Monday, May 10, 2021

ఒక చిన్న కధతో సద్గురువుల విశిష్టత

🌻ఒక చిన్న కధతో సద్గురువుల విశిష్టత🌻

నాలుగైదు నెలల పిల్లవాడు.
మంచం మీద పడుకోబెట్ట బడి ఉన్నాడు.
ఇంకా నిలబడటం,నడవటం రాని వాడు.
ఇక మంచం దిగే యోచనే తెలియని వాడు.
ప్రక్కనే పడక్కుర్చీ లో నాన్న పుస్తకమేదో చదువుకుంటున్నాడు.
ఇంతలో పిల్లవాడు మల మూత్రాలు విడిచాడు.
ఆ పొత్తిగుడ్డ ల్లోనే గుండ్రంగా పొర్లాడు.
బోర్లా,వెల్లకిలా పడ్డాడు.
ముక్కూ మొహమూ ఏకం చేసుకున్నాడు.
బురద లో చేప పిల్ల లా తప తప కొట్టు కున్నాడు.
చివరికి తన మురికి తనే భరించ లేక కెవ్వుమని ఏడుపు లంకించుకున్నాడు.
పిల్ల వాడి ఏడుపు విని నాన్న దగ్గరి కొచ్చాడు.
పిల్ల వాడు చేతులు పైకెత్తి ఎత్తుకోమన్నట్లుగా తండ్రి వైపు చూస్తూ క్యారు క్యారు మన్నాడు.
మల మూత్రాలు ఒళ్ళంతా పుసుకుని దుర్గంధ భూయిష్టం గా ఉన్న కొడుకుని నాన్న చూశాడు, గానీ ఎత్తు కోలేదు.
అంతలో పిల్లాడి ఏడుపు విని అమ్మ కూడా పరిగెట్టు కొచ్చింది.
” ఏమోయ్! వాడు చూడు! ఎలా ఉన్నాడో!?ఒంటి నిండా పూసుకున్నాడు!” అన్నట్లుగా చూసాడు నాన్న!
అమ్మని చూసి మరింత గట్టిగా ఏడుస్తూ చేతులు చాపాడు పిల్ల వాడు.
అమ్మ… నాన్నలా దూరంగా ఉండి పోలేదు.
ఒక్క ఉదుటున వచ్చి ఎత్తుకుంది.
స్నానాల గదికి తీసికెళ్ళి పీటేసుకు కూర్చుంది.
చీర కుచ్చిళ్ళు మోకాళ్ళకి పైకి లాక్కుని, పిల్లాణ్ణి కాళ్ళ పైనేసుకుంది.
నీళ్ళూ,సున్ని పిండీ వేసి.. చేపని రుద్దినట్టు రుద్ది కడిగింది.
పొడి తువ్వాలు పెట్టి ఒళ్ళంతా తుడిచింది.
పరిమళాలు విరజిమ్మే గంధపు పొడులేవో రాసింది.
బొట్టూ,కాటుకా పెట్టింది.
ఉతికిన జుబ్బా తొడిగింది.
బుగ్గన కాసంత దిష్టి చుక్క పెట్టి,ఎత్తి ముద్దులాడింది.
పిల్లవాడు ఏడుపు ఆపి కిల కిల నవ్వుతుండగా తెచ్చి నాన్న చేతికిచ్చింది.
చదువుతున్న పుస్తకం అవతల పెట్టి, కొడుకు నెత్తుకుని నాన్న…
” నా తండ్రే! నా బంగారు కొండే!..” అంటూ.. ముద్దులాడాడు.
పిల్ల వాడు పరమానందం లో మునిగి పోయాడు.
భగవంతుడు నాన్న లాంటి వాడు!
మనం మురిగ్గా ఉంటే ఎత్తుకోడు,
దగ్గరకి రాడు,
రానివ్వడు.
సద్గురువు అమ్మ లాంటి వాడు.
మన దోషత్రయాన్ని [మల విక్షేప ఆవరణ లు]దూషించడు.
మన ఈషణ త్రయాన్ని [దార ధన పుత్ర ] చూసి ఈసడించడు.
వాసనాత్రయాన్ని[లోక దేహ శాస్త్ర ] చూసి వద్దకు రావద్దని వారించడు.
మన అహంకారాన్ని చూసి అసహ్యించు కోడు.
ఓపికగా మన చిత్తాన్ని శుధ్ధి చేసి
మన అహంకారాన్ని అణచి వేసి,
వాసనల్ని వదలగొట్టి
ఈషణ,ఈర్ష్యాసూయల్ని దాటించి
నిర్మల,విశుధ్ధుల్ని చేసి
భగవంతునికి ప్రీతిపాత్రులమయ్యేట్లుగా చేస్తాడు.
ఎందుకంటే….
తారతమ్య సాంద్రత సమం కానిదే ఒక పదార్ధం మరో పదార్ధం లో కలసిపోదంటుంది భౌతిక శాస్త్రం.
బ్రహ్మమెంత నిర్దోషమో… అంత నిర్మలమైతే తప్ప బ్రహ్మస్వరూపులం కాలేమంటూంది గీత!
ఇహైవ తైర్జిత స్సర్గః,యేషాం సామ్యే స్థితం మనః।
నిర్దోషం హి సమం బ్రహ్మ,తస్మాద్బ్రహ్మణి తే స్థితాః॥
అందుకే మరి…..
ఎవరెంతగా అన్నా
ఎవరెంతగా విన్నా,
ఎంత చదివినా,
ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా,
సద్గురువుని ఆశ్రయించటం తప్పనిసరి…
అంటారు అనుభవజ్ఞులు.

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment