Monday, February 8, 2021

సంకల్ప సూక్తమ్

🙏💐::సంకల్ప సూక్తమ్::💐🙏
*
మనకు ఏదైనా పని నెరవేరాలంటే దానికి దృఢమైన సంకల్పము ఉండాలి. అన్య మనస్కంగా పని మొదలు పెడితే పని నెరవేరదు. ఆ సంకల్పము కూడా సత్సంకల్పమై యుండాలి. అలా సంకల్పం కలగాలన్న కోరికతో పఠించేదే యీ సూక్తము. ఇది శుక్ల యజుర్వేద వాజసనేయ సంహిత లోనిది. 6 మంత్రాలు కలది. యిలాటిదే మహన్యాసంలో 36 మంత్రాలు కలిగినది ఉన్నది.

దీనిని ప్రతి రోజూ నిద్రకు ముందు, లేచిన తర్వాత కూడా చదువుకోవచ్చు.

ఓం! యజ్జాగ్రతో దూరముదైతి దైవం
తదు సుప్తస్య తథైవేతి |
దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం
తన్మే మనః శివ సంకల్పమస్తు || 1

జ్యోతి స్వరూపమైన ఆత్మ జాగ్రదావస్థలో బయటకు వెళ్లి, నిద్రావస్థలో అంతర్ముఖమౌతుంది. అనంత దూరాలకు వెళ్లేదీ, యావత్ప్రపంచానికి ప్రకాశమైనది, అద్వితీయమైన ఆ ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.

యేన కర్మాణ్యపసో మనీషిణో
యఙ్ఞే కృణ్వన్తి విదథేషు ధీరాః |
యదపూర్వం యక్షమన్తిః ప్రజానాం
తన్మే మనః శివ సంకల్పమస్తు || 2

మేధావులు యఙ్ఞ కర్మలలో ఆపస్సు వంటి కర్మలను ఎందుకు చేస్తారో, బుద్ధి మంతుల ప్రార్థన లో ప్రాధాన్యమైనదేదో, ఆరాధనీయమైనదేదో ఏదైతే ప్రాణులలో నెలకొని ఉన్నదో అటువంటి ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.

యత్ ప్రఙ్ఞానముత చేతో ధృతిశ్చ
యజ్జ్యోతి నరన్తనరమృతం ప్రజాసు|
యస్మాన్న ఋతే కించ న కర్మ క్రియతే
తన్మే మనః శివ సంకల్పమస్తు || 3

ఏ ఆత్మైతే ప్రఙ్ఞానం, ఙ్ఞాపక శక్తి, మనో స్థైర్యములకు ప్రాప్తి స్థానమో, ఏ ఆత్మైతే ప్రాణులలో నశించని జ్యోతి స్వరూపంగా ఉంటున్నదో, ఏ ఆత్మైతే లేకుంటే ఏ పనీ చేయజాలమో అట్టి ఆత్మ నా మనసును సత్సంకల్పం కలిగేలా ప్రేరేపించు గాక.

యేనేదం భూతం భువనం
భవిష్యత్ పరిగృహియమమృతేన సర్వమ్|
యేన యఙ్ఞస్తాయతే సప్త హోతా
తన్మే మనః శివ సంకల్పమస్తు|| 4

ఏ ఆత్మైతే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటినీ గ్రహించుచున్నదో, ఏ ఆత్మైతే హోమం చేస్తున్న ఏడుగురికీ దానిని గురించి వివరిస్తుందో ఆ ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పం కలిగే లాగా ప్రేరేపించు గాక.

యస్మిన్ ఋచః సామ యజూగ్ంషి
యస్మిన్ ప్రతిష్ఠితా రథనాభావివారాః|
యస్మింశ్చిత్తగ్ం సర్వమత ప్రజానాం
తన్మే మనః శివ సంకల్పమస్తు|| 5

రథ చక్రంలో ఆకులు ఎలాగైతే అమరి ఉంటాయో అలాగే ఋక్, యజుస్, సామ వేదాలు దేనిలో నెలకొని ఉన్నవో, పడుగు పేకలా జనుల మనస్సులు అన్నీ దేనిలో నెలకొని ఉన్నవో అట్టి ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పాన్ని కలిగేలా ప్రేరేపించు గాక.

సుషారథిరస్వానివ యన్మనుష్యాన్
నేనీయతే౽భిశుభిర్వాజిన ఇవ |
హృత్ప్రతిష్ఠం యదజిరం ఇవిష్టం
తన్మే మనః శివ సంకల్పమస్తు || 6
ఓం శాంతిః శాంతిః శాంతిః

నేర్పరియైన సారథి అశ్వాలను క్రమశిక్షణతో ఉంచినట్లు, మానవులు గుర్రాలను పగ్గాలతో ముందుకు నడిపినట్లు, హృదయస్థానంలో ప్రతిష్ఠితమైన ఏ ఆత్మైతే మానవులను నియంత్రిస్తుంటుందో, నిత్య యౌవనంగా ఉంటుందో, అన్నిటికన్న వేగవంతమైన దో అట్టి ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.
ఓం శాంతిః శాంతిః శాంతిః|

🌹🙏🌹🙏🌹🙏🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment