Saturday, February 13, 2021

మరణ రహస్యం

🪔 మరణ రహస్యం 🪔

📚✍️ మురళీ మోహన్

🤘విశ్వాన్ని ఏదో తెలియని అదృశ్యశక్తి పాలిస్తోందని గ్రహించడం అంత కష్టమైన పనికాదు. ప్రకృతిలో ప్రతిదీ ఒక క్రమపద్ధతిలో ఉంటుందనీ తెలుసు. దీనినే వేదాల్లో ‘ఋత’ అంటారు. సూర్యచంద్రులు, రాత్రింబవళ్లు, గ్రహాలు, నక్షత్రాలు, ఋతువులు... వీటన్నింటికీ నిర్దిష్టమైన క్రమం, చలనం ఉన్నాయి. ఇలా బాహ్య ప్రపంచంలోనే కాక మనిషి అంతర్గత ప్రపంచంలోనూ క్రమబద్ధత ఉంది. గుండె కొట్టుకోవడం, శ్వాస పీల్చుకోవడం, రక్తప్రసరణ... ఇత్యాదుల్లో ఒక్క క్షణం జాప్యం జరిగినా ఏమవుతుందో తెలుసు.
ప్రకృతిపై ఆధిపత్యం ఎలాగూ మనిషి చేతుల్లో లేదు. అలాగే మనిషి ‘లోపల’ క్రమబద్ధత ముగింపు మనిషి చేతుల్లో లేదు. సహజంగా రావాల్సిన ముగింపును మనిషి తన చేతుల్లోకి తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. ఎన్నో విశ్వరహస్యాల్ని ఛేదిస్తున్న మనిషి ముందు నాటికి, నేటికి ప్రశ్నార్థకంగా నిలుస్తున్న ఏకైక అంశం- మరణరహస్యం. పుట్టుక, గిట్టుకల మధ్య మనిషిని వెంటాడుతున్న వాస్తవమే మరణభయం.

మహాభారతంలో భీష్ముడు మరణ రహస్యాన్ని కనుగొన్నాడో లేదో తెలియదు కానీ- తాను కోరుకున్నప్పుడు మరణం పొందే వరం మాత్రం తండ్రినుంచి పొందాడు. అంతిమ దశలో అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు మరణాన్ని తన ఆజ్ఞ కొరకు వేచి ఉంచి, తనువు చాలించాల్సిన సమయ సూక్ష్మాన్ని జగద్విదితం చేసి, మరణాన్ని ఆహ్వానించిన మహాజ్ఞాని ఆయన.

కలియుగంలో బతికుండగానే మరణానుభూతిని పొందిన భగవాన్‌ శ్రీరమణులు మరణభయాన్ని జయించి మహర్షి అయ్యారు.

‘మృత్యువు కూడా జీవితం అంత మనోహరమైనదే. ఎలా జీవించాలో తెలిసినవారికి మరణభయం నుంచి విముక్తి పొందడం అంతే సులభం. మనిషి సంపూర్ణ శక్తిమంతుడిగా ఉన్నప్పుడే, మనసులో తిష్ఠవేసుకునే గతాన్ని, అనుక్షణం నేను అనే అహాన్ని గుర్తుచేసే ఆలోచనల్ని ఎప్పటికప్పుడు మానసికంగా అంతం చేస్తే... వర్తమానంలో జీవించడం బోధపడుతుంది. అప్పుడు జీవనం, మరణం ఐక్యమైపోతాయి. మనకు తెలిసిన దాని నుంచి స్వేచ్ఛ పొందడమే మరణం’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి.

ఎవరైతే తమ మనసును నిశ్చలంగా ఉంచుకుంటూ, సమస్యల ప్రభావాన్ని మనసు మీద పడకుండా చేసుకోగలరో... అలాంటివారికి అంగుత్తరనికాయలో బుద్ధుడు చెప్పిన మాటలు తప్పించుకోలేని, జరగకమానని సమస్యలను నిర్భయంగా ఎదుర్కోవడానికి దోహదపడతాయి.

‘ఏదో ఒకరోజు నేను అమితంగా ప్రేమించి, నావిగా భావించే వస్తువులన్నీ నా నుంచి దూరమై నాశనానికి, మార్పునకు లోనయ్యేవే. దాన్ని నేను తప్పించలేను.

ఏదో ఒకరోజు నాకు అనారోగ్యం వస్తుంది. అలా రాకుండా నేను తప్పించలేను.

ఏదో ఒకరోజు నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తిరస్కరించలేను.

నేను చేసిన కర్మలకు నేనే బాధ్యుణ్ని... వాటి నుంచి తప్పించుకోలేను.

ఏదో ఒకరోజు నన్ను మృత్యువు కబళిస్తుంది. దాని నుంచి బయటపడలేను!’

*ఈ పంచసూత్రాలను గురించి ఆలోచించినప్పుడు మనిషి తన అహాన్ని, దురాశను, దుశ్చేష్టలనుంచి విముక్తి పొందుతాడు. పారమార్థిక పథంలో అడుగిడతాడు. తద్వారా జరగక మానని, తప్పించుకోలేని వాటిని భయరహితంగా ఎదుర్కోగలిగే మనోబలాన్ని పెంపొందించుకోగలుగుతాడు. బాల్యాన్ని ఆస్వాదిస్తూ, కౌమారాన్ని అనుభవిస్తూ, వార్ధక్యంలో ఆ అనుభూతుల్ని నెమరువేసుకుంటూ, అరవైల్లో ఇరవైల వ్యామోహాల్ని వదిలి, బంధాల మాయనుంచి బయటపడి, వర్తమానంలో జీవించడం తెలిసినవారికి ‘మరణభయం’ తృణప్రాయం
🙏🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment