Sunday, November 21, 2021

నేటి జీవిత సత్యం. తప్పులెన్నువారు.

నేటి జీవిత సత్యం.
తప్పులెన్నువారు

🌹పరనింద మానవ స్వభావంలో సర్వసాధారణ లక్షణం. తప్పులుగా తమకు తోచేవి ఎదుటి వ్యక్తిలో కనపడినప్పుడు, ఆ మనిషిలో మరెన్ని మంచి గుణాలున్నా, ఆ తప్పులనే పట్టిచూపిస్తుంటారు కొంతమంది. తప్పులుగా వాటిని అతడు అంగీకరించక ప్రతిస్పందిస్తే, చులకనగా చూడటమే కాక, అపరాధిగా ముద్ర వేయడానికైనా వెనకాడరు.

🍁మనిషి ఎప్పుడూ తప్పులే చేయడా?
🍁మరొకరి తప్పులపై తనకంత ఆసక్తి ఎందుకని? 🍁ఆత్మవిమర్శ చేసుకునేందుకు కొందరు అవకాశమివ్వరు.
🍁 సర్వం విష్ణుమయమన్నప్పుడు భగవంతుడి సృష్టిలో తప్పులెలా ఉంటాయన్న పరమ భావన మహాత్ముల్లోనే కనిపిస్తుంది.

🍁గీతలో కర్మయోగం, తప్పొప్పులను విభజించి భగవంతుడు మనిషికిచ్చినదేమీ లేదని, అవి రెండూ అతడి కర్మాచరణల ఫలితాలని అంటుంది.
🍁ధర్మశాస్త్రాలన్నీ అతడిని, తన అహంభావనలతోనే అవి నిర్ణయించి నిర్దేశించే న్యాయాధికారివి కావద్దంటాయి.
🍁అదే వాస్తవాన్ని, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని, వేమన శతకంలోని ఒక చిన్న పద్యపాదం అతడికి చిరకాలం జ్ఞాపకం ఉండేలా చెబుతుంది.

🍁ఇటాలియన్‌ మేధావి లియొనార్డో ఒకరిలో తప్పులుగా కనిపించేవి, భూతద్దాల్లో పెద్దవిగా చేసి చూపించి ప్రపంచాన్ని ఉద్ధరించాలని మనుషులనుకుంటే అది చవకబారు ప్రయత్నమంటాడు. దాన్ని మానుకొమ్మంటాడు.

🍁తప్పు మీద తప్పు చేసుకుపోతున్న శిశుపాలుడు అతడు నూరు తప్పులు చేసేదాకా కృష్ణపరమాత్ముడు ఉపేక్షించి ఊరుకున్నాడు.
🍁 ఆ తరవాతనే అతడిని సంహరించాడు. తప్పు చేసే వ్యక్తికి తగినన్ని అవకాశాలిచ్చికానీ భగవంతుడు శిక్షించడని చెప్పే పురాణ గాథల అంతరార్థం అదేనని మనుషులు గ్రహించరు.

🍁 తప్పు చేసినప్పుడు చేసిన వాడికది తప్పని చెప్పి సరిదిద్దుకొమ్మని ఒప్పించగల కుశలత కలిగినవాడు గొప్పవాడు.

🍁గౌతమ బుద్ధుడు అటువంటి మార్గదర్శకుడు. కరడుగట్టిన బందిపోటు అంగుళీమాలుడి దోషభూయిష్ఠమైన ప్రవర్తనలో గుణాత్మకమైన పరివర్తనకు కారణమై ఆయన అతడిని తనకు ప్రధాన శిష్యుడయ్యే స్థాయికి చేర్చాడు.

🍁తప్పులు చేసేవారికి తమ తప్పులు తెలుసుకునేందుకు భగవంతుడే సమయం ఇస్తున్నప్పుడు, సాటి మనిషి తప్పులపై అంత తొందరగా స్పందించవలసిన అగత్యం తమకేమిటని మనుషులు ఆలోచించరు. నిందారోపణలు చేస్తూ జీవించే మనిషి నిజ జీవితంలో ఎన్నటికీ విజేత కాలేడు.

🍁భగవంతుడు మనుషులందరినీ దోష రహితులుగా, సమగ్రత తొణికిసలాడే పరిపూర్ణులుగా సృష్టించలేదు. తప్పులు చేయవద్దని, అవి జరగకుండా చూసుకొమ్మని మనిషి మరో మనిషికి చెప్పడం ధర్మవిరుద్ధం కాదు.

🍁చేసిన తప్పు తెలియజెబుతున్నప్పుడు, తప్పు చేసిన వ్యక్తికి అది తనపై ప్రేమాభిమానాలతో, సదుద్దేశంతో జరిగిన ప్రయత్నంగా అనిపించాలి.
🍁యుక్తాయుక్తాలు నిర్ణయించే అధికారి తానన్న భావన అతడికి కలిగిస్తూ, తప్పులు సరిదిద్దాలనుకుంటే- ఈ ప్రపంచంలో అతడు ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముంటుంది.
- ✍️జొన్నలగడ్డ నారాయణమూర్తి

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment