Friday, March 25, 2022

నేటి మాట - భగవత్ చింతన, ఇప్పుడే చేయాలా???

🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏

🥀 శుభోదయం 🥀

🌷 నేటిమంచిమాట 🌷

ఏదో ఒక ఆదర్శాన్ని కలిగివున్న వ్యక్తి 10 పొరపాట్లు చేస్తే, ఏ ఆదర్శమూ లేనివాడు 100 పొరపాట్లు చేస్తాడు. కాబట్టి,కనీసం ఒక ఆదర్శాన్నైనా కలిగివుండడం మంచిది.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

నేటి మాట

భగవత్ చింతన, ఇప్పుడే చేయాలా???
ఈ రోజుల్లో, ఎలా ఉన్నారంటే, సినిమా, టీవీలు, సీరియళ్లు అంటే అందరికీ టైం దొరుకుతుంది కానీ ఆధ్యాత్మిక కార్యక్రమములు అంటే, అయ్యో టైం లేదని వాపోతుంటారు...

శ్లో॥ చింతా మపరి మేయాంచ ప్రళయాం తా ముపాశ్రితాః ।కామోప భోగ పరమాః ఏతావదితి నిశ్చితాః ॥

తా॥ చనిపోయేంతవరకు అంతులేని కోరికలలో మునిగితేలుతూ, కామభోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం ఏదీలేదని నిశ్చయించుకుంటారు...

ప్రళయాంతాం అపరిమేయాం చింతాం ఉపాశ్రితాః...

చచ్చేంత వరకు అంతులేని కోరికలలో మునిగి తేలుతూ ఉంటారు.
కట్టు విప్పుకొన్న గొడ్డు ముందూ వెనకలు చూడకుండా ఎలా పడితే అలా పరుగులు తీస్తుంది... ఎవరో ఒకరు దానిని హింసించి అదుపులోకి తీసుకొనే దాకా అది ఆగదు... ఊపిరి ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు అలా పరుగులు తీస్తూనే ఉంటుంది... తెగిన గాలిపటం గాలి ఎటు వీస్తే అటు కదిలిపోతుంది... అది ఎక్కడో ఒక చోట, చెట్టు కొమ్మల మధ్య చిక్కుకొనే దాకా ఎగురుతూనే ఉంటుంది...

అలాగే...
అసుర స్వభావి భగవంతునిపై విశ్వాసం లేనివాడు గనుక వాడికెప్పుడూ విషయచింతనే, చిన్న వ్యాపారం ప్రారంభిస్తాడు, కలిసొస్తే ఇంకా పెద్దది, ఇంకా పెద్దది అని పెంచుకుంటూ పోతాడు...
ఇళ్ళు కొంటాడు, స్థలాలు కొంటాడు, పరిశ్రమలు స్థాపిస్తాడు, సినిమాహాళ్ళు కట్టిస్తాడు, ఆశ తీరదు, కాలేజీలు కట్టించి విద్యా వ్యాపారం బాగుందనుకుంటాడు... హాస్పిటల్స్ కట్టించి పెద్ద పెద్ద డాక్టర్లను రప్పించి వైద్య వ్యాపారం ప్రారంభిస్తాడు...
ఇక ఇక్కడ లాభం లేదని విదేశాలకు వెళతాడు, నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు...

శరీరం, మనస్సు, బుద్ధి... అన్నీ విషయ చింతనలోనే, భార్యకు సుఖంలేక పోయినా, కొడుకులు చెప్పిన మాట వినకపోయినా, బంధువులు శతృవులుగా మారినా ఆ జీవుడు ఆశల పల్లకిలో ఊరేగుతూనే ఉంటాడు.
తనంతట తాను మారడు, ఎప్పుడో భగవంతుడే దయ తలచి ఏ విమాన ప్రమాదంతోనో, హార్ట్ ఎటాక్ తోనో అతణ్ణి బంధ విముక్తుణ్ణి చెయ్యక పోతే అతడికీ గాడిద చాకిరీ తప్పదు...
ప్రకృతి వేసిన శిక్షను అనుభవించక తప్పదు, ఒక వేళ ఆరోగ్యం చెడినా, కాలోచెయ్యో విరిగినా, మంచంలో పడి ఉన్నా మనస్సు మాత్రం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.
కోరికల వేడితో విషయ చింతన అనే అగ్నిలో కాలిపోతుంటాడు...

బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః ।
వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోఽపినసక్తః॥

బాల్యం ఆట పాటలతో.. యవ్వనం కామ ప్రేరిత చర్యలతో.. వృద్ధాప్యం చింతలతో.. గడిచిపోతే పరమాత్మను తలచుకొనేది ఎప్పుడు...
ఒంటిలో శక్తి వున్నప్పుడే, మనసులో ఖాళీ వున్నప్పుడే, నాలుకపై నరం కదులుతున్నప్పుడే, భగవత్ చింతన సలుపుతూనే వుండాలి...
సర్వాంతర్యామి అయిన ఆయనను మరువకున్నప్పుడే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది... మోక్షం ప్రాప్తిస్తుంది...

🌹 శుభమస్తు🌹
🙏 సమస్త లోకా సుఖినోవంతు🙏

సేకరణ

No comments:

Post a Comment