Tuesday, June 15, 2021

పరులను హింసించకుండా ఉండటమే పరమధర్మం. అది ఆచరించు, చాలు. నువ్వు ప్రత్యేకించి ఎవరిని ఉద్ధరించనక్కర్లేదు...

ఇదిగో! ఇదే మనలో చాలామందికి వర్తిస్తుంది.

పదిమందిని రక్షిస్తామని, లేదా పదిమందికి మేలు చేసే పనులు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటారు.


భక్తరామదాసుగారు ఏమంటున్నారంటే, పరులకు హానీ చేయకుండా ఉంటే, పరులను హింసించకుండా ఉంటే చాలట. అదే పరమధర్మం. ఇతరులను రక్షిస్తానని పలకడమెందుకు?

ఇందులో ఎంత అర్ధముందో చూడండి.

సంస్కృత సాహిత్యంలో ఒక సుభాషితం కూడా ఉంది.


అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కీర్తితం
పరోపకారం పుణ్యాయః పాపాయః పరపీడనం

అష్టాదశ పురాణాలను రచించిన తర్వాత వ్యాసుడు, వాటి సారాన్ని ఈ విధంగా చెప్పాడట, ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం, పరుపలను పీడించడం పాపం అని.

నిజానికి ఎవరికీ హాని కలిగించకుండా జీవించడమే ఉత్తమ జీవనం.

మనం ఎవరిని బాధించకుండా, అపహాస్యం చేయకుండా, రెచ్చగొట్టకుండా, ఈర్ష్యాసూయలు లేకుండా ఉంటే చాలు.

ఎవరి జీవితాలు వారివి. మనం ఒకరి జీవితంలో కలగజేసుకోకుండా ఉండటమే చాలు.

ఒకరి వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకోవడం, మనకు అవగాహన లేని విషయాల్లో చొరబడి వారి సమస్యలకు సలహాలు చెప్పడం కూడా హింసే కదా.

అవి మనకు తెలియకుండా ఇతరులను తప్పకుండా నొప్పిస్తాయి.

ఇలాంటి వాటికి దూరంగా ఉంటే చాలు.

నిజానికి అందరిని రక్షించేది భగవంతుడే కానీ మీరో, నేనో కాదు. అలాంటిది ఇతరులను రక్షిస్తానని చెప్పడం అహంకారం తప్ప మరేమవుతుంది.


ఒక చిన్న ఉదాహరణగా భూతాపం సమస్య తీసుకోండి. మానవుల వికృత చర్యల వలన కాలుష్యం పెరిగి, భూవాతావరణం దారుణంగా దెబ్బతింటోంది.

రాబోయే ఏళ్ళలో ఈ భూమ్మీద జీవం ఉండటమే ప్రశ్నార్ధకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇప్పుడు మనం బయటకు వెళ్ళి, భూమిని ఉద్ధరించడానికి పెద్ద పెద్ద ఉద్యమాలే చేయనక్కర్లేదు. మరింత కాలుష్యం చేయకుండా ఉంటే చాలు, అదే మనకు పరమ ధర్మం. అలా ఉండటమే సమస్త జీవరాశికి పెద్ద సహాయం చేయడం.

ఎందుకంటే జరుగుతున్న వినాశనానికి అప్పుడు మనవంతు సాయం అందించకుండా ఉన్నాం కనుక.

*అందుకే భక్త రామదాసుగారు ఏమంటున్నారంటే, పరులను హింసించకుండా ఉండటమే పరమధర్మం. అది ఆచరించు, చాలు. నువ్వు ప్రత్యేకించి ఎవరిని ఉద్ధరించనక్కర్లేదు..

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment