Tuesday, March 16, 2021

బద్ధకస్తుడికి పనెక్కువ లోభికి ఖర్చెక్కువ

బద్ధకస్తుడికి పనెక్కువ లోభికి ఖర్చెక్కువ!

‘ప్రభాకర్’కి ఇంటి పని బొత్తిగా అలవాటు లేదు. ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. ఏ పనికి ఏవస్తువు వాడతారో కూడా తెలియనంత పట్టనితనం. దానికి తగ్గట్టు అతను కొన్నాళ్ళు చేసిన ఉద్యోగం, ఇప్పుడు చేస్తున్న వ్యాపారం కూడా అలాంటివే.
పిల్లలు, ఇల్లు గురించి భార్య చూసుకునేది. పిల్లలు ఎలా పెరిగి పెద్ద వాళ్ళయ్యారో కూడా పట్టించుకునేవాడు కాదు. దీనికి కారణం ‘కొంత బద్ధకం’, కొంత ‘పట్టించుకోని తనం’, మరికొంత ఉద్యోగం తాలూకు ‘పని ఒత్తిడి’.
పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు. చదువులు, పెళ్ళిళ్ళు అయి ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలిద్దరూ అమెరికా లో ఉంటున్నారు.
వేసవి సెలవులకి పిల్లలు అమెరికా నించి వస్తున్నారు అని వాళ్ళ అత్తవారు పిల్లల్ని రిసీవ్ చేసుకోవటానికి రెండు రోజులు ముందుగావాళ్ళ ఊరు నించి హైదరాబాద్ ప్రభాకర్ వాళ్ళ ఇంటికి వస్తున్నామని కబురు చేశారు.
‘నలుగురు వస్తే ‘కూరలు’, ‘సరుకులు’ కొంచెం ఎక్కువ కావాలని, తనకి వేరే పని ఉన్నదని భార్య ‘శోభ’ బజార్ కి వెళ్ళి ప్రభాకర్ ని సరుకులు, రైతు బజార్ కెళ్ళి కూరలు తెమ్మన్నది’. ఆ విషయం పొద్దుటి నించీ పోరుతున్నది. ‘నీకెందుకు, తెచ్చే పూచీ నాది, నాకు చెప్పావు కద ఇక మర్చిపో, ఇంటికి కూరలు, సరుకులు వచ్చినట్లే’ అని భరోసా ఇచ్చి టీవీ చూస్తూ కూర్చుని, మునిమాపు వేళ అయ్యేవరకు కాలయాపన చేసి, అప్పుడు బయలుదేరాడు.
వేసవి కాలం త్వరగా చీకటి పడకపోయినా, దీపాలు పెట్టే వేళకి రైతు బజార్ కి వెళ్ళటం వల్ల అక్కడ కూరలు అమ్మే వాళ్ళు ‘మంచి బేరం దొరికింది,చీకటిలో కనిపెట్టలేరు’ అని ‘పుచ్చు వంకాయలు’ బాగా తక్కువ రేట్ చెప్పి రెండు కిలోలు తూచి ప్రభాకర్ బ్యాగ్ లో పోశారు. అలాగే ‘ముదురు బెండ కాయలు’, కొంచెం ‘కుళ్ళిన టొమాటోలు’, బాగా తక్కువరేట్ చెప్పారని కొనుక్కొచ్చి ఇంట్లో పోశాడు.
అలాగే పచారీ కొట్టుకెళ్ళి సరుకులు లిస్ట్ చెప్పి ప్యాక్ చెయ్యమన్నాడు. ‘ఎక్స్పైరీ డేట్’ అయిపోయిన ‘బోర్నవిటా’ డబ్బా, ప్యాకెట్ చిరిగిపోయిన ‘బిస్కెట్స్’ కూడా పనిలో పని గా ఆ దుకాణం వాడు సరుకుల్లో సర్దేశాడు.
పని మీద బయటికి వెళ్ళిన శోభ, తెచ్చిన సరుకులు, కూరలు మరునాడు పొద్దున్నే సర్దచ్చని అలా ఉంచేసి ఆ రాత్రికి విశ్రమించింది. పొద్దున్నే ఓ చుక్క కాఫీ తాగేటప్పటికివియ్యాల వారు రైల్ దిగారు.
ఇక హడావుడి మొదలు. గబ గబా వంట చేద్దామని కూరల సంచులు దొర్లించి చూసేటప్పటికి వంకాయలు తరుగుదామని చూస్తే మొత్తం పుచ్చులు. పోనీ బెండకాయ కూర చేద్దామని తరగబోతే కత్తిపీటకి ఎదురు తిరుగుతున్నాయి. ఇంక శోభ కోపం నసాళానికి అంటింది. ప్రభాకరాన్ని పిల్చి అతను చేసుకొచ్చిన నిర్వాకం ఏకరువు పెట్టి, ‘మీరొక్కళ్ళే వెళ్ళారా, మీతో ఇంకెవరైనా వచ్చారా’ అని అడిగింది.
‘ఎదురింటి వాసు ని తీసుకెళ్ళాను, అతను చవుకగా బాగున్నాయి అని సర్టిఫికేట్ ఇస్తేనే ఈ కూరలు తెచ్చాము’ అని తెచ్చిపెట్టుకున్న వినయంతో భార్యని కూల్ చేద్దామని చెప్పాడు.
‘ఇంకనేం, ఇప్పుడు అర్ధమయ్యింది, అతనో పొదుపరి, ఖర్చు గిట్టదు, చవుకగా వచ్చాయని ప్రతి వారం ఇలాంటి కూరలు తెచ్చి పోసి పెళ్ళాం దుంప తెంచుతాడు. ఆవిడేమో గోల, ఈ పీనాసి మనిషినితో వేగ లేక చస్తున్నాను అని. తెచ్చిన కూరల్లో పనికొచ్చేవి ఒక్కటి లేవు, వచ్చిన వాళ్ళకి ఏమి వండాలి’ అని ‘వెళ్ళి వెంటనే కూరగాయలు తెండి, మళ్ళీ ఆలస్యమైపోతుంది’ అని తొందర పెట్టింది- ‘ఓ రూపాయిఎక్కువైనా, నాణ్యమైన సరుకు తెస్తే ఒక సారి షాపింగ్ చేస్తే సరి పోతుంది, ఇలా మళ్ళీ మళ్ళీ బజార్ వెంట తిరగకుండా’ అన్నది శోభ.
ఇలా మాట్లాడుతూ సరుకుల సంచీ తీసి ఒక్కొక్కటే బయట పెట్టింది. అందులో నించి ‘చిరిగిన బిస్కెట్ ప్యాకెట్’, బోర్నవిటా సీసా చూసి, ఇదేమిటి ఇలా ఉన్నాయి అని వాటి మీద డేట్ చూసి, ‘ఏమిటండీ ఏదో పనిలో ఉండి, బజారుకి వెళ్ళి సరుకులు తెండి అంటే ఇలాగా చెయ్యటం’ అని
‘విసుక్కుని, వెంటనే వెళ్ళి వాపస్ ఇచ్చేసి, వేరేది తీసుకురండి, ఆలస్యమైతే మళ్ళీ వాడు మార్చుకోడు’ అని తొందర పెట్టింది.
అసలే బద్ధకస్తుడైన ప్రభాకరానికి రెండో సారి బజార్ కి పరిగెత్తక తప్పలేదు. ఇందుకే అంటారు మీలాంటి వాళ్ళని చూసి "బద్ధకస్తుడికి పనెక్కువ అని, ఎదురింటి వాసు లాంటి వాళ్ళని చూసి లోభికి ఖర్చు ఎక్కువ అని."
👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment