Tuesday, February 9, 2021

సమాజంలోని మనుషుల ప్రవర్తన, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, ఆస్తి, అంతస్తులను బట్టి సమాజం విలువనిస్తుంది.

విలువ
విక్రమపుర రాజ్యానికి రాజైన సిద్ధార్థనుడు మంత్రి గుణాఢ్యుని పిలిచి రాజ్య వ్యవహారాలు మాట్లాడుతూ… సమాజంలో మనుషుల మధ్య ఉన్న విలువల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ‘మహా మంత్రి ఈ సమాజంలోని మనుషుల ప్రవర్తన, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, ఆస్తి, అంతస్తులను బట్టి సమాజం విలువనిస్తుంది. కానీ, నోరు, జీవం లేని బంగారం, వజ్రాల విలువ ఎక్కడైనా ఒకటేగా కదా..!’ అన్నాడు.
అందుకు మంత్రి ‘మహారాజా..! మీరనుకున్నట్లే బంగారం, వజ్రాలు విలువైనవే అయినా.. అవి ఎవరి వద్ద ఉంటాయో వారి స్థాయిని బట్టి వాటి విలువలు మారిపోవచ్చు’ అన్నాడు.
‘వాటిని అమ్మినా కొన్నా విలువ ఎక్కడైనా ఒకటి కాదంటారా..!’ అన్నాడు రాజు. ‘వాటి విలువను మోసంతో హెచ్చుతగ్గులు చేయగల మర్మయోగులు కొందరుంటారు రాజా..!’ అన్నాడు గుణాఢ్యుడు.
‘ఈ వ్యత్యాసాన్ని ప్రత్యక్షంగా చూపించగలవా?’ అన్నాడు రాజు మహామంత్రి కేసి సూటిగా చూస్తూ .. మంత్రి రెండు క్షణాలు ఆలోచించి ‘అలాగే మహారాజా..! రేపటిరోజున ఖజానా నుంచి విలువైన నాలుగు వజ్రాలు తెప్పించండి.’ చెప్పి వెళ్లిపోయాడు మంత్రి.
మరుసటి రోజు మంత్రి నలుగురు వ్యక్తుల్ని వెంట పెట్టుకుని మహారాజు వద్దకు తీసుకొచ్చాడు. రాజు ‘మంత్రివర్యా.. మీరు కోరినట్లు వజ్రాలు తెప్పించాను.. ఇవిగో’ అన్నాడు. నలుగురికి ఒక్కొక్కటి ఇచ్చి ఏం చేయాలో చెప్పి పంపేశాడు గుణాఢ్యుడు.
వారిలో మొదటివాడు ఆ ఊరి వజ్రాల వ్యాపారి దివోదాసు వద్దకు వెళ్లి వజ్రాన్ని అమ్మదలచానని చెప్పాడు. వజ్రాన్ని పరీక్షిస్తూనే దివోదాసు ‘మిమ్మల్ని చూస్తుంటే గొప్పవారి కొలువులోనో పనిచేస్తున్నట్లున్నారు’. అన్నాడు. ‘ఆ.. నేను మహారాజు కొలువులో పనిచేస్తున్నాను. నా పనితనానికి మెచ్చి ఈ వజ్రాన్ని నాకు బహుమతిగా రాజు గారు ఇచ్చారు. ఇప్పుడు నాకు డబ్బు అవసరం. అందుకే అమ్మదలచాను.’ అన్నాడు.
‘ముందు మీరు కూర్చోండి.’ అంటూ మర్యాదలు చేసి పైకం ఇచ్చాడు.’ దాన్ని తీసుకుని వాడు వెళ్ళిపోయాడు.
రెండోరోజు రెండోవాడు వజ్రాన్ని దివోదాసుకు అమ్మచూపాడు. ఆ వ్యాపారి ‘మిమ్మల్ని చూస్తుంటే పండితుడిలా ఉన్నారు. ఇది మీకెక్కడిది?’ అని ప్రశ్నించాడు. అందుకు ‘నేను రాజు కొలువులో ఆస్థానకవిని నా కవిత్వానికి మెచ్చి నాకీ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. దాని విలువకు తగిన ధనం ఇప్పించండి’ అన్నాడు.
వ్యాపారి లోలోపల ‘రెండు పద్యాలు చెబితే రాజు పొంగిపోయి ఇలాంటివి ఎన్నో ఇస్తాడు. దీని విలువ వీడికెలా తెలుస్తుంది.’ అని మనస్సులో అనుకుని ధనం ఇచ్చి పంపించేశాడు.
మూడోరోజు వ్యాపారి వద్దకు వచ్చిన మూడోవాడిని చూసి ‘నిన్ను చూస్తే రాజుగారి సైనికుడిలా ఉన్నావు.’ అన్నాడు. ‘అవును.. నేను రాజుగారి సైనికుడినే! ‘నా కొడుక్కి నామకరణం చేయాలి నాకు ధనం అవసరం. దాని విలువకు తగిన పైకం ఇప్పించండి’ అన్నాడు. వ్యాపారి మనసులో ‘వీడికి యుద్ధ వ్యూహాలు, పహారా తప్ప దీని విలువ వీడికేమి తెలుస్తుంది.’ అనుకుని ఇదే దీనికి వచ్చే పైకం అని చేతుల్లో పెట్టాడు. నాల్గోరోజు ఆఖరివాడు వ్యాపారి వద్దకు వెళ్లి.. ‘సామీ.. నా కూతురి పెళ్లిసేయాల. దీన్ని కొనుక్కొని పైకం ఇవ్వండి’ అన్నాడు. వ్యాపారి వాడిని ఎగాదిగా చూసి.. ‘ఇది నీకెక్కడిదని గట్టిగా అన్నాడు. ‘అయ్యా..! నన్ను దొంగగా అనుమానించడం ఏం బాగోలేదు.. నేను రాజుగారి వద్ద పనిచేస్తాను. నా పనితనానికి మెచ్చి రాజుగారు నాకు దీన్ని ఇచ్చాడు. కావాలంటే రాజు గారి దగ్గరకు పోదాం రా సామి..’ అన్నాడు. వ్యాపారి ‘ఆ.. సరే..సరే’ అంటూ కొంత పైకం ఇచ్చి పంపేశాడు.
తర్వాత ఆ నలుగురూ రాజమందిరానికి వెళ్లి జరిగినదంతా చెప్పారు. ‘వ్యాపారి మనుషుల వేషాలు, వారి వృత్తిని బట్టి విలువలు కట్టి మోసం చేసి హెచ్చు తగ్గులుగా పైకాన్ని ఇచ్చి పంపాడు. చూశారా ప్రభూ..! విలువలు ఎలా మారాయో..!’ అన్నాడు గుణాఢ్యుడు.
‘నిజమే మంత్రివర్యా..! అర్థమైంది. వెంటనే ఆ వ్యాపారిని పిలిపించండి’ అన్నాడు. ‘చిత్తం ప్రభు!’ అన్నాడు మంత్రి.
మరునాడు సభలోకి వచ్చిన వ్యాపారిని ఉద్దేశించి ‘ఆ నలుగురి వద్ద ఒకే వజ్రాలున్నా.. ఒక్కొక్కరికి ఒక్కో విలువ కట్టి ఇస్తారా..? అని రాజు ప్రశ్నించాడు. తాను చేసిన మోసం రాజుగారికి తెలిసిపోయిందని భయపడి ‘ప్రభూ.. నన్ను క్షమించండి’.. అని చేతులు జోడించి వేడుకున్నాడు దివోదాసు.
‘సమన్యాయం ఎరిగి వ్యాపారం చేస్తే నీ విలువ ఈ సమాజంలో పెరుగుతుంది. ఇకనైనా బుద్ధితెచ్చుకుని బతుకు..’ అని గద్దించాడు రాజు. ‘మంత్రిగారు..! మన రాజ్యంలోని ఇలాంటి మోసపూరిత వ్యాపారస్తులుగా ఉండేవారికి దేశ బహిష్కరణ, వ్యాపారానికి అనర్హులుగా అవుతారని దండోరా వేయించండి’ అనగానే సభ చప్పట్లతో మారుమోగింది. దివోదాసు మరోసారి క్షమించమని అడిగాడు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment