శాపగ్రస్తుడు
==========
(సామాజిక కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
రాత్రి పదకొండు అయి ఉంటుంది. కిటికీలోంచి తెల్లటి, చల్లటి వెన్నెల గది అంతా పరచుకుంది. మా గదిలో ఉన్న మిగతా నలుగురు, వాళ్ళ మంచాల మీద హాయిగా పడుకున్నారు, నేను తప్ప.
నిద్ర పట్టక మంచంమీద అటూఇటూ దొర్లుతున్నాను. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున నా కొడుకు, కోడలు నన్ను ఈ వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆ తరువాత వాళ్ళ వివరాలు ఏవీ నాకు తెలియలేదు. తెలుసుకోవాలని నేనూ ప్రయత్నం చేయలేదు.
నా భార్య మరణించిన ఓ ఏడాదికే నాకు ఇక్కడికి స్థాన చలనం. "భగవంతుడా నేనేం పాపం చేసాను? " కన్న కొడుకు ఉండి కూడా నాకు ఏమిటీ దుస్థితి ? అనుకున్నా, మనసులో. ఇదే ప్రశ్న గతంలో కూడా నాలుగు సార్లు వేసుకున్నాను.
మొదటిసారి వేసుకున్నది, పదవ తరగతి చదువుతున్న రోజుల్లో....
ఆ రోజు పరీక్షా ఫలితాలు వచ్చిన రోజు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న పెద్దన్నయ్య బయటనుండి రిజల్ట్స్ పడిన పేపర్ తెచ్చి,
"ఇదిగో ఈ సన్యాసి పరీక్ష తప్పాడు. ఇలా పరీక్ష తప్పడం మన ఇంటా వంటా లేదు" అంటూ బిగ్గరగా కేకలేయసాగాడు. ఆయనకు డిగ్రీ చదువుతున్న చిన్నన్నయ్య, ఇంటర్ చదువుతున్న అక్కలిద్ధరూ వంత పాడారు. కాసేపటికి అమ్మా నాన్నా కూడా వారితో శృతి కలిపారు. సాయంత్రానికి తెలిసింది, నేను తప్ప, మా క్లాసు పిల్లలందరూ ఉత్తీర్ణులయ్యారనీ. అదిగో ఆ రోజు రాత్రి మొదటి సారి అనుకున్నాను,
"భగవంతుడా నేనేం పాపం చేసాను" అని ?
ఇక రెండవ సారి, పెళ్లి అయిన తరువాత రోజుల్లో...
ఎంతో ఇష్టపడి రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాను. అయితే తన అంతస్తుకు, తన అందానికి నేను తగననుకుందేమో మరి, అప్పటినుంచి తన గయ్యాళి తనం నా మీద ప్రదర్శించేది. తనతో ఏ ఒక్క రోజూ కూడా నేను సుఖపడలేదు.
అదిగో అప్పుడు అనుకున్నాను,
మా అన్నయ్యలకు, మా బంధువులు అందరికీ అనుకూలవతులైన భార్యలను ఇచ్చావు.
"భగవంతుడా నేనేం పాపం చేసాను?" నాకు ఇలాంటి గయ్యాళీ భార్యను ఇచ్చావు అని.
ఇక మూడవసారి అనుకున్నది…
అప్రయోజకుడైన మా అబ్బాయి రాజు గురించి. మా పెళ్లి అయిన చాలా ఏళ్ల తర్వాత నాకు పుత్రోత్సాహం కలిగింది. వాడిని చాలా గారంగా పెంచింది నా భార్య రాజ్యం. దానితో వాడు మొండిగా తయారయ్యాడు. ఏ ఉద్యోగం లోనూ కుదురుగా లేడు. అదిగో అప్పుడు అనుకున్నాను, మా బంధువుల, స్నేహితుల పిల్లలు అందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, "భగవంతుడా నేనేం పాపం చేసాను?" నా కొడుకును ఇలా పుట్టించావని.
ఇక నాలుగో సారి,
మా అబ్బాయికి సంతానం కలగకపోవడం గురించి. పెళ్లి చేస్తే స్థిరపడతాడని వాడికి వివాహం జరిపించాము. అప్పటికే అనారోగ్యంతో ఉన్న మా ఆవిడ "ఒరే ఓ మనవడిని కనరా! హాయిగా చూసి కన్ను మూస్తా" అని కోరడంతో నేను కూడా అదే విషయం చెప్పాను. ఎంతకీ ఆ ప్రయత్నం ఫలించక పోయేసరికి అనుమానం వచ్చి కోడలితో సహా వాడిని తీసుకుని వెళ్లి అన్ని పరీక్షలు జరిపించా. తర్వాత తెలిసింది, భార్యాభర్తలు ఇరువురిలోనూ లోపముందనీ, సంతానయోగం లేదని.
అదిగో అప్పుడు అనుకున్నాను, అందరూ మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా ఆడుకుంటున్నారు, "భగవంతుడా నేనేం పాపం చేసాను?" నాకు ఆ ఆనందం లేకుండా చేసావని.
ఇలాంటి ఆలోచనలతో నిద్ర పట్టని నేను, ఆ రాత్రంతా జాగరమే చేసాను. అయితే, నా మనోవేదనను ప్రస్తుతం ఆశ్రమంలో సాయంత్రం పూట ప్రవచనాలు చెబుతున్న సదానంద స్వామికి వివరించి, పరిష్కారం సూచించమని అడగాలి అని నిశ్చయించుకున్న తరువాత, తెల్లవారు జామున ఎప్పుడో నిద్రలోకి జారుకున్నా.
మర్నాడు సాయంత్రం,
నా మనోవేదన అంతా విన్న స్వామీజీ,
"నాయనా! 'భగవంతుడా! నేనేం పాపం చేసాను?' అని సాక్షాత్తూ నువ్వే ఆయనను అడుగుతున్నావంటే, నీకు ఆ భగవంతుని మీద నమ్మకం ఉందనీ అందుకే ఆయననే ప్రశ్నించే స్థాయికి ఎదిగావని తెలుస్తోంది.
అయితే దేవుని సృష్టిలో ప్రతీ చర్యకూ ఓ ప్రతిచర్య ఉంటుంది. నాకు తెలిసి నువ్వు కేవలం ప్రతిచర్య మాత్రమే చెప్పావు. దానికి ముందు తప్పకుండా ఓ చర్య ఉండే ఉంటుంది. దాని గురించి ముందు శోధించు. తప్పకుండా సమాధానం దొరుకుతుంది. అంతకీ దొరక్కపోతే, నేను ఇంకా ఒక మాసం రోజులు ఇక్కడే ఉంటాను కదా! అప్పుడు పరిష్కారం సూచిస్తాను" అపరిష్కృతంగా ఇచ్చిన స్వామీజీ సమాధానంతో అన్యమనస్కంగా అక్కడ నుంచి కదిలాను.
ఆ రాత్రి నుంచి ప్రతీరోజూ గదిలో పడుకొని స్వామీజీ చెప్పిన దిశగా ఆలోచించసాగాను.
ముందుగా నేను పదవ తరగతి పరీక్ష తప్పడానికి కారణమైన చర్యలు ఏమిటా అని ఆలోచించసాగాను. కొంతసేపటికి దానికి నేను ఏడవ తరగతిలో చేసిన ఓ దుశ్చర్య కారణం అనిపించింది.
ఆ రోజు సైన్సు పరీక్ష. ఆ సబ్జెక్టు మీద అవగాహన లేక కొన్ని స్లిప్పులు పెట్టుకుని, పరీక్షకు హాజరయ్యాను. కాసేపటికి స్క్వాడ్ మేము ఉన్న హాలులోకి వచ్చింది. వెంటనే తేరుకున్న నేను ఆ స్లిప్పులు నా వెనుక బెంచి కిందకు తోసేసాను. యాదృచ్చికంగా అదే సమయానికి ఆ వెనుక బెంచి కుర్రాడు రాసిన సమాధానాలు ఆ స్లిప్పులతో సరిపోవడంతో, అతడు ఏం చెప్పినా వినకుండా, అధికారులు అతడిని డిబారు చేసారు. బహుశా అతడిని మోసం చేసిన ఫలితమే నా పదవ తరగతి పరీక్ష తప్పడం అనిపించింది.
ఇక రెండో సారి.... నా గయ్యాళి భార్య గురించి, దేముడిని ప్రశ్నించిన దానికి కూడా సమాధానం లభించింది.
మా మేనమామ కూతురు రాధ పుట్టగానే, మా పేర్లు కూడా కలవడంతో మా ఇరుకుటుంబాల వారూ ఏకపక్షంగా తీర్మానం చేసేసారు, తనే నా భార్య అని. అలాగే మేమిద్దరమూ కూడా నిజమైన భార్యాభర్తలే అనుకునేవారం, నాకు రాజ్యలక్ష్మి సంబంధం వచ్చేంతవరకూ! అందంగా ఉండడం, డబ్బున్న వారి అమ్మాయి కావడంతో నేను రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నాను, నా తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా.
ఈ సంఘటనతో అవమానం చెందిన మా మేనమామ సరిగ్గా అదే ముహూర్తానికి కట్నం లేకుండా ఓ రెండో పెళ్లి వాడికిచ్చి రాధ పెళ్లి జరిపించాడు. అయితే ఆ తర్వాత రెండేళ్ళకే అనారోగ్యంతో రాధ భర్త మరణించడంతో, పిల్లలు లేని ఆమె తెలిసిన వాళ్ల ఇళ్లల్లో వంటపని చేసుకుంటూ బతుకుతోంది అని తెలిసింది. బహుశా రాధకు నేను చేసిన ద్రోహం ఫలితంగానే నాకు ఇలా గయ్యాళీ భార్య దొరికిందన్న మాట అనుకున్నాను.
ఇంకో రెండు రోజుల తర్వాత ..... మా అబ్బాయి అప్రయోజకత్వం గురించిన నా మూడవ ప్రశ్నకు కారణం కూడా తెలిసింది.
నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో, కంపెనీ వారు నాకు ఓ సహాయకుడిని వేసుకొనే అవకాశం ఇచ్చారు. ఇంటర్వ్యూ చేసి అన్ని అర్హతలు ఉన్న వడ్డాది ధనరాజ్ అనే యువకుడిని సెలెక్ట్ చేసాను. కానీ, ఓ పదివేలు లంచం అడిగాను. తాను చెల్లించే స్థితిలో లేనని అతడు ఎంత మొత్తుకున్నా వినకుండా వేరే యువకుడి వద్ద లంచం తీసుకుని ఆ ఉద్యోగం ఇచ్చేసాను. బహుశా ఓ ప్రయోజకుడిని అన్యాయంగా తిరస్కరించిన ఫలితమే మా అబ్బాయి అప్రయోజకుడుగా మారడం అయ్యుంటుంది.
ఆ మరుసటి రోజు రాత్రి నాకు, నాల్గవ ప్రశ్నకు అదే, మా అబ్బాయికి పిల్లలు పుట్టకపోవడం గురించి కూడా కారణం తెలిసింది. నిజంగా అది చాలా ఘోరం, నేరం కూడా.
మా రాజ్యం నెల తప్పిందని తెలియగానే ఇద్దరమూ మాకు తెలిసిన వెల్ విష్ బేబీ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయిస్తే, కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిసింది. వెంటనే రాజ్యాన్ని ఒప్పించి, బాగా తెలిసిన డాక్టర్ ద్వారా రహస్యంగా అబార్షన్ చేయించా. నిజంగా ఆ అమ్మాయి పుట్టి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు. బహుశా ఆ శాపం ఫలితమే మా అబ్బాయి నిస్సంతుగా మారడం.
ఇక ఆఖరుది, ఐదవది అయిన నా వృద్ధాశ్రమ జీవితం గురించి కూడా నాకు సమాధానం దొరికింది.
నాన్న చనిపోగానే, మా తోబుట్టువులు ఐదుగురం అమ్మని వంతులు వేసుకుని చూడసాగాము. అయితే మా ఇంటి వాతావరణంలో అమ్మ ఇమడలేక పోవడంతో, మా వాళ్లను సంప్రదించి వృద్ధాశ్రమంలో చేర్పించాను.
అప్పుడు అమ్మ, "ఒరే నాకు ఐదుగురు సంతానం కాబట్టి వంతులు వేసుకుంటున్నారు. నీకు ఒకడే కొడుకు కాబట్టి, కంట్లో పెట్టుకు చూసుకుంటాడేమో?" అన్న మాటలు ఇంకా గుర్తు. అయితే అమ్మ మాటలు నిజం కాలేదు. నేను అమ్మకు చేసిన మర్యాదే నాకు నా కొడుకు చేసాడు.
నేను భగవంతుని అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడంతో, మర్నాడు సాయంత్రం స్వామీజీకి ఈ విషయాలు వివరించి, ప్రాయశ్చిత్తం చేసుకొనే మార్గం చెప్పమని వేడుకోవాలి అనుకుని, చాలా రోజులు తర్వాత ప్రశాంతంగా పడుకున్నా.
మర్నాడు సాయంత్రం స్వామీజీని కలిసి, ఈ పది రోజుల్లో నాకు జ్ఞాపకం వచ్చిన నా పాపాల జాబితా వారికి వివరించి,
"స్వామీ! మొన్న మీరు చెప్పినట్లు ఆలోచించగానే నేను చేసిన పాపాలే నాకు శాపాలుగా మారాయని అర్ధమయ్యింది స్వామి. మరి ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం ఏదైనా సూచించండి" అని అడిగాను.
దానికి వారు చిన్నగా నవ్వి,
"చూడు గోపాలం, దేవుని ప్రశ్నించే స్థాయి నుంచి, తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం అడిగే స్థాయి వరకూ వచ్చావు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఏమీ లేదు నాయనా! దైవాన్ని స్మరించుకుంటూ మనసు నిర్మలంగా ఉంచుకో. చెడు ఆలోచనలు మనసులోకి రానీయకు. మిగతాది ఆయనే చూసుకుంటాడు. అంతా మంచే జరుగుతుంది" అంటూ నన్ను ఆశీర్వదించి పంపారు.
మూడు వారాల తర్వాత.......
ఈ రోజుతో , ఆశ్రమంలో సదానంద స్వామీజీ వారి ప్రవచనాలు పూర్తవుతాయి. ఈ ఇరవై రోజుల్లో నాకు పూర్తి మనశ్శాంతి కల్గించేలా చేసిన స్వామిని ఈ సాయంత్రం ఓ సారి కలుసుకుని వారికి పాదాభివందనం చేయాలని నిశ్చయించుకున్నా.
అయితే మధ్యాహ్నం నా ఫోన్ లో ఒక తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఒక మెసేజ్ నన్ను ఆశ్చర్యంలో పడేసింది.
సాయంత్రం, స్వామీజీకి పాదాభివందనం చేసి, వారి బోధనలతో నేను పొందిన మనశ్శాంతి గురించి చెప్పి,
"స్వామీ, మీరు చెప్పినట్లే ఓ ఇరవై రోజుల్లోనే నిజంగా ఓ మంచి జరిగింది. మీరు వింటానంటే మధ్యాహ్నం వచ్చిన ఓ సందేశం మీకు చదివి వినిపిస్తాను" అని వారి అనుమతితో ఆ సందేశం చదవడం మొదలెట్టాను.
""నాన్నా ! నేను మీ అబ్బాయి రాజుని. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈ మెసేజ్ పంపుతున్నాను.
పిల్లలు లేరని నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో, కొడుకు ఉండి కూడా నువ్వు ఈ నాలుగు సంవత్సరాలలో అంత బాధ పడీ ఉంటావని నాకు అర్ధమయ్యింది. అందుకే నిన్ను ఆ బాధ నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నా.
ఇక అసలు విషయానికి వస్తే,
నాన్నా ! నువ్వు త్వరలో తాతవి కాబోతున్నావు. ఔను!... నేను పుట్టిన వెల్ విష్ బేబీ ఆసుపత్రి వాళ్ళ అబ్బాయి ఈ మధ్యనే విదేశాల్లో వైద్య విద్య నేర్చుకుని వచ్చాడు. ఆయన మా ఇద్దరికీ కొన్ని పరీక్షలు చేసి సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పాడు. ఆయన వైద్యం ఫలించింది. ఇప్పుడు మీ కోడలికి ఐదవ నెల.
కానీ, విశ్రాంతి అవసరం అని చెప్పడంతో, సహాయం కోసం పెద్ధత్తయ్య సలహాతో మీ మేనమామ కూతురు, అదే మన రాధ పిన్నిని అడిగాను. నీకు, మీ కోడలికి, పుట్టబోయే బిడ్డకు కూడా సపర్యలు చేయడానికి ఆమె సంతోషంగా ఒప్పుకుంది. త్వరలో వస్తానంది.
నీకు ఇంకో శుభవార్త.
నాకు బేంక్ లో ఉద్యోగం వచ్చింది. త్వరలో ఆర్డర్ వస్తుంది. నిజం నాన్నా! నాకు ఈ మధ్యనే ధనరాజ్ అనే ఆయన పరిచయం అయ్యారు. ఆయన గతంలో, ఏదో కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి, అక్కడి అధికారికి లంచం ఇవ్వలేక ఆ ఉద్యోగం పోగుట్టుకున్నాడుట. ఆ తరువాత ఉద్యోగ ప్రయత్నాలు మాని, 'వడ్డాది కన్సల్టెన్సీ' పెట్టి, బేంక్ టెస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆయన శిక్షణ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది.
నా భావోద్వేగాలు నోటితో చెప్పలేక ఇలా మెసేజ్ పెట్టాను.
రేపు ఉదయం రెడీగా ఉండు. నేను వచ్చి తీసుకుని వెళ్తాను.
క్షమాపణలు కోరుతూ
ప్రయోజకుడైన
మీ అబ్బాయి రాజు.""
మెసేజ్ చదవడం పూర్తి అవ్వగానే,
"చూసావా గోపాలం! దేవుని లీలలు. అంతా నాటకీయంగా ఉంది కదూ? నీ పశ్చాత్తాపం మెచ్చి, భగవంతుడు నిన్ను ఎలా అనుగ్రహించాడో ఇప్పటికైనా అర్థమయ్యిందా? నీ ప్రశ్నలు అన్నింటికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు ఆ దేవుడు. మరింకేం తిరిగి నూతన జీవితం ప్రారంభించు" అని ఆశీర్వదించారు స్వామీజీ.
"స్వామీజీ ! కానీ, ఓ చిన్న సందేహం ఉండిపోయింది. నా వలన మోసపోయిన ఆ ఏడవ తరగతి......" అని నేను సందేహం వ్యక్తం చేయబోయేంతలో
"దానికీ సమాధానం దొరుకుతుంది గోపాలం! హాయిగా ఇంటికి వెళ్లు" అంటూ తన శిష్యుని వైపు చూస్తూ నవ్వుతూ వెళ్లారు స్వామీజీ.
నాకు ఏమీ అర్ధం కాక , వారి శిష్యుని వైపు తిరిగి,
"చిన్న స్వామీ! పెద్ద స్వామి నవ్వుకు అర్ధం ఏమిటి?" అడిగాను ఆశ్చర్యంగా.
"గోపాలం! నీ వలన మోసపోయిన ఆ ఏడవ తరగతి విద్యార్ధి ఆనంద్ ఎవరో కాదు. ఈ సదానంద స్వామీజీ యే! నీవలనే కాదు చాలా మంది చేతుల్లో మోసపోయిన ఆయన నీలా భగవంతుని ప్రశ్నించలేదు. తనని తాను ప్రశ్నించుకుని ఇలా ఆధ్యాత్మిక ధోరణిలో పడి, ఈ స్థితికి వచ్చారు" ఆయన చెబుతున్నది విని నోరు వెళ్లబెట్టిన నాతో,
"ఔనూ! ఈ ఇరవై రోజుల్లో నువ్వు భగవంతుని ఏం వేడుకున్నావు?" అడిగారు చిన్న స్వామి.
" భగవంతుడా నేనే పాపం చేసాను , నన్ను క్షమించమని వేడుకున్నాను" అని చిన్న స్వామికి చెప్పి, వారికి నమస్కారం చేసి వెనుతిరిగాను,
ఎక్కడనుంచో
'దీనుల కాపాడుటకు దేముడే ఉన్నాడు
దేముని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు'
అనే పాట మంద్రస్థాయిలో వినిపిస్తుండగా!
శుభం *
(నేను రాసిన ఈ కథ, ఫిబ్రవరి 2022
"సాహో" మాసపత్రికలో ప్రచురితమైనది)
సేకరణ
No comments:
Post a Comment