Tuesday, October 19, 2021

నేటి జీవిత సత్యం. శాశ్వత సంపద.

నేటి జీవిత సత్యం. శాశ్వత సంపద.

ఎటువంటి మనిషైనా ఈ భూమ్మీదకు వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి.ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద.

వేదాలు పదేపదే చెప్పే విషయం. దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.

శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని (శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం (ఆత్మావలోకనం) అత్యవసరమని మనిషి గ్రహించి, ఆత్మజ్ఞానం పొందిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.
ఏ అవంకరం లేని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం.
ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి?

మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం.శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.
మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం "నేను" కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి.
ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సాయపడటం, లోకం కోసం మంచి పనులు చెయ్యడం మంచిదే. సందేహం లేదు. ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి. వాళ్లు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. పుట్టుక కోసం, మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ. శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు. శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు.

శరీరం జడం. అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి.
నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి, జీవన పరమార్థం నెరవేర్చుకోవాలి అంటున్నాయి ఉప నిషత్తులు. అందరూ ముక్తిని సాధించలేరు. ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే అవ కాశం ఉంది అందరికీ. జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం. దారి మార్చి, ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది. మనసు సారవంతమవుతుంది. కొంతకాలం తరవాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది. దయతో, ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి, ఆత్మను శక్తిసంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది. దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది.

మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు.
ఒకనాటి ఉదయం మట్టిలో నాటిన విత్తనం మూడోరోజు మొలకగా కనిపిస్తుంది. నల్లటి కారుమబ్బు వద్దన్నా జలజలా చినుకులు రాలుస్తుంది. ప్రకృతిలో ప్రతీది సహజంగా జరిగిపోయే ఏర్పాటు ఉంది.

జీవితమూ అంతే. అది జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన. సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. అష్టాంగ యోగ మార్గాలు, అష్టాదశ పురాణాల్లో మంచి విషయాలు దివ్యంగా జీవించే నరుడి ముందుకొచ్చి దర్శనం ఇస్తాయి.
* ఆధ్యాత్మిక సాధన లో యమ-నియమాలు ముందుగా చెప్పి తరవాత సాధన క్రమం అంతా చెబుతారు. మంచితనం లేనివాళ్లకు యోగం అబ్బదు. చెడ్డవాళ్లకు ఆలోచనలు అడ్డగించడం వల్ల ధ్యానం కుదరదు. మానసిక పరిశుభ్రత లేనివారికి, ఆరోగ్యదాయకమైన యోగా అనుకూలపడదు. భక్తి లేనివారికి జ్ఞానం ఒంటపట్టదు.
జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. జీవితం ఈశ్వర ప్రసాదం. భక్తిగా రెండు చేతులు పైకెత్తి దివ్యజీవనాన్ని ఆహ్వానించాలి. ఆటుపోట్లతో, హెచ్చుతగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా దైవ ప్రసాదం గా జాగరూకతతో అనుభవించాలి. నిజమైన సాధన ఇదే.
ఊపిరి ఆపడం, భూమిలోకి దిగబడిపోవడం, ముళ్లమీద పడుకోవడం వంటి యోగ సాధనాలు తీవ్ర అభ్యాసం వల్ల వస్తాయి. శరీర అంతర్గత శక్తులు ద్యోతకం అవుతాయి. మేధ వికసించి ఆత్మావలోకనం కలుగుతుంది..
జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన ఉన్నత శిఖరాలకు చేరినట్లే. ఒక దీపం మరోదీపం వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో వెలుగుని నింపాలి. అంతకంటే మనిషి జీవితానికి సార్థకత లేదు.

సాధన చేసి సత్యం తెలుసుకున్న మానవుడు ధర్మం గా మంచి పనులకే పూనుకొంటాడు. పూనుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి అనేక సాధన ల మయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది సాధనే. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం.
పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ జీవిస్తున్నాయి. మరి మనమెందుకలా "నేను" అనే అహం లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం? బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా. "నేను" అనే అహం లేకుండా చేసుకుంటే ఆ బుద్ధి వరం.

నేను" అనే అహం ను మేరుపర్వతమంత పెంచుకుంటే ఆ బుద్ధి శాపం. చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న "నేను" అర్జునుడు. పెద్ద "నేను" శ్రీకృష్ణుడు. అతి పెద్ద జీవనగమనం కురుక్షేత్ర యుద్ధం. అత్యంత అద్భుతమైన సాధన భగవద్గీత. శ్రీరాముడు సాధారణ మనిషిలా భూమిపై జీవించాడు. మనిషిగా తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆదర్శప్రాయుడు అయ్యాడు. జీవితం అవకాశం ఇస్తుంది. అంతే. దాన్ని సద్వినియోగపరుచుకోవాలి.
కారణజన్ముడికైనా, అకారణ జన్ముడికైనా- బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి విధిరాత భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది. పుట్టుకతోనే నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాడినైనా జీవితం తడిగుడ్డ పిండినట్లు పిండక మానదు. ఇంతకంటే మహాసాధన జీవితానికి ఉండదు.
మానవుడిగా పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించడం, సత్యానుభవం కోసం తహతహలాడటం... ఎన్నో జన్మల పుణ్యం. ఏ ఉపనిషత్తూ ఈ విషయాన్ని కాదనలేదు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment