Wednesday, July 14, 2021

మన పేరుకి *చిరంజీవ తత్వం* ఏర్పాటు చేసుకో!!

🌹సేవ, తృప్తి🌹

నిరాశ నిస్పృహ ఇక వయసు మళ్ళిన వారిమని భావిస్తున్న వారికి
ఇంకా మనమేం చేయగలం అని అనుకునే వారికి
అంకితం చేస్తూ

చాలా బావుంది, ఓపిక తో తప్పకుండా మొత్తం చదవండి

మరాఠీ భాషలో చాలా మంచి చిత్రాలు తయారవుతూ ఉంటాయి. మన తెలుగు వారికి, హింది, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతో పోలిస్తే మరాఠీ చిత్రాలతో అనుబంధం తక్కువే. ఆ భాషలో నటులు, దర్శకులు (ముఖ్యంగా రంగస్థలం నుంచి వచ్చినవారు) మంచి ప్రతిభ కనబరుస్తారు. సమకాలీన ఆధునిక జీవితం గడుపుతున్న సగటు మనిషి జీవితం లోకి తొంగిచూసి, మనసును తడిమే అనుభూతిని పంచే కథనం. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఒకసారి మనసుతో మాట్లాడించే చిత్రం.... ప్రవాస్’ మరాఠీ చిత్రం సంక్షిప్తంగా....

‘ప్రవాస్’ (మరాఠీ చిత్రం)
“నేను చచ్చిపోతే నా అంత్యక్రియలకు ఎనిమిది, పదిమందికంటే ఎక్కువ రారేమో” కారు నడుపుతూ నిర్లిప్తంగా అన్నాడు అభిజిత్ ఇనాందార్, భార్య లత ఇనాందార్ తో.
వారు తమ దగ్గర బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్నారు.
“ఎందుకు అలా అంటావ్” చిరాగ్గా అంది భార్య.
ఇంటికి వచ్చిన తరువాత కూడా సంభాషణను కొనసాగిస్తూ “నాలో ఏమి ప్రత్యకత ఉందని అందరూ గుర్తుంచుకోవడానికి? నావల్ల కుటుంబానికి గానీ, సమాజానికే గానీ నా వల్ల ఏం ఒరిగిందని...”అన్నాడు సోఫాలో కూలబడుతూ.
“ఇల్లు కట్టుకున్నాం, కారు కొనుక్కున్నాం, కొడుకుని విదేశాలు పంపించాం. ఇవన్నీ నువ్వు కష్టపడి ఉద్యోగం చేయబట్టే కదా సమకూరాయి? ఇంకా యేమి కావాలి? అనునయంగా అంది లత.
“నేను కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. మంచి నటున్ని కావాలనుకున్నాను. ఇంకా ఏమేమో చేయాలి, ఎంతో సాధించాలి, పదిమందిలో గుర్తింపు పొందాలి అనుకున్నాను. చివరికి యేమీ సాధించ లేకపోయాను. ఇంత వయసు వచ్చినా సగటు మనిషిగా మిగిలిపోయాను” బాధగా కళ్ళు మూసుకున్నాడు అభిజిత్.
()()()
అభిజిత్ కు అరవై ఏడేళ్లు. మంచి ఉద్యోగం చేసి రెటైర్ అయ్యాడు. భార్య లత, ఆమెకు చిత్రకళ అంటే అభిమానం. తీరిక సమయాల్లో కాన్వాస్ పై రంగుల చిత్రాలు వేసి ఆనందిస్తుంటుంది. ముంబైలో ఇల్లు కట్టుకున్నారు. కొడుకు దిలీప్ ను విదేశాల్లో చదివించారు. అతడు అమెరికాలో ఉద్యోగంలో స్తిరపడ్డాడు. ఆర్థికంగా లోటు లేదు. అభిజిత్ కు నటుడు దిలీప్ కుమార్ అంటే వల్లమాలిన అభిమానం. అతని సినిమా టీవీ లో వస్తే తప్పకుండా ఆసాంతం చూస్తాడు. ఆ అభిమానంతోనే కొడుకుకు దిలీప్ అని పేరుపెట్టుకున్నాడు.
ప్రస్తుతం అభిజిత్ ఆరోగ్యం బాగా దెబ్బతింది. రెండు కిడ్నీలూ పాడయ్యాయి. వారానికి రెండుసార్లు డయాలసిస్ తప్పనిసరి. బీపీ, సుగర్ సరిగా అదుపులో పెట్టుకోవడం లేదని రిపోర్ట్ లు చూసినప్పుడల్లా డాక్టర్ హెచ్చరిస్తూ ఉంటాడు. దేశంలో యూరియా ఎరువు దొరకడం లేదని రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, నా వంట్లో అది ఎక్కువ తయారవుతుంది అని తన మీద తానే జోకులు వేసుకుంటాడు అభిజిత్.
()()()
ఒకరోజు భార్య ప్రోద్బలం పై పండిత్ రమాకాంత్ జోషి సంగీత కార్యక్రమానికి వెళతారు. ఆయన ఆలపించిన సంగీతానికి ప్రేక్షకులు మైమరిచిపోయి కరతాళ ధ్వనులు చేస్తారు. అభిజిత్ కు కూడా నచ్చుతుంది. రమాకాంత్ ను కలుసుకుని మాట్లాడుతాడు. వృద్ధుడైన జోషి తనకు కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని. మందులు వేసుకుని, కార్యక్రమాలు చేస్తూ ఉంటానని చెబుతాడు.
సంభాషణాల్లో పండిత్ జోషి ఒక మాటంటాడు “మన జీవితంలో రెండే రెండు రోజులు చాలా ముఖ్యమైనవి. ఒకటి మనం ఈ భూమ్మీద పడిన రోజు, రెండవది – నేనెందుకు జీవిస్తున్నాను అనే ఆలోచన వచ్చినరోజు“
ఈ మాటలు అభిజిత్ పై బాగా ప్రభావం చూపిస్తాయి. ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆలోచిస్తుంటాడు.
మరో రోజు పండిత్ జోషితో “ఈ వయసులో, ఈ రోగంతో నేను ఎవరికి ఏ విధంగా సహాయ పడగలను, నలుగురిలో గుర్తింపు ఎలా పొందగలను” ఆవేదనగా అడిగాడు.
“ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్తితి ఎలా ఉన్నా .... చనిపోయేంతవరకూ నువ్వు బతకక తప్పదు. ఈ గమ్యం ఎంతకాలం అనే ఆలోచనను పక్కన పెట్టి, నువ్వు ఏమి చేయగలవో నిజాయితీతో ఆలోచించు. ఏదో మార్గం దొరకక పోదు. చెప్పాడు ధృఢంగా. ఇవే మాటలు మననం చేసుకుంటూ ఇంటికి చేరిన అభిజిత్ తాను చెయ్యాల్సిన పనులేవో అస్పష్టంగా తన కళ్ల ముందు కదలాడుతున్న భావన కలిగింది. కుటుంబ పోషణ కోసం ఓపిక లేకపోయినా చమటోడ్చి కష్ట పడుతున్న, తాను చూసిన వృద్ధుల అలసిపోయిన మొహాలు కళ్ల ముందు కదలాడాయి. వారు ఆ వయసులో కూడా అంతలా కష్ట పడుతుంటే, నేనేమీ చేయలేనా అన్న ఆలోచనలో పడ్డాడు.
()()()
బీహార్ లోని ఓ మారుమూల పల్లె లో ఒక తండ్రి, చావుబ్రతుకుల మధ్య అల్లాడుతున్న తన ఆరేళ్ళ కూతురికి సత్వర వైద్య సాయం కోసం చేతులపై ఎత్తుకుని పద్నాలుగు కిలోమీటర్లు పరుగెత్తినా, చివరికి ఆమె ప్రాణాలు కాపాడలేకపోయిన వార్తను టీవీ వార్తల్లో చూసిన అభిజిత్ చలించి పోతాడు. ఆంబులెన్స్ అందుబాటులో ఉండి ఉంటే ఆ పాప ప్రాణాలు నిలిచేవి కదా... అని బాధపడతాడు. ఒకసారి అర్థరాత్రి తనకు ఎగశ్వాస గా ఉంటే జోరున పడుతున్న వానలో అంబులెన్స్ కోసం తన భార్య పడ్డ ఆరాటం, చివరికి ఆటోలో కష్టపడి ఆసుపత్రికి వెళ్ళిన సంఘటన గుర్తుకు వచ్చిఆవేదన కలిగింది. ఆ బాధ, ఆవేదనలోంచి అతనికి ఒక ఆలోచన తళుక్కుమని మెరుస్తుంది.
తన స్వంత కారును ఆంబ్యులెన్స్ గా మార్చి, అవసరమైన వారికి ఉచితంగా సేవ చేయాలని నిర్ణయానికి వచ్చాడు. భార్య తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా వినలేదు. కావలసిన అనుమతులు పొందాడు. కారుకు ఆంబ్యులెన్స్ కు అవసరమైన అన్నీ హంగులూ అమర్చాడు. తన ఫోన్ నంబర్ తో కరపత్రాలు ముద్రించి దినపత్రికలు పంచేవారి ద్వారా ఇంటింటికి అవి అందేటట్లు చూశాడు.
మొదటిసారిగా ఒక గుండెపోటు తో బాధపడుతున్న వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. సమయానికి ఒక ప్రాణం కాపాడగలిగాననే ఆనందం అతని మొహంలో స్పష్టం గా కనిపించింది. ఒకరోజు అభిజిత్ మంచి నిద్రలో ఉండగా ఫోన్ వస్తుంది. భార్య లత తటపటాయిస్తూ ఫోన్ తీస్తుంది. ఆంబ్యులెన్స్ కోసం ఆ ఫోన్. అవతలి వాళ్ళు అడ్రెస్ చెప్పారు. అతన్ని అయిష్టం గా నిద్ర లేపుతుంది.
అభిజిత్ హడావుడిగా తయారవుతుంటే.... “ఒక డ్రైవరును పెట్టుకుంటే మీకు ఈ శ్రమ తగ్గుతుందిగా” ప్రేమతో కూడిన సలహా చెప్పింది లత.
“లేదు లతా... నేను స్వయంగా నడుపుకుంటూవెళ్ళి చేసేసాయంతోనే నాకు సంతృప్తి. సహాయం పొందినవారి కృతజ్ఞతా దృక్కులు మనమీద పడుతుంటే...ఆ ఆనందం ఎక్కడా దొరకదు. ఇప్పుడు నాతో రా అది నువ్వు కూడా స్వయంగా చూద్దువుగాని” ఇద్దరూ బయలుదేరారు. ఇంట్లో వంటరిగా ఉండి ప్రసవ వేదనతో బాధపడుతున్న యువతి ఫోన్ అది.... ఆఘమేఘాల మీద ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆలస్యంగా వచ్చిన ఆ యువతి భర్త అభిజిత్ చేసిన సాయానికి కన్నీళ్ళ పర్యంతమౌతాడు. అతనొక సినిమా ప్రొడక్షన్ లో పనిచేస్తాడు. వేళా పాళా లేని ఉద్యోగం.
()()()
ఒకరోజు అభిజిత్ ఆసుపత్రిలో తన రిపోర్టులు తెచ్చుకుందామని కారులో బయలుదేరుతాడు. ఒకచోట గుంపుగా జనం గుమికూడి ఉంటే కారు పక్కగా ఆపి ఏం జరిగిందని అడుగుతాడు. కారు ప్రమాదంలో తల్లీ, తండ్రీ మరణించారని, ఐదేళ్ల కూతురు కొనఊపిరిలో ఉందని, ఆంబ్యులెన్స్ కోసం ఎదురు చూస్తున్నారని ఒక వ్యక్తి చెబుతాడు. అభిజిత్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ పాపను పోలీసుల సాయంతో తన కారులో ఆసుపత్రికి తీసుకు వెళతాడు. డాక్టర్లు పాప ప్రాణాలు కాపాడుతారు. కానీ, షాక్ వల్ల ఆమె నిశ్చలంగా ఉంటుంది. ఎటువంటి స్పందనా ఉండదు. ఆ అమ్మాయి పేరు దిశ.
ఒకరోజు దిశ చిన్నాన్న, ఆమెకు ప్రముఖ నటుడు శ్రేయాస్ తల్పడే (మరాఠీ, హింది చిత్రాల నటుడు) అంటే చాలా ఇష్టం అనీ, ఆయనను తీసుకువచ్చి మాట్లాడిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమోనని అంటాడు.
అభిజిత్ కు సినిమా ప్రొడక్షన్లో పనిచేసే యువకుడు గుర్తుకు వస్తాడు. అతని సాయంతో శ్రేయాస్ తల్పడే ను ఆసుపత్రికి తీసువస్తారు, తన అభిమాన నటుడి మాటలకు దిశలో క్రమంగా మార్పు వస్తుంది. కోలుకుంటుంది. శ్రేయాస్ కు అభిజిత్ కు మధ్య పరిచయం పెరుగుతుంది. అభిజిత్ చేస్తున్న ఆంబ్యులెన్స్ సేవలకు అతడు ముగ్ధుడవుతాడు.
ఒకరోజు మాటల మధ్యలో “మిమ్మలను చూస్తుంటే, మీలో ఒక నటుడు దాగి ఉన్నాడనిపిస్తుంది, సినిమాలో వేషం వేస్తారా, ప్రస్తుతం నేను నటిస్తున్న చిత్రంలో ఒక వేషం ఉంది, డైరెక్టర్ మంచి ఫ్రెండ్, నేను చెబితే కాదనడు” శ్రేయస్ తల్పడే మాటలకు అభిజిత్ ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఒప్పుకుంటాడు. కొడుకు దిలీప్ కు ఎప్పటికప్పుడు ఆన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు.
కార్గిల్ యుద్ధం లో తన కుమారుడు వీర మరణం పొందిన విషయాన్ని భార్యకు చెప్పలేక తనలో తను కుమిలి పోయే ఒక వృద్ధుడి వేషం ఇస్తారు. అభిజిత్ చక్కగా నటిస్తాడు. మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆ సినిమా ప్రివ్యూ సమయంలో ఇతని నటనకు ముగ్ధుడైన మరో దర్శకుడు తన చిత్రంలో పెద్ద వేష ఇవ్వజూపుతాడు. కానీ, అభిజిత్ తన అనారోగ్య కారణాలు చూపి, ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు.
తన ఆరోగ్యం ఎంత వొడిదుడుకులకు లోనైనా అభిజిత్ మాత్రం ఆంబ్యులెన్స్ సేవలు మాత్రం ఆపడు. క్రమంగా ‘కార్ ఆంబ్యులెన్స్’ మనిషిగా గుర్తింపు పొందుతాడు. పేపర్లలో అభిజిత్ పై ఆర్టికల్స్ ప్రచురిస్తారు. వివిధ స్వచ్చంద సంస్థలు ఆయన సేవలను గుర్తించి అవార్డులతో సత్కరిస్తారు. అభిజిత్ లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అతని మొహంలో విచారచారలు కనిపించడం లేదు. ఒకసారి ఆసుపత్రిలో రిపోర్ట్ లు చూసిన డాక్టర్ చాలా ఆశ్చర్యపోతాడు. ఆరోగ్యంలో ఎంతో మెరుగుదల కనిపిస్తుంది. భర్తలో వచ్చిన మార్పుకు లత చాలా సంతోషిస్తుంది. తన హాబీ అయిన చిత్రలేఖనాన్ని కొనసాగిస్తుంది.
()()()
ఒకరోజు లత చిన్ననాటి మిత్రురాలు విధ్య తన భర్త తో కలసి చాలా కాలం తరువాత ఇంటికి వస్తుంది. వారు ఎప్పుడో విదేశాల్లో స్థిర పడ్డారు. తాము సంవత్సరానికి కనీసం ఇరవై రోజులైనా యాత్రలకు వెళ్తామని, ప్రపంచం అంతా చుట్టేశామని, ఈ సారి ఇండియాలో చూడని ప్రదేశాలు చూద్దామని వచ్చామని చెబుతారు.
వారు వెళ్ళిపోయిన తరువాత, అభిజిత్ చాలా సేపు ఆలోచిస్తాడు. జీవితంలో తామిద్దరమూ కలసి ఎక్కడికీ వెళ్లలేదు. తన లత కూడా ఎప్పుడూ ఏదీ అడగలేదు. ఎక్కడికైనా వెళ్ళి ఆమెతో కొన్ని రోజులు సరదాగా గడిపి రావాలని నిశ్చయించుకుంటాడు. తమ పెళ్లి రోజైన ఫిబ్రవరి 14వ తారీఖు నాటికి మనాలి లో ఉండేటట్లుగా ప్రణాళిక సిద్ధం చేస్తాడు. కొడుకుకు కూడా చెబుతాడు. మంచి ఆలోచన అనీ తప్పకుండా వెళ్ళి రమ్మని చెబుతాడు.
లత, అభిజిత్ మనాలిలో చాలా ఆనందంగా గడుపుతారు. మంచులో చిన్న పిల్లల్లా ఆడుకుంటారు. ఆ రోజు ఫిబ్రవరి 14, ఇద్దరూ హోటల్ గదిలో కూర్చుని తాము కొని తెచ్చుకున్న కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని ఆనందపడతారు. డోర్ బెల్ మోగుతుంది. బయట హోటల్ మేనేజర్ నిలబడి ఉన్నాడు. “అన్నీ సిద్ధం చేశారు. మిమ్ములను రమ్మంటున్నారు” చెప్పి వెళ్ళిపోతాడు. దంపతులిద్దరూ అయోమయంగా చూసుకుని, హోటల్ లాంజ్ లోకి వెళతారు. అక్కడ ఎదురుగా కొడుకు దిలీప్ వీరినే ప్రేమగా చూస్తూ నిలబడి ఉంటాడు. వారి ఆనందానికి హద్దులు ఉండవు. కొడుకును గుండెలకు హత్తుకుంటారు. ఇంతలో మరో వైపు నుంచి లాంజ్ లోకి వస్తున్న వ్యక్తులను చూసి దంపతులిద్దరూ ఉబ్బితబ్బిబ్బు అవుతారు. నటుడు శ్రేయాస్ తల్పడే, దిశ, అంతేకాకుండా తాను ఆంబ్యులెన్స్ సేవలు అందించిన మరికొంత మంది చేతిలో పుష్ప గుచ్చాలు పట్టుకుని వచ్చి నిలబడ్డారు. ఒక్క సారిగా అందరూ “హాపీ మేరేజ్ డే” అని అరుస్తూ చప్పట్లు చరుస్తారు. ఇదంతా తమ కొడుకు చేసిన తమను ఆశ్చర్యానికి గురిచేయడానికి చేసిన యేర్పాట్లని తెలుసుకుని మురిసిపోతారు. అందరి మొహాల్లోనూ ఆనందం వెళ్ళి విరుస్తుంది. దిలీప్ తన తండ్రి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. దంపతులిద్దరూ అతడి మాటలకు ఆనందం పట్టలేక పోతారు. ఇంతలో హఠాత్తుగా అభిజిత్ మెల్లగా తన వెనక ఉన్న సోఫాలోకి జారి పోతాడు. అప్పటివరకూ ఆనందం వెళ్లివిరిసిన ఆ ప్రదేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. నిర్జీవమైన అభిజిత్ దేహం కూలిన వృక్షం లా ఒరిగిపోయి ఉంది. ¤¤¤¤
అభిజిత్ పార్థివ దేహం అగ్నికి ఆహుతి అవుతోంది. చుట్టూ అంత్యక్రియలకు వచ్చిన వారు వందలాదిగా నిలబడి ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని, సేవలను పొగుడుతున్నారు, మెచ్చు కుంటున్నారు.
“నేను చచ్చిపోతే అంత్యక్రియలకు ఎనిమిది, పదిమంది కూడా రారేమో” అని బాధపడ్డ అభిజిత్, అక్కడ అంత మందిని చూసి ఆయన ఆత్మ తప్పకుండా సంతృప్తి చెంది ఉంటుంది.
-సమాప్తం-
(ఈ చిత్రంలో అశోక్ సరాఫ్ (అభిజిత్ ఇనాందార్), పద్మిని కొల్హాపురి (లతా ఇనాందార్), శశాంక్ ఉదపుర్కర్ (దిలీప్), ఈయనే ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు కూడా., శ్రేయాస్ తల్పడే (శ్రేయాస్ తల్పడే), తదితరులు నటించారు. చాలా సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. చివరలో తండ్రి కొడుకుల మధ్య సంభాషణ కంటతడి పెట్టిస్తుంది)
ఈ రోజు శాశ్వతం కాదని
ఈ జీవితం శాశ్వతం కాదని గ్రహించి
దానికి అనుగుణంగా సుస్థిరమైన స్థానాన్ని పొందాలనే కోరికతో
దానికి ఏమి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది
అనేది
మన ఆలోచన దృక్పథాన్ని బట్టి ఉంటుంది మనం పెరిగిన పెరుగుతున్న నేపథ్యం కూడా అందుకు కారణం కావచ్చు
చిరంజీవిగా
మనం అందరం ఉండలేక పోతున్నాను అని భాదపడేకన్నా మనం చేసే సేవా తత్పరత
వల్ల
పరోపకార భావన
వల్ల
మన పేరుకి
చిరంజీవ తత్వం ఏర్పాటు చేసుకో!!

👉సేవలో ఉన్న ఆనందం, ఆరోగ్యం... ఏ పూజ, జపం, ధ్యానం, యోగా, వ్యాయామం.... లోనూ దొరకదు అది ఎరిగిన వారి జన్మ ధన్యం.👈

💥మానవసేవే మాధవసేవ

ఆలోచనా మనదే
ఆచరణా మనదే

అందరూ బాగుండాలి
ఆ అందరిలో మనమూ ఉండాలి.

💥 సర్వేజనాః సుఖినో.

Source - Whatsapp Message

No comments:

Post a Comment