Friday, October 15, 2021

మహాసరస్వతీ దేవి అవతార అంతరార్థం పరమార్థం

మహాసరస్వతీ దేవి అవతార అంతరార్థం పరమార్థం

శరన్నవరాత్రులలో మూలనక్షత్రానికి ప్రత్యేక విశిష్ఠత ఉంది. చదువుల తల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. సరస్వతీ దేవిని కొలిస్తే విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసం కలిగి మంచి విద్యావంతులగుదురు. త్రిశక్తి రూపాలలో ఈమె మూడవ శక్తి రూపం. సంగీతం, సాహిత్యాలకు అధిష్టాన దేవత.

బ్రహ్మరూపంలో ఉన్న రజోగుణధారి అయిన పరమపురుషుని శక్తి ‘సరస్వతి’. రసముతో కూడినది సరస, సరసము కలది సరస్వతి. రసము అనగా రుచి (కోరిక). కోరికకు మూలం సరస్వతి కావున ఆ కోరికను గెలిచిన నాడే పురుషుడు పూర్ణుడవుతాడు. కోరికను గెలవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కావున జ్ఞానసర స్వతిగా వ్యవహరిస్తారు. జ్ఞానమును శ్వేతవర్ణంతో పోలుస్తారు కావున ఈమె ”కుందేందు తుషార హార దవళ” అనగా మల్లె, చంద్రుడు, మంచు వలె తెల్లని అకారము కలదని అర్థం. తెల్లని పద్మముపై ఆసీనురాలై తెల్లని వస్త్రం ధరించి వీణ, పుస్తకం, జపమాల కలిగి ఉంటుంది . జ్ఞానాన్ని ప్రసాదించే విద్యకు ప్రతీక పుస్తకము అలాగే, జ్ఞానంతో కలిగే ఆనందానికి ప్రతీక వీణ. వీణ పలికించే సప్తస్వరములే ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇంద్రియాలను ఆనందింపచేయాలంటే కావాల్సిన జ్ఞానం జపము, తపములతో కలుగుతుంది. జపమాల, పద్మాసనం జపతపాలకు సూచిక. ఈమె బ్రాహ్మీముహూర్తం (సూర్యోదయం కంటే ముందున్న అరుణోదయం) నుండి మధ్యాహ్న కాలం వరకు ఆవిర్భవించిన సమయముగా చెబుతారు. సరస్వతి ప్రకాశమయ రూపము కలిగి ఉంటుంది కావున ఈమెను ‘తార’గా వ్యవహరిస్తారు.

హిరణ్య గర్భ: సమవర్తతాగ్రే
భూతస్య జాత: పతిరేక ఆసీత్‌
సదాధార పృధ్వీం ద్యాముతేమామ్‌
కస్మై దేవాయ హవిషావిధేమ

ఇది హిరణ్యగర్భుడైన బ్రహ్మస్తుతి. విశ్వాధిష్టాత అయిన ఈ హిరణ్యగర్భుని శక్తిని తార లేదా సరస్వతిగా వ్యవహరిస్తారు. ప్రకాశసమయంలో అవతరించిన తల్లి కావున తార అని అంటారు. జ్ఞానానికి, ఆనందానికి, ఉనినికి, సరస్వతి మూలం కావున ఈమెను మూలా నక్షత్రం నాడు ఆరాధిస్తారు.🙏🙏🙏🙏

సేకరణ

No comments:

Post a Comment