Tuesday, May 18, 2021

దానంతో శాశ్వత కీర్తి

దానంతో శాశ్వత కీర్తి
🕉️🌞🌎🏵️🌼🚩

“అతిధి దేవోభవ !” అన్నది మన సాంప్రదాయం. ఈ ప్రపంచంలో చిన్న చీమ నుంచి అన్ని ప్రాణుల్లో ఉన్నది దైవమే. ఎవ్వరి కడుపు నింపినా, దేవుడు తిన్నట్లే !జాతి, మత, కుల, భేదాలు లేకుండా, ‘ఆకలి’ అన్నవారికి అన్నం పెట్టాలి. ఆకలిగొన్నవాడు ఎవరైనా సరే, చివరికి దొంగ, హంతకుడు అయినా సరే, అన్నం పెట్టాలి. ఆకలి విషయంలో అపాత్రుడు ఎవరూ ఉండరు. అందరూ పాత్రులే !

‘నాకంటె వేరుగా ఏదియు లేదు’, ‘సమస్త ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు వెలయుచున్నాడు.’ అను మాటలను కేవలం బుద్ధితో గ్రహించి, నోటితో వల్లించే వారు కాక స్వీయ అనుభవంతో ఆచరించి, తదనుగుణంగా జీవించే వ్యక్తులు మనక ఆదర్శం కావాలి. ఈ సందర్భంగా భాగవతంలోని రంతిదేవుని కథ గుర్తుకొస్తుంది. ‘జన సేవయే జనార్ధన సేవగా’ భావించిన రంతిదేవుడి కధను చెప్పుకుందాము.

రంతిదేవుడు ఒక మహారాజు. అమిత దానశీలి. రాజ్యాన్ని, సంపదను దానం చేసి, భార్యాపిల్లలతో అడవికి వెళ్ళాడు. దైవికంగా ఏది లభిస్తే దాన్ని తినటమే-అంతకు మించి ఆయన దేన్నీ కోరేవాడు కాడు, భవిష్యత్తవసరాల కొరకు, దేన్నీ దాచుకొనేవాడు కాడు.

ఒకసారి నలభై ఎనిమిది రోజులు తినటానికి గానీ, తాగటానికి గానీ ఏమీ లభించలేదు. నలభై తొమ్మిదవ రోజు ఏదో కొంత ఆహారం లభించింది. దాన్ని తినటానికి తాను, కుటుంబ సభ్యులు కూర్చొన్నారు. అంతలోనే ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. ఆహారాన్ని ఆయనకిచ్చాడు రంతి దేవుడు. అతన్ని ఆశీర్వదించి వెళ్లిపోయాడు అతిథి. మరికొంత సేపటికే ఒక శూద్రుడొచ్చాడు. రంతిదేవుడు ఆతని ఆకలి తీర్చాడు. ఆ శూద్రుడు వెళ్లిన వెంటనే ఒకడు కుక్కలను తీసుకొని వచ్చి తన ఆకలిని, ఆ కుక్కల ఆకలిని తీర్చమని కోరాడు. తన వద్ద మిగిలిన ఆహారంలో రంతిదేవుడు అతనికి, అతని కుక్కలకు ఇచ్చాడు. ఇక కేవలం కొంత పాయసం మాత్రమే మిగిలింది. దాన్ని తాగి ఆకలి మంటను ఆర్పటానికి సిద్ధపడింది ఆ కుటుంబం. అంతలోనే ఎంతో దీనావస్థలో నున్న ఒక చండాలుడొచ్చాడు. వాని పరిస్థితి గమనించిన రంతిదేవుడు తన వద్ద ఉన్న పాయసాన్నంతా అతనికిచ్చివేశాడు ”బ్రహ్మార్పణం” అంటూ. నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటూ, స్పృహ తప్పిపోతాడు రంతిదేవుడు. మరుక్షణమే దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.

నీతి : కుల, మత, జంతు వివక్ష లేకుండా, తాను ఆకలితో ఉన్నా , ప్రాణాలు పోతున్నా లెక్కచెయ్యక రంతిదేవుడు చేసిన త్యాగం చరిత్రలో అతని పేరును శాశ్వతంగా నిలిపింది. దానగుణంతో దైవాన్నే నేలకు దించాడు రంతిదేవుడు. మనం కూడా, అన్నం తినేముందు కనీసం ఒక్కరి ఆకలైనా తీర్చే ప్రయత్నం చెయ్యాలి.

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment