Thursday, May 27, 2021

జీవితం ఒక పయనం

💥జీవితం ఒక పయనం
🕉️🌞🌎🏵️🌼🌈🚩


జీవితం ఒక అంతులేని పయనం. ఈ సుదీర్ఘ వింతపయనంలో నిమిషాలు, గంటలు, దినాలు పరుగులు తీస్తూ ఉంటాయి. మాసాలు గడిచి సంవత్సరాలుగా మారుతుంటాయి. జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతూ ఉన్నంతకాలం మాసాలు నిమిషాలుగా, సంవత్సరాలు గంటల గడియారంలో ముళ్లలా చకచకా నడుస్తూఉంటాయి.

సమస్యలు ఎదురుపడగానే క్రమం అంతా తారుమారవుతుంది. ఇలా జరగడానికి కారణం ఏమైఉంటుంది? కాలమహిమ అని కొందరు, కాదు మనసే ఖలనాయకుడని మరికొందరు వాదిస్తారు. కాలం ఒక మహాప్రవాహం. దానికి ఎదురీది గట్టెక్కాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషికి జీవితం సవాలుగా మారుతుంది. ప్రవాహంతోపాటు సాగిపోదామన్నా, అది సాఫీగా సాగుతుందన్న భరోసా లేదు. తేడా భావనలోనే ఉంది. ప్రతికూల పరిస్థితులను ప్రతిఘటిస్తూ, సుడిగుండంలో చిక్కుపడిన దుంగలా తలకిందులుగా తలపడటమా? లేక తుంగలా తలవంచి ప్రమాదం నుంచి బయటపడటమా? ఈ ప్రశ్నలకు సమాధానం వ్యక్తి మానసిక స్థితిపైన ఆధారపడి ఉంటుంది.
గుణాత్మకమైన ప్రకృతి ప్రభావంవల్ల వ్యక్తిత్వపు మానసిక స్థితిగతులు మార్పు చెందుతుంటాయి. వీరులు, ధీరులు, రుషులు, తాపసులు తప్పటడుగులు వేయడానికి ప్రకృతి ప్రలోభాలే కారణమని మన పురాణాలు గళమెత్తి చాటుతున్నాయి. ఆరుగురు అంతశ్శత్రువుల దాడికి ఆగలేక మనసు ఆగమాగమై మూగపోవచ్చు లేదా చతికిలపడవచ్ఛు అర్జునుడి వంటి జగదేక ధనుర్ధరుడు కురుక్షేత్రంలో చతికిలపడ్డాడు. విశ్వామిత్ర మహర్షికి మేనక కనిపించగానే మనసు మూగబోయి మనిషిని దాసుడిగా మార్చేసింది. బంధానికి, మోక్షానికి మనసే కారణమన్న ఉపనిషత్తు వాక్యం అక్షరసత్యం.

ఆత్మజ్ఞానానికి చిత్తశుద్ధి, ఏకాగ్రబుద్ధి- రెండూ ముఖ్యమైన సూత్రాలు. మనసు అద్దంలా మారినప్పుడే శుద్ధజ్ఞానం మెరుస్తుంది. ప్రపంచాన్ని గెలుచుకున్నా, మనసును జయించకపోతే ఆ వీరుడు ధీరుడు కాలేడు. స్థితప్రజ్ఞుడే ఈ ప్రపంచంలో అసలైన ప్రాజ్ఞుడు. ఆత్మజ్ఞానం అంటే తానేమిటో తెలుసుకోవడం. అంతా తానై ఉన్నానన్న ఎరుక కలగడంతో ఒంటరిపోరాటం మొదలవుతుంది. ఏకాత్మ భావన అంటే మానసికంగా అందరూ ఒకటే. శారీరకంగా ఎవరికి వారే. అందుకే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నాడు యోగీశ్వర కృష్ణుడు.

తామరాకుపైన నీటిబొట్టులా భౌతికజీవితంలో మెరవాలి. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటిన విధంగా, జీవన్ముక్తి వివేకంతో మనిషి సంసార సాగరాన్ని ఈదుకు రావాలి. ఐహిక బంధాల్లో చిక్కుపడి ఆముష్మిక పంథాకు దూరం కాకూడదు. భార్య, బిడ్డలు, హితులు, స్నేహితులు, సిరిసంపదలు... ఇవేవీ శాశ్వతం కాదు.

ఇవన్నీ మహాప్రస్థానంలో నాందీప్రస్తావనలు. కాశీయాత్రలో తప్పని మజిలీ స్థావరాలు. మహాప్రస్థానంలో ధర్మరాజును చివరిదాకా అనుసరించింది ధర్మం ఒక్కటే. ఆత్మీయులు అనుకున్నవారు, ఆత్మబంధువులన్నవారు ఊరి పొలిమేర దాకా కలిసి వస్తారేతప్ప, ఊర్ధ్వయాత్రలో మనిషి ఏకాకి మాత్రమే. ఆత్మజ్ఞానం ఒక ఊర్ధ్వగమనం కాబట్టి వ్యక్తి చైతన్యాన్ని చిక్కబట్టాలి. మనోబలంతో ముందుకు సాగాలి. కొంతమంది తమకు తామే గొప్పగా తలబోసుకుంటూ పటాటోపంగా యజ్ఞాలు చేస్తారు. సదా సంసారంలో ఎదురీత సాగిస్తూ ఉంటారు. మనసును వశం చేసుకున్న సాధకులు జీవనయాత్రను జైత్రయాత్రగా మలచుకుని యోగసిద్ధి పొందుతారు.

అంతులేని పయనంలో, ధర్మరాజుకు ధర్మంలా తోడువచ్చేది- ఆధ్యాత్మికసాధనే!

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment