Wednesday, April 21, 2021

‘అహంకారం పతనానికి మొదటి సోపానమని, చికిత్సకు లొంగని జబ్బని’ పెద్దలు చెప్పిన మాటలు అమృత తుల్యమైనా నిరహంకారులై చరిస్తున్న వారు అత్యల్పం.

‘అహంకారం పతనానికి మొదటి సోపానమని, చికిత్సకు లొంగని జబ్బని’ పెద్దలు చెప్పిన మాటలు అమృత తుల్యమైనా నిరహంకారులై చరిస్తున్న వారు అత్యల్పం.

అహంకారం మనిషి పతనానికి కారణ భూతమని పురాణాలు, ఇతిహాసాలు వివరించినట్టే ప్రవర్తించిన వారున్నారు. అహంకారులకు ఈర్ష్య, అసూయ వంటి అదనపు దుర్లక్షణాలు తోడవుతాయి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన దుర్యోధనుడు పాండవులను మించిన సంపద, అధికారం పొందాలన్న వాంఛలతో అనైతికంగా ప్రవర్తించి వినాశనం పొందినట్టు భారతం తెలిపింది.

రావణుడికి తనంతటి శక్తిశాలి, శివభక్తుడు లేరన్న గర్వం అధికం. తక్షణమే శివ దర్శనమివ్వలేదన్న ఆగ్రహంతో కైలాసాన్ని కదిలించబోగా, ఒక వ్రేలుతో కైలాసాన్ని పరమశివుడు తొక్కిపట్టేసరికి ముచ్చెమటలు పోసి, ముల్లోకాలు దద్ధరిల్లేలా అరచి గర్వభంగం పొందిన రావణుడి చరితను పురాణాలు వర్ణించాయి.
అధికార, ఐశ్వర్యాలున్నాయన్న అహంకారంతో ఒకసారి సభ లోపలకు ప్రవేశిస్తున్న దేవగురువును ఎదురేగి ఆహ్వానించక, సింహాసనం నుండి లేవక అలక్ష్యం చేసాడు ఇంద్రుడు. స్వర్గాధిపతి ప్రవర్తనకు ఖిన్నుడైన బృహస్పతి సభ నుండి వెనుదిరిగాడు. ఇదే సరైన తరుణమని దేవతలపై దండెత్తి దేవలోకాన్ని దానవులు జయించినట్టు భాగవతం తెలిపింది.

భక్తులు అహంకారులైనప్పుడు దేవుడే కనువిప్పు కలిగించిన సంఘటనలు ఉన్నాయి. ఆకాశరాజు సోదరుడైన తొండమానుడికి తనంతటి విష్ణుభక్తుడు లేడన్న గర్వం ఆవహించగా కుమ్మరి భీముడి వద్దకు పంపి కనువిప్పు కలిగించిన వేంకటేశ్వరుని కథను భవిష్యోత్తర పురాణం తెలిపింది.

తపోశక్తిచే కొంగను నేలకూల్చిన కౌశికుడిని ఆవరించిన అహంకారాన్ని పోగొట్టి, ధర్మవ్యాధుడి వద్దకు శిష్యరికానికి సాగనంపిన గృహిణి కథను, శత సహస్ర వర్షములు తపమాచరించి స్వర్గాన్ని చేరిన యయాతి అహంకారియై మహర్షుల తపస్సును కించపరచిన ఫలితంగా తపశ్శక్తి కోల్పోయిన ఘటనను మహాభారతం తెలిపింది.

అహంకారం వలన ప్రయోజనం పొందినట్టు విశ్వామిత్రుడి చరిత్ర తెలుపుతుంది. వశిష్ఠుడిని జయించాలన్న లక్ష్యంతో తపస్వియై బ్రహ్మర్షిగా ఎదిగి సృష్టికి ప్రతిసృష్టి చేసినట్టు పురాణాలు తెలిపాయి.

‘మనిషిని సర్వనాశనం చేసేది అహంకారమనీ, దాన్ని వీడినప్పుడే సద్బుద్ధిగలవారై దైవకృపకు పాత్రులు కాగలరని” కబీరుదాసు చెప్పినట్టు మెలిగినప్పుడు చుట్టూ ఉన్న ఆనందం దర్శనమిస్తుంది. జీవితం సుందరమయమై అనుబంధాలతో అల్లుకుపోతుంది.

“నేను, నా అనే భావన సర్వజనులను, దేవుడిని దూరం చేస్తుందన్న” అబ్దుల్ కలాం మాటల్లోని సారాంశం గ్రహించి వినయంతో ప్రవర్తించడం అలవరచుకోవాలి. నేటి తరంలో సర్దుకుపోయే తత్త్వం కొరవడుతోంది. ఆవేశంతో కూడిన పరుష వాక్కుల ప్రభావంతో ప్రశాంతతను కోల్పోతున్నారు. పరుల హృదయాలను కరిగించే మాటతీరుతో ఆకట్టుకుని జీవించడం అలవరచు కున్నప్పుడు జీవితం పూలబాటగా మారుతుంది.

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment