Thursday, February 24, 2022

ప్రాణశక్తి - పంచ ప్రాణాలు

ప్రాణశక్తి - పంచ ప్రాణాలు :

📚🖊️ భట్టాచార్య

సనాతన ధర్మము ప్రవచించిన, యోగ శాస్త్రం ప్రకారం....ప్రాణశక్తి, ఆదిమ - వైశ్విక శక్తి. ఈ శక్తి భౌతిక విధులన్నిటిపై ఆధిపత్యం వహిస్తుంది. ప్రాణశక్తి, మహత్తరమైన జీవ శక్తి. ఈ శక్తి సృజనాత్మక శక్తి.

ఈ ప్రాణశక్తి మూడు రూపాలలో, ఈ శరీరానికి , మనస్సుకు శక్తిని ఇస్తూ ఉంటుంది. చిత్త శక్తి, మనస్సును నియంత్రిస్తూ ఉంటుంది. ఆత్మ శక్తి , ఆత్మతో అనుసంధానమై ఉంటుంది.

ఈ ప్రాణ శక్తి శరీరంలో, ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యానాది పంచ ప్రాణములు గానూ......నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయాది ఉప ప్రాణములు (ఉప వాయువులు) గానూ....విస్తరించి, తన విధులను నిర్వహిస్తోంది.

కొంత మంది వైజ్ఞానీకులు, వీటిని Cloud of Ions గా వర్ణిస్తారు. శరీర శాస్త్రవేత్తలు, ఈ ప్రాణ శక్తులనే, Bio-Plasmic Energy గా పిలుస్తారు.

ఈ ప్రాణశక్తి, అనేక దేశాలలో...అనేక రకాలుగా పిలువబడుతోంది. అయితే మనుజుల యొక్క, ఈ ఉన్నతమైన ప్రాణ శక్తి లో హెచ్చు భాగం, వ్యర్థమైన కార్యకలాపాలకు, చెడుపనులకు, దురాలోచనలకు ఖర్చైపోతూన్నది.

హఠయోగంలో, ప్రాణశక్తి మరియూ చిత్త శక్తులు....సమత్వంలో ఉంటే, ఈ రెండు రకాల శక్తుల సామరస్యం, ఆత్మశక్తి అనే తలుపును తెరుస్తాయి. ఈ శక్తుల సామరస్యం, ఉన్నత స్థాయి చైతన్యాన్ని అనుభవించేటపుడు, ఒక యోగిలో శక్తి స్థాయిలను పెంచుతాయి. ఈ శక్తుల అసమతౌల్యం...ఒక యోగిలో భౌతిక,మానసిక, భావాత్మక సమస్యలు సృష్టిస్తుంది. కాబట్టి "సమత్వం యోగ ఉచ్యతే".

ప్రాణ శక్తి అనేది పింగళా నాడితో అనుసంధానమై ఉంటే, చిత్త శక్తిని ఇడా నాడి ప్రతిఫలిస్తుంది.

ఈ శక్తిని సమత్వం చేయడానికి.... యోగాసనాలు, ప్రాణాయామము, ముద్రా ప్రాణాయామాలు, ముద్రా ధ్యానాలు, రక రకాల ధ్యాన పద్ధతులు, చక్రాలపై చెసే వివిధ ధ్యానాలు...ఇవన్నీ శక్తి సమం చేయడానికి ఉపయోగ పడతాయి.

ప్రాణ శక్తి, మరల 5 ప్రాణాలుగా విభజించబడింది అని చెప్పుకున్నాం కదా! వాటి గూర్చి రేఖా మాత్రంగా తెలుసుకుందాం.....

1. ప్రాణము : శ్వాస, ఆహారము...మొదలైన విషయాలను గ్రహించే శక్తిని ప్రాణము అంటారు. శరీరంలో బలాన్ని సంచరింప జేసేదానిని ప్రాణము అంటారు. శబ్దోచ్ఛారణ లోని స్పష్టత దీని ప్రభావమే. ఇది పసుపు రంగులో ఉంటుంది. గాఢమైన ధ్యానంలో, ఈ ప్రాణం యొక్క తత్వం అనుభవానికి వస్తుంది. ఈ ప్రాణం, అనాహత చక్రాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది.

2. అపానము : శరీరంలో మల, మూత్ర, చెమట, కఫం, రజస్సు, వీర్యము, ప్రసవము...మొదలైన వాటిని బయటికి నెట్టి వేయబడే క్రియలు అపాన శక్తి వలననే కలుగుతాయి. దీని స్థానము గుద స్థానము. ఇది నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. మూలాధార చక్రాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది.

వ్యానము : శరీరమంతా వ్యాపించి ఉన్నదాన్నే...వ్యానము అంటారు. రక్త సంచారము, ఉచ్ఛ్వాస-నిశ్వాసాలు, నాడుల ద్వారా ఈ వ్యానము శరీరం మొత్తాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనస్సు, శారీరక విధుల సంచాలనము దీని ద్వారా జరుగుతుంది. ఇది గులాబి రంగులో ఉంటుంది. దీని స్థానం, స్వాధిష్ఠానం.

ఉదానము : శరీరాన్ని నిలబెట్టి, నిటారుగా నిలబెట్టి, పడిపోకుండా చేసే శక్తిని ఉదానము అంటారు. నిద్రావస్థలోనూ, మరణానంతర విశ్రాంతి దీని పనే. ఇది వంకాయ రంగులో ఉంటుంది. ఇది విశుద్ధ చక్రానికి అనుసంధానించబడి ఉంటుంది.

సమానము : శరీరములోని రసాలను చక్కగా యథా స్థానాలకు తీసుకొని వెళ్ళి, పంపిణీ చేసే ప్రాణ శక్తి విశేషాన్ని, సమానము అంటారు. మనము తిన్న తరువాత వచ్చే, రసాల ఉత్పత్తి-వినియోగము, తద్వారా వచ్చే శక్తి పంపిణీ చేయడం....ఈ సమాన వాయువు పని. నాభి, దీని స్థానం. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మణిపూరక చక్ర సంబంధంగా ఉంటుంది.

సశేషం

సేకరణ

No comments:

Post a Comment