Thursday, February 18, 2021

సుకృతం!

🌹సుకృతం !🌹

అతడు ఒక నాస్తికుడు, పనీ పాటా లేకుండా జులాయిగా తిరుగుతూ, నిత్యం సాధుపుంగవులనూ, వేద పండితులనూ, దేవతలనూ దూషిస్తూ వేశ్య లోలుడిగా వున్న దుష్టసాంగత్య దరిద్రుడు.

ఒకసారి అతడు వేశ్యా సంగమం కోసం బయల్దేరాడు. తను సంపాదించిన ధనంతో పాటు తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటిక కి వెళ్లే దారి పట్టాడు.

అతడు రోడ్డుపై నడుస్తుండగా మార్గమధ్యంలో, ఒక శివాలయం కనిపించింది. దానివంక చూస్తూ, ఏ అలంకారమూ ఆశించని శివుడికి తన వద్ద వున్న భోగ వస్తువులన్నీ ఇచ్చేస్తే అనే చిత్రమైన ఆలోచన వచ్చింది. అంతలోనే అతడి కాలికి ఒక రాయి తగిలి కాలుజారి నేలమీద పడ్డాడు. అలా పడుతున్నప్పుడు తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు.

అయితే ఆ సమయంలో అతడికి మనసులో కలిగిన....... ఆ ఊహలో ఉండగానే అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఊహామాత్రంగానే అయినా తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి నివేదించినందుకు గానూ అతడికి ‘క్షణమాత్ర శివ చింతనం అశేష పుణ్యఫల ప్రాప్తం’ అన్నచందంగా ఆ పరమేశ్వరుడి అపారదయ గొప్ప పుణ్యఫలం లభించింది..

మరణించిన అతడిని యమ భటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు పాపపుణ్యాలని విచారించగా, అతడు చేసిన పాపాలకి గానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు.

కానీ అతను చివరగా చనిపోయే ముందు తనయావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టు భావించినందుకు గాను మూడు ఘడియలపాటూ ఇంద్ర పదవిని చేపట్టే యోగం వుందనీ, అలా మూడు ఘడియలూ పూర్తయ్యాకా అతడిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు.

ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళూ చేసినపనులు ఎంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది, అలాంటిది తను జీవించి వుండగా నిజంగానే దానం చేసినట్లయితే ఎంత బాగుండేది ? అనిపించింది.

ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సరసలూ మొత్తం అందరూ అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంచనాలతో సాదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు.

తను ఇంద్ర సింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యుడికి ఐరావతాన్నీ, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేసాడు.

వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. మూడు ఘడియల కాలం అయిపోగానే ఇంద్రుడు తిరిగి తన స్థానం తీసుకోవడానికి అక్కడకి వచ్చాడు.

ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చెయ్యడం తెలుసుకొని కోపగించు కున్నాడు. ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధం కమ్మన్నాడు.

ఐతే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి అతను ఈ మూడు ఘడియలకాలంలో చేసిన పుణ్య ఫలితంవల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదనీ, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడనీ చెప్పాడు.

అయితే అతడు మునుపు చేసిన చెడ్డ పనులకి గానూ అసుర వంశంలో జన్మించి రాజు అవుతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగానే....

అతడు బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల నేల దానం చేసిన పుణ్యాన్ని పొందాడు.

చిరంజీవిగా పాతాళానికి రాజుగా ఇతిహాసాలలో నిలిచిపోయాడు.

🌺🌼🌺

Source - Whatsapp Message

No comments:

Post a Comment