Monday, February 7, 2022

మనశ్శాంతి

మనశ్శాంతి

ఒకసారి బుద్ధ భగవానుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. దారి మధ్యలో ఒక శిష్యుడిని పిలిచి "నాయనా! దాహంగా ఉంది. ఆ కనబడే చెరువు నుండి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు.

అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారు అయింది. శిష్యుడు ఆ నీరు తేరుకొనేంత వరకు అలాగే కూర్చున్నాడు. ఒక గంట తర్వాత బురద అడుగుకు చేరి, పైకి స్వచ్ఛమైన నీరు తేరుకున్నాయి. ఆ నీరు తీసుకెళ్ళి బుద్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.

బుద్ధుడు నీటిని తాగాక శిష్యుడు "భగవాన్! ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది?" అని ప్రశ్నించాడు.

అప్పుడు బుద్ధుడు "నువ్వు కాసేపు చెరువును దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అప్పుడు నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్ఛమైన నీరు పైకి తేరుకుంది. మన మనసు కూడా అంతే! ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలివేయాలి. కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్ఛంగా మారుతుంది. నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నం చేయవలసిన పనిలేదు. కొంతసేపు అలా వదిలేస్తే, అంటే ఏ ఆలోచనలు లేకుండా వదిలేస్తే దానంతట అదే సద్దుమణుగుతుంది, చక్కబడుతుంది. తద్వారా నీకు మనశ్శాంతి లభిస్తుంది" అని వివరించాడు.

శుభమ్

సేకరణ

No comments:

Post a Comment