Tuesday, March 1, 2022

కోపం - ఖాళీ పడవ

*కోపం - ఖాళీ పడవ🙏

ఒక సన్యాసి ఒంటరిగా, అందరికి దూరంగా, ప్రశాంతంగా ధ్యానం చేయాలని నిర్ణయించుకుంటాడు. తన మఠానికి దూరంగా, అతను ఒక పడవను తీసుకొని ఒక సరస్సు మధ్యలోకి వెళ్లి, కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. కొన్ని గంటల నిశ్శబ్దం తరువాత, అకస్మాత్తుగా ఇంకొక పడవ వచ్చి అతను కూర్చున్న పడవను దభేల్ మని ఢీ కొట్టింది.

ధ్యానంలోంచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సన్యాసి. అజాగ్రత్తగా పడవని నడిపి తన ధ్యానానికి భంగం కలిగించిన పడవవ్యక్తిపై పట్టరాని కోపంతో అరవడానికి సిద్ధం అయ్యాడు సన్యాసి.
కానీ ఎంత చూసినా పడవ నడిపే వ్యక్తి కనపడలేదు. అది ఖాళీ పడవ. సరిగా కట్టబడక, గాలికి సరస్సు మధ్యలో తేలుతూ వచ్చి సన్యాసి ధ్యానం చేస్తున్న పడవను ఢీకొట్టింది.

ఆ విషయం గ్రహించిన మరు క్షణంలో సన్యాసికి ఆత్మసాక్షాత్కారం కలిగింది. కోపం అనేది ఎక్కడో కాదు తనలోనే ఉందని అర్థం చేసుకున్నాడు.
దాన్ని నిద్రలేపి, రెచ్చగొట్టి, విచక్షణాజ్ఞానం కోల్పోయే
క్రోధావేశాలు రావడానికి ఒక ఖాళీ పడవ చాలు అని గ్రహించాడు - ఆ సన్యాసికి జ్ఞానోదయమైంది.

ఆ తరువాత, ఆ సన్యాసి గౌతమ బుద్ధుని మరపించేటంత శాంతస్వరూపుడయ్యాడు. తన కోపాన్ని చికాకు పరిచే విషయం లేదా రెచ్చగొట్టే వ్యక్తిని కలిసినప్పుడల్లా, అతను తలచుకునేది ఒకటే! అవతలి వ్యక్తి కేవలం ఖాళీ పడవ.
కోపం నా లోపలే ఉంది."🕉️🚩🕉️

సేకరణ

No comments:

Post a Comment