Monday, March 21, 2022

కవిత: నా నుంచి...నా వరకు!

నా నుంచి...నా వరకు!
----------------------------------
నువ్వేదీ ఆలపించకుండానే
నే పరవశిస్తానే--
అదీ ప్రణయ మాధుర్యం!
నువ్వు నిశీధిలో సైతం నాకు
దృగ్గోచరమవుతావే---
అదీ నీ దర్శన భాగ్యం!!
కడలి తీరాల్లో
నీ పాదముద్రలు వెతుకుతూ,
నేను అలసిపోతాను!
ఇసుకగూళ్లలో మన స్వప్నసౌధాలు
అగుపిస్తాయి!
సెలయేటి జాలులో
నీ చిరునవ్వులు కనిపిస్తాయి--
తళుక్కున నీ పలువరుస మెరుపులా!
సాయం సంజెలో
ఎరుపెక్కిన నీ అధరాల వర్ణం శోభిస్తుంది!
అంతెందుకు,
ఈ పూవనాలలో,
నీ పరిమళం నన్ను చుట్టివేస్తుంది సుమా!
నేను మధుశాలలో వినిపించే కావ్యపంక్తుల సౌందర్యం---
అంతా నీ మధుర జ్ఞాపకాలే కదా సఖీ!!
నేను సంచరించిన ప్రదేశాలలో,
నేను సముద్రయానం చేస్తూ సందర్శించిన దేశదేశాలలో,
అపురూపమైన దృశ్యాల కన్నా,
నువు నాకు అద్భుతంగా గోచరిస్తావు!
మేలిమి సంగీతకారుల వాద్యాలలో సైతం,
నీ కంఠస్వరం నాకు వినిపిస్తూంటుంది!
నిన్నలా వెతుకుతూ తిరుగాడే నా చూపులకు,
నీ అలౌకిక సౌందర్యం అవగతమవుతుంది!!
నీకై తపించే నా మనమునకు,
ఉల్లాసమూ లేదు,విచారమూ లేదు!!
దైవ ప్రార్ధనలోని తన్మయత్వం తప్ప!!
అసలు నాకంటూ ఎవరూ లేరు!
నా స్వాప్నిక జగత్తులో
నాతో మమేకమై నేను తప్ప!!
నా నుంచి నా వరకు ప్రయాణమే నీవు కదా?
నన్ను నాకు చూపు దర్పణమే నీవు కదా!!
---- దండమూడి శ్రీచరణ్
9866188266

సేకరణ

No comments:

Post a Comment