Tuesday, October 19, 2021

ముహూర్తములు-అవగాహన

లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం.
శ్రీనివాస సిద్ధాంతి.9494550355

ముహూర్తములు-అవగాహన

జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంస్కారాలను,అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంస్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది.

వివాహము
ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల రోజులలో వివాహము మంచిదే.

లగ్నంలో పాపగ్రహములు లగ్నాత్ సప్తమంలో పాపగ్రహములు లేకుండా వివాహ సుముహూర్తము చేయాలి. ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు వివాహమునకు గ్రాహ్యము కాదు అని కొందరి వాదన వున్నది. అది కూడా గ్రంథాధారమే కానీ వాటిల్లో కొందరు మహర్షులు శ్రేష్ఠము అని చెప్పిన కారణంగా అందరూ ఆచరిస్తున్నారు. చిత్తా నక్షత్రం గ్రాహ్యం కాదని వాదన. లగ్నాత్ కేంద్రములు అనే 1,4,7,10 స్థానములలో శుభ గ్రహములు వుండడం దృష్ట్యా వివాహ లగ్నమునకు బలం ఎక్కువ అని చెప్పాలి. లగ్నాత్ 1,4,5,7,9,10 స్థానములలో శుభగ్రహ సంచారం విశేష లాభ ఫలితాలు ఇస్తుంది. అవకాశం వున్నంతవరకు 1,7 స్థానములలో పాపగ్రహములు లేకుండానే నిర్ణయం చేయాలి. శుక్ర గ్రహమునకు పాపగ్రహం సంబంధం లేకుండాను అలాగే చంద్రగ్రహం వున్న నక్షత్రంలో పాపగ్రహం లేకుండాను చేసుకోవాలి. కారణం కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే మనఃకారకుడు చంద్రుడు. అలాగే వీలయినంతవరకు గురు బలం అధికంగా వున్న ముహూర్తం నిర్ణయించాలి.

గర్భాదానము
స్త్రీ, పురుషులు (భార్యభర్తలు) ఇద్దరు కలసి ఒక కొత్త ప్రాణికి జీవం పోయడామే గర్భాదానము. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ అండాశయంలో ఏర్పడిన అండంనకు పురుషునిలో ఉత్పత్తి అయిన వీర్యకణం ద్వారా ఫలదీకరణం చెందినట్లయితే స్త్రీ గర్భం దాల్చి నూతన జీవి పుట్టుకకు అవకాశం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల చిత్త వృత్తులు సంతానోత్పత్తి కాలములో ఎలా ఉంటాయో అటువంటి లక్షణాలు కలిగిన శిశువే జన్మిస్తారు. కావున తల్లిదండ్రులు గర్భాదాన సమయమున తాము దేవతలమని, పతి ప్రజాపతి యొక్క అంశ గలవాడని, పత్ని వసుమతి రూపమని తలచి దేవతా చింతనము చేయుచు గర్భాదానము చేయవలెను.అశ్వని, భరణి, ఆశ్రేష, మఘ,మూల, జ్యేష్ఠ, రేవతి నక్షత్రముల పూర్తి నిషేధము. జన్మ, నైధన, తారలు కాకూడదు. ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, మృగశిర, హస్త అనూరాధ,శ్రవణం, ధనిష్టం, శతభిషం, రోహిణి స్వాతీ నక్షత్రములు విశేషములు. రెండు పక్షములలోని షష్ఠి అనధ్యయన దినములు ఏకాదశులు , ఆది మంగళ వారములు సంక్రమణ దినములు శ్రాద్ధ దినములు గర్భదానమునకు నిషేధదినములు వివాహం అయిన 16 రోజులలోపు గర్భదానమునకు ముహూర్తమును చూడనవసరం లేదు అనునది అశాస్త్రీయ విషయము. భార్య భర్తల భవిష్య ఆరోగ్య విషయములో గర్భాధాన ముహూర్తం ముఖ్య భూమిక వహిస్తుంది. వ్రతములు ఆచరించు దినములలో సంగమం నిషేధం.
సీమంతం
తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేదే సీమంతం. తొలి గర్భదారణ విషయంలో 4, 6, 8 మాసములలో చేయుట శాస్త్ర సమ్మతము. అయితే 5, 7, 9 మాసములలో చేయుట ఆచారము. పుంసవనమునకు అష్టమ శుద్ధి కావలెను. సీమంతమునకు అష్టమ, నవమ శుద్ధులు రెండూ కావాలి. సీమంతర అనివార్య కార్యముల వలన చేయలేనిచో ప్రాయశ్చిత్తముగా గోదానము చేయాలి.

గర్భిణీపతి ధర్మాలు
భార్య గర్భవతిగా వున్నప్పుడు "గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాత్ యధోచితం" భార్య కోరిన ఉచితమైన కోరికలు భర్త తీర్చవలెను. విదేశీ ప్రయాణము, చెట్ల నరుకుట, 7వ మాసం నుంచి క్షౌరము, మైధునము, తీర్ధయాత్ర, శ్రాద్ధ భోజనము, నావప్రయాణము, వాస్తుకర్మలు, సముద్ర స్థానము, ప్రేతకర్మలు నిషేధము. గర్భిణీపతి స్వపితృకర్మలు చేయవచ్చును.

బారసాల
తనని పరిపూర్ణ స్త్రీగా నిరూపించిన తన బంగారు బిడ్డకి అన్ని వేళలా తోడుగా ఉంటూ ప్రతిక్షణం తనదిగా, తన లోకంగా ఉండే చిన్నారి బిడ్డకు తొలుత చేసే ముచ్చటైన వేడుక బారసాల. మంగళ, శనివారములు పనికి రావు. అష్టమి ద్వాదశి, నవమి, అమావాస్య తిధులు పనికిరావు. బారసాల రోజునాయితే ఆ రోజు సాయంత్రం వర్జ దుర్ముహూర్తములు లేకుండా ఊయలల్లో నూతనముగా శిశువును వుంచవచ్చును. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ట, పు.షా, పుభా, నక్షత్రములు పనికి రావు.

క్షౌరం + పుట్టు వెంట్రుకలు
షష్ఠి, అష్టమి, నవమి, చవతి, చతుర్దశి, అమావాస్య, ద్వాదశి, పాడ్యమి తిధులు పనికి రావు. శుక్ర, మంగళ శనివారములు కూడదు. పుష్య, పునర్వసు, రేవతి, హస్త, శ్రవణ, ధనిష్ఠ, మృగశిర, అశ్వని, చిత్ర, శతభిషం, స్వాతి ఇవి ప్రసస్తములు ఉత్తర తూర్పు దిక్కుగా కూర్చొని క్షౌరం చేయించుకోవాలి. నిత్యంలో సోమ, బుధవార విషయములలో తిధి, నక్షత్రం పట్టింపు లేదు.

అన్నప్రాసన
మగపిల్లల విషయంలో 6వ మాసం అన్నప్రాసన చేయలి. 5వ మాసం మొదలు బేసి మాసముల యందు ఆడపిల్లల విషయములో అన్నప్రాసన చేయాలి. 6వ నెల 6వ రోజు అనేది కుసంస్కారము. అది దుష్టాచారము. అన్నప్రసనతోనే పిల్లల ఆరోగ్య విషయాలు ఉంటాయి. అందు కోసం మంచి ముహూర్తానికే అన్నప్రసన చేయాలి. అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడం, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్త్రాభాద్ర, రేవతి నక్షత్రములయందు చేయవలెను. ఆది, శని, మంగళవారములు నిషేధం. జన్మలగ్నం, అష్టమ లగ్నం కాకుండా, దశమస్థానం శుద్ధి ఉన్న లగ్నమున అన్నప్రాసన చేయవలెను.

చెవులు కుట్టుట
జన్మించిన 12వ లేదా 16వ రోజును లేక 6వ, 7వ, 8 నెలలయందైననూ పూర్వాహ్న, మధ్యాహ్న కాలములలో సోమ, బుధ, గురు, శుక్రవారములలో శ్రవణం, అర్ద్ర, హస్త, చిత్త, మృగశిర,రేవతి, ఉత్తర ఉత్తరాషాఢ, ఉత్తరాభాధ్ర, పుష్యమి, పునర్వసు, ధనిష్టయందు కుంభ, వృశ్చిక, సింహ లగ్నములు కాకుండా, అష్టమ శుద్దితో కూడిన లగ్నమునందు చెవులు కుట్టుట మంచిది.

అక్షరాభ్యాసం
ఉత్తరాయణం శ్రేష్ఠం. హస్త పునర్వసు, స్వాతి, అనూరాధ, అర్ద్ర, రేవతి, అశ్వని, చిత్త, శ్రవణములయందు ఆది, మంగళ, శనివారములు కాకుండాను చరరాశి లగ్నమందు రిక్తతిధులు షష్ఠి, అష్టమి విడిచి అనధ్యయన దినములు కాకుండా అష్టమ శుద్ది కలిగి ఉండే లగ్నమునందు అక్షరాభ్యాసం చేయాలి. కేవలం మధ్యాహ్నం లోపుగా ఉన్న లగ్నమునందు అక్షరాభ్యాసం చేయాలి

జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.
ద్విస్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్న,వాస్తు విశారద,C V రామన్ అకాడమీ అవార్డు గ్రహీత ..శ్రీనివాస సిద్ధాంతి
లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.
9494550355

plz forward the message🌹

సేకరణ

No comments:

Post a Comment