Tuesday, October 5, 2021

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.

మనం పూజలు కానీ, వ్రతాలు కానీ, జపం కానీ, ధ్యానం కానీ రోజూ చేసుకునే అలవాటు/అభ్యాసం అయితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే అలా కేవలం అభ్యాసంగా కాకుండా వాటిలోని అర్థాన్ని తెలుసుకొని చేయటం ఉత్తమమని "శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్" అని భగవద్గీత బోధిస్తోంది.  దీనినే "తెలిసి రామ చింతన చేయమని" శ్రీ త్యాగరాజ స్వామివారు బోధించారు. 

అయితే కేవలం అర్థం తెలుకున్నంత మాత్రాన సరిపోదు, దానిమీద నీ మనస్సునుంచి నీ ధ్యానంలో నిలుపుకుని చేయాలని "జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే" అని కూడా చెబుతోంది. 

కానీ, అర్థం తెలుసుకొని, ధ్యాస నిలిపి సత్కర్మలు ఆచరించినప్పటికీ వాటిని ఏదో ప్రయోజనం ఆశించి చేయటం వలన అవి కామ్య కర్మలుగా మారి చివరికి బంధాన్నే కలిగిస్తాయి. అందుకనే ధ్యానం కన్నా కూడా కర్మఫల త్యాగం గొప్పదని "ధ్యానాత్ కర్మఫల త్యాగః" అని చెప్పబడింది. 

ఇక అలా ఫలితాన్ని భగవంతునికే విడిచిపెట్టి సత్కర్మలను ఆచరించటం వలన మనకు శాశ్వతమైన శాంతి లభిస్తుంది. దీనినే భగవద్గీత "త్యాగాత్ శాంతిరనంతరం" అని నొక్కి వక్కాణిస్తోంది. 

చెరువు దగ్గరకు ఒక గ్లాసు తీసుకువెళితే నీకు గ్లాసుడు నీళ్ళే వస్తాయి. అలాగే చెంబుతో వెళ్ళిన వాడికి చెంబుడు నీళ్ళు, బిందెతో వెళ్ళిన వాడికి బిందెడు నీళ్ళు లభిస్తాయి. కాని ఏమీ తీసుకువెళ్ళకుండా తానే వెళ్ళి చెరువులో మునిగిన వాడికి ఆ చెరువంతా తనదే అవుతుంది. చూసారా ఫలితం ఆశించని వాడికి ఎంతటి ఫలితం దక్కుతుందో? ఇక వాడి మనసులో అశాంతికి తావెక్కడిది? 

ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే, ప్రకృతి దానిని గడ్డీగాదంతొ నింపేస్తుంది. అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపక పోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment