Sunday, January 30, 2022

శ్రీ రమణ మహర్షి ఉపదేశసారము

శ్రీ రమణ మహర్షి ఉపదేశసారము:

ఓం నమో భగవతే శ్రీరమణాయ

1.  దైవశాసనము బట్టి కర్మఫలము లభిస్తుంది. కర్మదైవమా? కానేకాదు కర్మ జడపదార్థం.

2.  కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది.

3.  ఈశ్వరార్పణ బుద్దితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధక మవుతాయి.       

4.  పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది.

5.  బ్రహ్మ భావనతో చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవానుని పూజ యగుచున్నది.

6. భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచకజపము కంటే మౌనజపము, మౌనజపము కంటే ధ్యానము ఉత్తమములు.

7.  నదీ ప్రవాహంలా, నేతి ధారలా, నిరాఘాటంగా సాగే సరళధ్యానం ఆటంకంతో కూడిన విరళచింతనం కన్నా మిన్న.

8. పరమాత్మా వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది. 
      
9.  ద్వైత భావమును దాటి ‘ఆ పరమాత్మే నేను’ నీలోను నాలోను అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావనా బలిమిచే కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు.

10.  మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.

11.  వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.

12.  ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.

13.  లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.

14.  ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.

15.  మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది?

16.  దృశ్యవస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపమును ఎరుగుటయే తత్త్వ దర్శనము.

17.  మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.

18.  వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.

19.  నేను అనేది ఎక్కడనుంచి పుడుతోంది? అని అన్వేషిస్తే ఆ నేను పతనమౌతుంది. ఇదే ఆత్మవిచారము.

20.  ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్ స్వరూపమైనది నగు ‘అహం అహం’ అను ఆత్మయే ప్రకాశించును.

21.  అహం వ్రుత్తి లయించినపుడు సదా సత్పదార్థము భాసించుటచే అదే నేను అను పదమును లక్ష్యార్ధమై యున్నది.

22.  దేహము, ఇంద్రియములు ప్రాణము,బుద్ధి,అవిద్య నేను కాను. అవి జడములు. ఏకసద్రూపమే నేను.

23.  సత్తు ను తెల్పుటకు చిత్తు వేరుగా యున్నదా? సత్తుయే చిత్తూ, చిట్టుయే నేను?

24.  శరీరాది ఉపాదులవలన జీవేశ్వరులలో భేదము కనుపించు నప్పటికీ ఇద్దరు సత్స్వ రూపులు అవడంవల్ల ఒకే వస్తువై యున్నారు.

25.  ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది.

26.  ఆత్మ అద్వితీయము కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుట యగును.

27.  జ్ఞానము – అజ్ఞానము రెండింటిని దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము.సమస్తమునకు అతీతమై, సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు వేరువస్తువు ఏమున్నది.

28.  తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో, అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకొనును.

29.  తన్ను తాను తెలుసుకొనెడి ఈ అత్మానుభావమును పొందిన దైవికుడు జ్ఞాని బంధము గాని ముక్తిగాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు.

30.  నేను అనునదిలేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సుయని రమణుని దివ్యవాణి పల్కుచున్నది. దేహము ఘటము వాలే జడమైనది. దీనికి నే నను తలపు లేనందునను, దేహము లేని నిద్రయందు గూడ దినమును మనముండుట చేతను, దేహము నేను కాదు; నేను ఎవరిని?ఎక్కడనించి వచ్చాను? అని సూక్ష్మ బుద్ధి చేత వెదికిచూచి, తన యందు నిలకడ జెందినవారల హ్రుదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు ‘అహం’ స్పురణరూపుడై స్వయంగా భాసితున్నాడు.

🙏ఓం నమో భగవతే
శ్రీ రమణాయ🙏
🌹🌹🕉️🌼🚩🌼🕉️🌹🌹

సేకరణ

No comments:

Post a Comment