Thursday, October 28, 2021

అప్పట్లో అలా... ఇప్పటితో పోల్చితే.... 1990లలో జీవనం ఎలా వుండేది?

అప్పట్లో అలా... ఇప్పటితో పోల్చితే.... 1990లలో జీవనం ఎలా వుండేది? తెలియాలంటే మాత్రం తప్పని సరిగా చదవాలి మరి.

డబ్బుకు ప్రాధాన్యం ఇప్పటి తో పోల్చితే, అపుడు బాగా తక్కువ.

2000 కు ముందు వరుసగా 3, 4 ఏళ్లు కరువు వచ్చినా, బియ్యం, తదితర నిత్యావసరాల ధరలు పెరగలేదు.

విశాలమయిన ఇళ్ళు. అపార్ట్మెంట్స్ దాదాపుగా లేవు.

రోజూ ఇంటికి భిక్షానికి వచ్చి, పెట్టిన అన్నం, కూరా సంతోషంగా తీసుకుని వెళ్ళే వారు.

సంక్రాంతి వస్తుందంటే, పోటీలు పడి అమ్మాయిలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులేశే వారు.

కేటరింగ్లు లేవు. ఏ శుభకార్యం జరిగినా, బంధువులు పది రోజులు ఉండి, తలా చెయ్యి వేసి, వంటల నుంచీ బట్టలు ఉతికే వరకు అన్నీ చేసే వారు.

పిల్లలకు స్వీట్స్, కారప్పూస అన్నీ ఇంటిలోనే తయారు చేసి, అత్తయ్యలు తెచ్చేవారు.

ఎందరో పిల్లలు బంధువుల ఇళ్ళల్లో ఉంటూ చదువుకునే వారు.

బంధువులు వస్తే రెండు మూడు వారాలు ఉండి వెళ్ళే వారు. వాళ్ళు వెళ్లి పోతుంటే పిల్లలు, వెంటపడి అపుడే వెళ్ళవద్దు అని ఏడిచేవారు. ఇపుడు బంధువులు వస్తున్నారంటే ఏడుస్తున్నారు.

ఎంత దూరమైనా ఊళ్ళో నడిచి లేక సైకిల్ పైనే వెళ్లే వాళ్ళం. ఇపుడు ఇంటి పక్క షాప్ కైనా, బండి తీయాల్సిందే.

సైకిల్ కు హెడ్ లైట్ లేక పొతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసే వారు. సైకిళ్లకు లైసెన్స్ లు కూడా ఉండేవట.

రిక్షా వాడు బాడుగకు పావలా తక్కువకు బేరమాడితే, ఇంకో పది పైసలు ఇప్పించండి బాబు అని బతిమాలే వాడు. ఇపుడు ఆటో వాడు, చెప్పిన రేట్ కు తక్కువ అడిగాం అనుకో, పడ తిట్టి పోకుండా ఉంటే మన అదృష్టం.

స్కూటర్, లునా, మోఫా ఉండేవి. స్కూటర్ అంటే బజాజ్ చేతక్. బుకింగ్ చేస్కుంటే, 1– 2 years తరువాత వచ్చేది.

ట్రైన్ రావడానికి కొంత ముందు స్టేషన్ కు వెళ్లి, రిజర్వేషన్ అప్పటికి అపుడే చేయించుకునే వారు, దొరుకుతుందో లేదో అని ఆందోళన లేకుండా!

సాయంత్రం ట్రైన్ లో వెళ్తుంటే, స్టేషన్ ల మధ్య గూళ్లకు చేరుకుంటున్న వేల కొద్దీ పక్షుల సందడి కనబడేది, వినబడేది. ఇపుడు ఏమీ లేదు. నిశ్శబ్ధం.

ట్రైన్, బస్ ల లో మనుషులు మాట కలిపి, తెలియని వారయినా కష్ట సుఖాలు చెప్పుకునే వారు. ఇపుడు తెలియని వారితో మాట్లాడితే, ప్రమాదమే!

కుటుంబంకి ఫ్యామిలీ డాక్టర్ ఉండే వారు. ఇన్ని కొత్త రోగాలు, స్పెషలిస్ట్ లు లేరు.

టెన్త్ లో 60% ఫస్ట్ క్లాస్ వచ్చినదంటే చాల గొప్ప.

ఇంటిలో నాయనమ్మ, తాతయ్యలు తప్పక ఉండే వారు.

కూల్ డ్రింక్ అంటే Gold Spot యే!

ప్రతి వేసవి సెలవులు తప్పక అమ్మమ్మ, తాతయ్య ల ఇంటికే. మధ్యాహ్నం చెట్లు ఎక్కడం, కాయలు కోయడం తప్పనిసరి.

నీళ్లు ఎక్కడ ఏ pump క్రిందనైనా త్రాగేసే వారు. వాటర్ ఫిల్టర్ లు లేవు.

వేసవిలో రోజూ సాయంత్రం 7 కు కరెంట్ పోయేది. కిరోసిన్ తో పని చేసే లాంతర్లు, ముగ్గు తో తోమి సిధ్ధం చేసే వారు.

గ్రామాల్లో ఎద్దుల బండ్లు పై సరదా సవారీ.

కోడి కూత తో నే నిద్ర లేవటం. అలారం లు లేవు.

అందరి ఇళ్ళలో నీటి బావులు, వేడి నీటికి బాయిలర్ లు లేక బొగ్గుల కుంపటి ఉండేవి.

ఏడు పెంకులాట, గిల్లీ దండా, దాగుడు మూతలు, గాలి పటాలు, గోళీకాయల ఆటలు, గల్లీ క్రికెట్, కోతి కొమ్మచ్చి, సైకిల్ పందేలు, ఇవే మన ఆటలు.

ఉత్తరాలు కార్డ్, ఇన్లాండ్ లెటర్స్ ప్రధాన సమాచార వారధి. అపుడపుడు ట్రంక్ కాల్ . Telegram వచ్చింది అంటే దడే…అర్ధరాత్రి అయినా వచ్చి తలుపు కొట్టి ఇచ్చే వారు.

Telephone, fridge, TV లు ఉన్నవారు గొప్ప ధనవం

కాలేజీల్లో చదివే పిల్లలకు డబ్బులు పంపాలంటే, money ఆర్డర్ యే గతి. అది తెచ్చిన పోస్ట్ మాన్ కు 2 రూపాయలు బహుమానం!

ఇంటికి పిల్లలు ఉత్తరం రాసి పంపిస్తే, దానిని పోస్ట్ మాన్ యే చదివి, వారికి వినిపించే వారు.

సినిమాకు వెళ్ళడమే గొప్ప ఆటవిడుపు. సినిమా ప్రచారం గూడు రిక్షా, పాంఫ్లెట్లు, పోస్టర్లు.

ప్రసాద్ పెన్, అశోక్ పెన్, హీరో ఫౌంటైన్ పెన్ లు చాలా పేరు గాంచినవి. Reynolds ball పాయింట్ పెన్ అంటే క్రేజ్!

స్కూళ్లకు పిల్లల కోసం గూళ్ళ రిక్షాలు ఉండేవి. 5,6 తరగతులు కు వచ్చారంటే పిల్లలే నడిచి స్కూల్ కి వెళ్లి పోయేవారు. పికప్ డ్రాప్ లు లేవు.

దీపావళి కు పది నుంచి నెల రోజుల ముందే టపాసులు పేలుతుండేవి. తారాజువ్వలు, సిసిండ్రీలు పిల్లలే తయారు చేసుకునే వారు.

గుడులలో హరికథా కాలక్షేపం సర్వ సాధారణం.

Theater కు వెళ్తే, నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ టికెట్లు. Theater లోపల సిగరెట్లు బీడీలు కాల్చుతు సినిమాలు చూసే వారు. అలానే ట్రైన్స్, హోటల్స్, బస్ ల లో కూడా యధేచ్చగా…

సినిమా పాటలకు లిరిక్స్ పుస్తకాలు పావలకు అమ్మేవారు.

పౌరాణిక, కుటుంబ, సామాజిక, భక్తిరస చిత్రాలదే రాజ్యం.

పెద్దలకు వార్తా పత్రిక లు ఈనాడు, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ, ఉదయం, వార్త, ప్రజా శక్తి. పిల్లలకు: చందమామ, బొమ్మరిల్లు, బాల జ్యోతి. గృహిణులకు: ఆంధ్ర భూమి, స్వాతి వారపత్రిక లు. యువకులకు: యువ, స్వాతి మాస పత్రికలు. పెద్దవారికి Readers Digest. ప్రభుత్వ ఉద్యోగార్థులకు Employment News Weekly.ఇలా!

వార్తలంటే రేడియో, సినిమా పాటలంటే శుక్రవారం సాయంత్రం 7 గంటలకు, అరగంట చిత్ర లహరి .సినిమా అంటే నెల కో, రెండు నెలలకో DD National లో వచ్చే తెలుగు సినిమా వచ్చేది.
దసరా, సంక్రాంతి పండక్కి ఫ్రెండ్స్ తో కలసి సరికొత్త సినిమాలు చూడటం అదోక గమ్మత్తైన సరదా.
ఎవరైన ఫ్రెండ్స్ తను చూడని సినిమా చూసివుంటే వారితొ ఆ సినీమా కథ అడిగి మరీ చెప్పించు కోవడం మహా సరదా.
ఇలా గమ్మత్తైన విషయాలు ఎన్నో, ఎన్నేనో..అప్పటి రోజులు గడిపిన వారికి మరుపురాని మధురానుభూతులు.ఆ పాత మధురాలు...తిరిగి రాని అమృత్సోవాలు.
కాదంటారా ఫ్రెండ్స్!అవునంటారని నా భావన.
సమయం పెట్టి చదివిన మీకు అభినందనలతో ...

సేకరణ

No comments:

Post a Comment