Wednesday, February 10, 2021

వాదన

వాదన


రెండు పెదవులు దాటివచ్చే మాట మనసులను దగ్గర చేయాలి. మాట నవనీతంలా ఉండి ఎదుటివారిని ఆకట్టుకోవాలి. ఇరువురి మధ్య ఆత్మీయబంధాన్ని దృఢతరం చెయ్యాలి. వాక్కు సరస్వతీ స్వరూపం. ప్రియభాషణం, మృదుభాషణం విలువైన ఆభరణాల్లాంటివి. భర్తృహరి మహాశయుడు ‘వాగ్భూషణంభూషణం’ అన్నాడు.

ఇరువురి మధ్య మాటలు మతి కుదరక శ్రుతిమించితే వాదనగా మారుతుంది. మాటలపోరుగా తయారవుతుంది. కఠినోక్తులు, కరకుదనం చోటుచేసుకుంటాయి.

ఈ పోకడ అర్థంలేని వాచాలతకు దారి తీస్తుంది. ఆధిపత్య ధోరణికి, అహంకారానికి కారణమవుతుంది.

వాదనే అనివార్యమైతే శాస్త్రచర్చలా ఉండాలి. కొత్తవిషయాలను అందిస్తూ, వాస్తవాలను ప్రతిబింబించాలి. రెండు రంగులు కలిస్తే మూడో రంగు కొత్తందాలను సంతరించుకొని, కనువిందు చేస్తుంది. వాదన జరిగినా సంస్కారంతో కూడిన మాటలే వెలువడాలి. మాటల్లో చతురత కనిపించాలి. జ్ఞానప్రపంచం ఆవిష్కృతం కావాలి. కొత్తందాలు భాషామతల్లికి అలంకృతమైనట్లుగా ఉండాలి.

అద్వైత సిద్ధాంత ప్రచారపర్వంలో భాగంగా ఆదిశంకరులు మండనమిశ్రుడితో వాదన జరిపాడు. ఆ వాదనకు న్యాయనిర్ణేత మండనమిశ్రుడి భార్య ఉభయభారతి. వాదనలో ఓడిన మండనమిశ్రుణ్ని, శృంగేరి పీఠాధిపతిగా ఆదిశంకరులు నియమించారు. ఆయనే సురేశ్వరాచార్యుడు. ఉభయభారతి శృంగేరి ద్వారకా పీఠాలకు ‘భారతీ’ సంప్రదాయాన్ని ఇచ్చిన గౌరవం పొందింది.

వాదనలో ఓడినవారిని సైతం గౌరవించే సంస్కృతి మనది. వాదనా పటిమ విషయ సంపదపై ఆధారపడి ఉంటుంది. వాదనలో దాన్ని బహిర్గతపరచే నిపుణత అవసరం. అప్పుడది సర్వజనామోదం అవుతుంది.

వైష్ణవ తత్వవేత్త శ్రీ మద్రామానుజులు పదో శతాబ్దంలో జన్మించారు. ఆయన ఆదిశేషుడి అవతారంగా ప్రతీతి.

వేదోపనిషత్తులను కూలంకషంగా అధ్యయనం గావించి, బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి, తత్వజ్ఞానాన్ని సామాన్యులకు అర్థమయ్యే సులభరీతిలో తేటపరచారు.

తిరుపతిని యాదవరాజులు పాలిస్తున్న కాలంలో, తిరుమలదేవుడి గురించి వైష్ణవ, శైవ, శాక్తేయ శాస్త్ర పండితుల మధ్య రాజసభలో పెద్దయెత్తున వాదోపవాదాలు జరిగాయి. ఏడుకొండలపైన కొలువైన స్వామి విష్ణువా, శివుడా, కుమారస్వామా, శక్తిరూపమా అని రాజసభలో నిరూపణలు, సాక్ష్యాలతో వాదనలు జరిగాయి. శ్రీ మద్రామానుజులు పురాణాల్లోని ఎన్నో అంశాలను, సాక్ష్యాలుగా చూపి ఆ మూర్తి విష్ణువేనని వాదించారు. ఆయన వాదనతో కొత్త విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఆ స్వామి ఏడుకొండల వేంకటేశ్వరుడిగా ఆరాధ్యుడైనాడు. విశిష్టాద్వైతులు, ద్వైతులు, అద్వైతులు, శాక్తేయులు, శైవులు నమ్మికొలిచే దేవుడని తిరుమల చరిత్రామృతం చెబుతోంది.

‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు’ అంటూ అన్నమయ్య కీర్తించాడు.

హంపి విజయనగర ప్రభువైన ప్రౌఢదేవరాయల సభలో శ్రీనాథుడు, డిండిమభట్టుల మధ్య కావ్య, శాస్త్ర, అలంకార, వ్యాకరణాది అంశాలపై వాదన జరిగింది. కొండవీడు కవీశ్వరుడైన శ్రీనాథుడే విజయుడైనాడు, డిండిముడి కంచు ఢక్కను పగులకొట్టించాడు. ప్రౌఢదేవరాయల గౌరవం, ఆదరం- కొండవీడు, విజయనగరాల మధ్య సఖ్యత ఏర్పడేలా చేసింది. కొండవీడుపై రాచకొండ దాష్టీకాన్ని నిలువరించింది.

వ్యక్తిగత ప్రతిష్ఠలకై వాదనలు చోటుచేసుకొంటే, అవి సమస్యలను సృష్టిస్తాయి. ఒకరు ఎక్కువని నిరూపించుకొనేందుకు మరొకరిని తక్కువ చేసే వేదికగా ఉండకూడదు.

సమఉజ్జీల వాదనకే విలువ ఉంటుంది. గుర్తింపు దక్కుతుంది. వాదనలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు శాస్త్ర పాండిత్యం ఒక్కటే సరిపోదు. వాస్తవ ప్రపంచంలోని అనుభవాలూ ఎంతో అవసరం.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Source - Whatsapp Message

No comments:

Post a Comment