Monday, February 22, 2021

సూర్య నమస్కారాలు

🧎‍♂️ సూర్య నమస్కారాలు - ఫలితాలు🧎‍♂️

📚✍️ మురళీ మోహన్

🙏సూర్య నమస్కారాలు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్యనమస్కారాలు. నిజానికి సూర్యనమస్కారాలు బ్రహ్మమూహూర్తంలోనే చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడు.

శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువులు. 7 అశ్వాలు 7 కిరణాలు. సుషుమ్నం, హరికేశం, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మానవ శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి.

సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణు రూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.

ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధార భూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ వ్యాదులు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో చెప్పబడింది.

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ 12 ఆసనాలు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు లెక్క. వీటిలో 1 నుంచి 5… 8 నుంచి 12 ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. అయితే ఆసనానికో ప్రయోజనం ఉంటుంది.

ఏ ఆసనంతో ఎలాంటి ఫలితం..
1, 12: ఈ ఆసనాలతో శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాస కోశ వ్యవస్థ మెరుగవుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

2, 11: ఈ ఆసనాలతో జీర్ణ వ్యవస్థను మెరుగవుతుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

3, 10: ఈ ఆసనాలు రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

4, 9: ఈ ఆసనాలు వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.

5, 8: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

6వ ఆసనం: మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

7వ ఆసనం: జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపయోగపడుతుంది.

ఫలితాలెన్నో..
సూర్య నమస్కారాలతో ఎన్నో ఫలితాలు ఉన్నాయి. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు… సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

అయితే సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమలతో కండరాలకు మంచి జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి. గాఢంగా గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంథులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు

1. నమస్కారాసనం (ఓం మిత్రాయ నమ:)
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

2. హస్త ఉత్తానాసనం (ఓం రవయే నమః)
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

3. పాదహస్తాసనం (ఓం సూర్యాయ నమః)
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమి మీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

4. ఆంజనేయాసనం (ఓం భానవే నమః )
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

5. పర్వతాసనం (ఓం ఖగాయ నమః)
కాళ్ళు, చేతులు నేల మీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

6. సాష్టాంగ నమస్కారం (ఓం పూష్ణే నమః)
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి ‘అష్టాంగ నమస్కారం’ అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం... ఈ 8 అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7. సర్పాసనం (ఓం హిరణ్యగర్భాయ నమః)
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.

8. పర్వతాసనం (ఓం మరీచయే నమః)
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

9. ఆంజనేయాసనం (ఓం ఆదిత్యాయ నమః)
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి.

10. పాదహస్తాసనం (ఓం సవిత్రే నమః)
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.

11.హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయ నమః)
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.

12. నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః)
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి

12 భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస,వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల సాధనలివి.

ఆచరణ నియమాలు
కాలకృత్యాలు తీర్చుకొన్న తర్వాత సూర్యనమస్కారాలు చేయాలి.
సూర్య నమస్కారాలు ఆచరించుటకు ఎలాంటి వాతావరణ కాలుష్యం వుండని ప్రశాంత ప్రదేశం ఎంపిక చేసుకోవాలి.
సూర్య నమస్కారాలు వట్టి నేలపై చేయరాదు. తీవాచి లేదా దుప్పటి పైన చేయడం ఉత్తమం.
ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే సూర్య నమస్కారాలు చేయరాదు.
సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చెయ్యాలి.
సాధన సమయంలో ఒక భంగిమ నుంచి మరో భంగిమనకు వెళ్తున్నప్పుడు... స్వచ్ఛంగా భీజమంత్రమును ఉచ్ఛరిస్తూ ప్రశాంతంగా వెళ్లాలి.
ఆరోగ్యం సరిగా లేనపుడు ఉత్తరం-దక్షిణం వైపు చేయవద్దు. ఆరోగ్యం చక్కబడిన తర్వాత తిరిగి ప్రారంభించాలి.

ఉపయోగాలు
సూర్య నమస్కారాల వల్ల.. ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని ప్రాక్రియాసిస్‌ చైతన్యవంతమై ఇన్సులిన్‌ ఉత్పత్తి బాగా జరిగి మధ్యమేహ వ్యాధి తగ్గుతుంది. నాడీవ్యవస్థ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది నరాల బలహీనతను, పక్షవాతవ్యాధిని నివారించును.

హృదయ కండరం, కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా, బలంగా తయారై వాటికి సంబంధించిన వ్యాధులను నివారించును. వెన్ను ఎముకకు రక్తప్రసరణ చక్కగా జరిగి వెన్నెముక దృఢంగా తయారై శరీరానికి నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఆ సూర్యకిరణాల తాకిడికి చర్మవ్యాధులు తగ్గుతాయి. శరీంలోని కొలెస్టరాల్‌ శాతం తగ్గి బానపొట్టలు తగ్గి ఉదర, హృదయ సంబంధ వ్యాధులు తగ్గిపోవును....👍

Source - Whatsapp Message

No comments:

Post a Comment