Wednesday, February 24, 2021

స్నేహితుడు, వెండి, బంగారం, జ్ఞానం’- ఈ నాలుగు పేదరికం నుంచి గట్టెక్కడానికి తోడ్పడే ముఖ్యమైన సంపదలు.

స్నేహితుడు, వెండి, బంగారం, జ్ఞానం’- ఈ నాలుగు పేదరికం నుంచి గట్టెక్కడానికి తోడ్పడే ముఖ్యమైన సంపదలు. వీటన్నిటిలోనూ ‘మిత్రుని సహాయమే’ ఎక్కువగా వెల కట్టలేనిది. ‘స్నేహం’ అనేది బాల్యం నుంచే మనిషి జీవితంలో చెరగని ముద్ర వేస్తుంది. అందుకే, ‘మంచి స్నేహితుడు’ లభించడమనేది ఒక వరం వంటిది. స్నేహితుణ్ని ఎంచుకోవడానికి విధిగా పాటించవలసిన జాగ్రత్తలను ‘మహాభారతమే’ మనకు ప్రబోధించింది. ‘మంచి మిత్రుని అండ దొరికిన వారు సమాజంలో గౌరవ సంపదలతో వర్ధిల్లుతుంటారు’ అన్నది ఆర్యోక్తి. అయితే, ‘దరిద్రునికి ధనవంతునితో, విజ్ఞానికి మూర్ఖునితో, నెమ్మదస్తునికి క్రూరునితో, ఉత్తమునికి దుర్మార్గునితో స్నేహమనేది ఎప్పుడూ పొసగదు’ .

‘చదువు, సంపద, నడవడికలలో సమానులకు మాత్రమే మైత్రి పొసగుతుంది’ ‘ఒకే స్వభా వాన్ని కలిగి, అన్యోన్యంగా ఉండే మిత్రులకు ఒకవేళ ఆస్తిపాస్తులు, డబ్బు వంటి విషయాల్లో ఏమైనా అభిప్రాయ భేదాలు ఏర్పడినా, వాటన్నిటినీ పక్కనపెట్టి విలువైన స్నేహం వైపే మొగ్గు చూపుతుండాలి’అన్న ప్రామాణికతను మరిచిపోరాదు. ‘మిత్రునికి అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే తన తెలివితేటలను ఉపయోగించి అయినా అతణ్ని ఆ విపత్తు నుంచి గట్టెక్కించాలి’ ఇదే ‘మిత్రధర్మం’. ‘ఎంతో మేలు చేసి సంపాదించుకున్న మంచి మిత్రుని వల్ల సిద్ధించే ప్రయోజనాలను కాదని అతనిని దూరం చేసుకోవడం ఇరువురికీ క్షేమం కాదు. ఈ ‘మిత్ర సంపద’ మిగతా సంపదలన్నిటి కంటేకూడా ఎంతో గొప్పది’ అలాగే, ‘సమస్యలలో ఉన్నప్పుడు మిత్రుడు తనకు చేసిన మేలును మరిచిపోకుండా, అవసరం వచ్చినప్పుడు తిరిగి అతనికి మేలు చేస్తుండాలి. తమకు సహాయం చేసిన వాళ్ల ఋణాన్ని తీర్చుకోవడానికి తిరిగి సహాయం చేసేవాడే ‘కృతజ్ఞుడు’.

‘మిత్రద్రోహాన్ని’ మించిన పాపం మరొకటి ఉండదు. మిత్రద్రోహులనూ, కృతఘ్నులనూ, గుర్తుపట్టి వారిని ఎప్పుడూ నమ్మకుండా దూరం పెడుతుండాలి’ చేసిన మేలును మరచిపోయి నవారిని, ఆ మేలు చేసిన వారికి కీడు చేసేవారినీ ‘కృతఘ్నులు’ అంటారు. తనకు అంతటి స్థాయి రావడానికి, సంపదలన్నిటినీ సమకూర్చుకోవడానికి, సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించడానికి, జీవితాం తం తనకోసం పాటుపడిన దాతకు అవసరాలన్నీ తీరిన పిమ్మట కీడు చేసే కృతఘ్నుని శవాన్ని తాకడానికి కుక్కలు కూడా అసహ్యించుకుంటాయి’ అందుకే, ‘కృతఘ్నత’ అనేది పనికి రాదనీ, ఇది అనేక అనర్థాలకు దారితీస్తుందనీ మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. ‘మంచివాళ్లతో స్నేహం చేస్తే మంచి జరిగినట్లే, చెడ్డవారితో సహవాసం చేస్తే చెడు ఫలితాలే అనుభవంలోకి వస్తాయి’
ఆరు నెలలు కలిసి ఉంటే వాడు వీడూ, వీడు వాడూ అవుతాడనే నానుడిలోనూ వాస్తవం లేకపోలేదు. అసత్యవాది సాంగత్యంలో ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడవుతాడు. ఎంతో మహిమతో ఉండే విష్ణు సహస్ర నామావళిని బోధించిన భీష్ముడంతటి వాడు కూడా దుర్యోధనుని సాంగత్యం వల్ల గోవులను దొంగిలించడానికి సిద్ధపడ్డాడు. అందుకే ‘దుష్టులతో స్నేహం’ ఎన్నటికీ పనికిరాదని మన సనాతన ధర్మం నొక్కి చెప్తున్నది. స్నేహం చేయడానికి ముందే ఆ వ్యక్తి గుణగణాలనూ, నడవడికనూ చక్కగా బేరీజు వేసుకోవాలి. తమ అవసరాలు తీర్చుకోగానే కీడు చేసేవారిని ఏ మాత్రం దగ్గరకు రానీయకుండా జాగ్రత్త పడుతుండాలి. అప్పుడే, జీవితానికి మేలు, మిత్ర ధర్మానికి సార్థకత చేకూరుతాయి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment