Friday, January 28, 2022

ఆ కాలం ఏమి నేర్పింది??

ఆ కాలం
ఏమి నేర్పింది??

పొలం గట్లపై నడిపించి, తడబడకుండా నిలదొక్కుకోవటం
నేర్పింది.

వాగు పక్కన నీటి చెలిమలు తీయించి,
శోధించే తత్వం
నేర్పింది.

సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,
అన్వేషణ
నేర్పింది.

తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో,
జీవితం
పూలపాన్పు కాదని నేర్పింది.

చిన్న చిన్న దెబ్బలు తగిలితే,
నల్లాలం ఆకు పసరు పోయించి,
చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు
నేర్పింది.

చెట్టుమీద మామిడికాయ
గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని
ఛేదించడం
నేర్పింది.

నిండు బిందెను
నెత్తి మీద పెట్టి,
నీళ్లు మోయించి,
జీవితమంటే
బరువు కాదు..
బాధ్యత
అని నేర్పింది.

బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి,
బాలన్స్ గా
బరువు
లాగటం నేర్పింది.

ఇంటి ముంగిటకు అతిథి దేవతలు
హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,
ఉన్న దాంట్లో కొంత
పంచుకునే
గుణం నేర్పింది.

విస్తరిలో,
అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా
తినే
ఒద్దికను
నేర్పింది.

ఒక్క పిప్పర్మెంట్ ను, బట్ట వేసి కొరికి ముక్కలు చేసి,
కాకి ఎంగిలి పేరుతో
స్నేహితులతో
పంచుకోవటం
నేర్పింది.

ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేక్కాయలు తెంపే ఓర్పును
నేర్పింది.

దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ మెళకువలు
నేర్పింది.

అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యా వరుసలతో,
ఊరు ఊరంతా ఒక కుటుంబమనే
ఆత్మీయత*
నేర్పింది.

ధైర్యంగా
బ్రతికే పాఠాలను నేర్పిన

మన బాల్యానికి

జీవితాంతం
రుణపడి ఉందాం.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment