి, శీలభద్ర గుణమతి, స్థిరమతి, గుణప్రభ, జనప్రభ, ప్రజ్ఞాగుప్త మొదలైనవారు బౌద్ధధమ్మాన్ని, నిర్వాణాన్ని బోధించారు. బౌద్ధంలో క్రతువులు, ఆరాధనలు, పూజలు ఉండవు. దుఃఖ నిర్మూలన అంటే నిర్వాణం పొందాలంటే ప్రతి ఒక్కరూ బౌద్ధ దమ్మాన్ని పాటించాలి. కేవలం తమ వ్యక్తిగత ప్రయత్నం ద్వారానే విజయం సాధించాలి.
తప్పిస్తే, అతని ప్రయత్నానికి ఏ అభౌతిక శక్తీ సహాయపడదు. ఇందులో ''బుద్ధుడు కేవలం మార్గదాత మాత్రమే'' అని చెప్పింది మజ్జిమ నికాయ (111-107). ''భారతదేశంలో పుట్టిన వారిలో అత్యంత మహామహుడు బుద్ధుడు ఒక్కడే. ఆయనను మించినవారు మరొకరు లేరు'' అని చెప్పారు ఆర్థర్ లివ్లిన్ బాషమ్ (1914-1986). భారతీయ ప్రాచీన చరిత్ర సంస్కృతుల గూర్చి పరిశోధనలు చేసిన చరిత్రకారుడు, ఇండాలజిస్ట్. ''బుద్ధుడు పీడిత ప్రజల విముక్తి ప్రదాత, గొప్ప రాజకీయ చింతనా పరుడు'' అని అన్నారు సి.ఎఫ్. కోపెన్. ఈయన మార్క్స్ - ఏంగిల్స్‌లకు మంచి మిత్రుడు. ''బుద్ధుని ప్రస్తావన రాగానే అప్రయత్నంగా చేతులు ముకుళితమవుతాయి'' అని అన్నారు స్వామి వివేకానంద.
రెండున్నర వేల సంవత్సరాల తర్వాత కూడా, ప్రపంచ ప్రజలు ఒక వ్యక్తిని నిండు మనసుతో ఎందుకు స్మరించుకుంటున్నారో ఆలోచించాలి. తరతరాలుగా ఆయన వ్యక్తిత్వం జనాన్ని ఎందుకు ప్రభావితం చేస్తూ ఉందో ఆలోచించాలి. ఆయన వ్యక్తిగత ప్రవర్తన, ప్రచార పద్ధతి, జీవితం అన్నీ - లోకోత్తరమైనవి. ఆయన వ్యక్తిత్వంలో ఒకవైపు రాజ లక్షణాలు, మరోవైపు మౌనుల జ్ఞాన సంపద, లక్ష్యసాధనకు సర్వం త్యాగం చేయడం, ఒక వీరుని ధృఢ దీక్ష... అన్నీ ఆయనలో మేళవించాయి. సునిశితమైన మేధస్సు, ప్రశాంత వీక్షణం, ప్రసంగ నైపుణ్యం, తన సిద్ధాంతాల పట్ల ధృఢ విశ్వాసం.. అన్నీ ఆయన మహనీయతను పెంచుతూ వచ్చాయి. వాటికి తోడు ఆయన మాటల్లో, ప్రవర్తనలో సాత్వికత, మర్యాద, ఔదార్యం, కరుణ - బుద్ధుడి వ్యక్తిత్వానికి వన్నె తెచ్చాయి. క్రీస్తుకు 500 సంవత్సరాలకు ముందు, మహమ్మద్‌కు 1100సంవత్సరాలకుముందే ఆయన మిషనరీలను పంపాడు. ధమ్మం, ప్రేమ, ఉపవసథ (కన్ఫెషన్) ఇలా ఒక్కో మతం ఒక్కో అంశాన్ని బౌద్ధం నుంచే స్వీకరించాయి.
ప్రపంచంలో ఈ రోజు, బౌద్ధంతో ప్రభావితం కాని మతమంటూ ఏదీ లేదంటే - అది అతిశయోక్తి కాదు.
బుద్ధుని ప్రచార పద్ధతి కూడా చాలా విశిష్టంగా ఉండేది. సారి పుత్రుడు, మహామొగ్గల్లణుడు వంటి ధర్మసేనానుల సాయంతో బుద్ధుడుతన ధర్మాన్ని విస్తరింపజేశాడు. ఏది చెప్పినా, ముందు తను ఆచరించి చూపేవాడు కావడంతో ఆయన ఒక సంపూర్ణ నాయకుడయ్యాడు. క్రమశిక్షణ విషయంలో రాజీపడేవాడు కాదు. సంవత్సరంలో 9నెలలు గ్రామ గ్రామానికి వెళ్ళి ధర్మబోధ చేసేవాడు.
బాధాతప్తులను, వ్యాధిగ్రస్తులను ఎప్పుడూ పరామర్శించేవాడు. కరువులు, కాటకాలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యటించేవాడు. వైదిక ధర్మ ప్రభోదకులు చేసే బోధనలకు పూర్తి విరుద్ధమైన పద్ధతిలో ఓపికగా, వివరంగా బుద్ధుడు ధర్మబోధ చేసేవాడు. కొద్ది మంది శిష్యులకు రహస్యంగా పాఠం చెప్పడం, అదీ మార్మిక పరిభాషలో మాట్లాడడం వైదిక బ్రాహ్మణుల పద్ధతి. అందుకు విరుద్ధంగా బుద్ధుడు నేరుగా జన సమూహాలను ఉద్దేశించి ప్రసంగించేవాడు. అందరికీ బోధపడే విధంగా ప్రజల భాషలోనే మాట్లాడేవాడు. శ్రోతల స్థాయికి దిగివచ్చి మాట్లాడేవాడు. నైతిక జీవితం వల్ల కలిగే సంతోషం, సంతృప్తి, ఆరోగ్యం గురించి చెప్పేవాడు. డంబాచారాల వల్ల, అనైతిక జీవన విధానం వల్ల కలిగే నష్టం గురించి మాట్లాడేవాడు. శ్రోతల మనసులో భావోద్రేకాలు నశించి, ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత, బౌద్ధంలోని తాత్త్వికత గురించి బోధించేవాడు. అదికూడా సామెతలు, చారిత్రక సంఘటనలు, కథల ద్వారా విషయాన్ని మనోరంజకంగా మార్చి చెప్పేవాడు.
ఆ విధంగా కాలినడకన ప్రయాణిస్తూ అవిశ్రాంతంగా తధాగతుడు తన ధమ్మ బోధ 45 సంవత్సరాల పాటు విజయవంతంగా కొనసాగించాడు. ఆయన యసస్సును, తేజస్సును చూసి ఓర్వలేక హత్యాప్రయత్నాలు చేసినవారు మట్టికొట్టుకుపోయారు. అసహన పరుల పట్ల ఆయన క్షమాగుణంతో వ్యవహరించేవాడు. హృదయసంబంధమైన గాఢత, ఆత్మస్థైర్యం, నిబ్బరం కలిగి ఉండటం వల్ల ఆయన పరిపూర్ణమైన స్థాయిలో విజయం సాధించాడు. దేవుడు లేడని, ఆత్మ, పునర్జన్మలు లేవని, మనుషులంతా సమానులని, తోటి వారికి సాయపడటమే మానవత్వమనీ, స్వార్థాన్ని జయించాలనీ.. అప్పుడు బుద్ధుడు చెప్పిన విషయాలే నేటి మానవవాదులు చెపుతున్నారు. ప్రచారం చేస్తున్నారు. పాటిస్తున్నారు. అంటే ఏమిటి? బుద్ధుడు ఆధునికుల్లో అత్యాధునికుడు కదా?
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
Source - Whatsapp Message

No comments:
Post a Comment