Thursday, March 24, 2022

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.

ఎన్ని వైపుల నుంచి ఎన్ని నదీజలాలు సముద్రంలోకి ప్రవహించినా విశాల సముద్రం అలజడికి లోను కాదు. అదేవిధంగా అన్నిరకాల ప్రాపంచిక సుఖభోగాలు స్థితప్రజ్ఞుడిలో ప్రవేశించినా ఎలాంటి వికారాన్ని అతడు పొందలేడు. పైగా అవన్నీ అతనిలో లీనమైపోతాయి. అటువంటి వాడే శాంతిని పొందుతాడు. భోగలాలసుడు కాడు’ అంటూ కృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన బోధను అనుసరించి స్థిరచిత్తం కలిగిన స్థితప్రజ్ఞుడిని ఏ కోరికలు చలింపజేయవన్న సత్యం బోధపడుతుంది. సంయమనమే శాంతిని ప్రసాదించే మార్గం. కాబట్టి ఎవరైనా శాంతిని కోరుకున్న వ్యక్తి విధిగా సంయమనాన్ని సాధించాలన్నది భగవదాశయం. ఇది మన జీవితాలకు ఒక పరిపూర్ణతను ఇస్తుందన్నది కాదనరాని సత్యం.
ఆత్మజ్ఞానం సంయమనాన్ని సులభతరం చేస్తుంది. తనను తాను నియంత్రించుకొని, ఇంద్రియాల ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మోద్ధరణ చేసుకున్న వ్యక్తిలో సంయమన గుణం వృద్ధి చెంది అతడొక స్థితప్రజ్ఞత కల సంయమిగా వెలుగగలడు. అందుకే స్వామి సంయమిని సముద్రంతో పోల్చాడు. ఎన్ని నదులు తనను చేరినా సముద్రం హద్దు మీరదు. అది గంభీర వారాశిగానే మిగులుతుంది. దాని లోతు అంత సులభంగా తెలుసుకోలేం. సంయమి గుండె లోతులను కూడా గ్రహించడం సులభమేమీ కాదు. ఏ కోరికలు తనను లొంగదీసుకోలేవు. విషయ వాంఛలేవీ అతనిని బంధించలేవు. అతని హృదయం జ్ఞాన మార్గంలోనే పయనిస్తుంది తప్ప మరొక దారిలోకి మళ్లిపోదు. ఈ సత్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు.. అర్జునుడికి వివరించిన తీరు అసదృశం.
ఈ బోధనలను బట్టే జ్ఞాని అయినవాడు సముద్రపు వలె ఎటువంటి చలనం లేక స్థిరంగా నిలుస్తాడు. అజ్ఞాని సముద్రం అలల వంటివాడు. ఎగిసి ఎగిసి పడుతుంటాడు. చలనచిత్తుడై ప్రవర్తిస్తుంటాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన సముద్రం పోలిక విశిష్టమైనది. సాగరాన్ని సమీపించే నదీజలాలు వివిధ వర్ణభేదాలతో, రుచి భేదాలతో ఉంటాయి. వర్షం వల్ల ఏర్పడే వాగులు, వంకల వంటి వాటి లక్షణాలు వేరే ఉంటాయి. అన్నింటిలో ఉండే ఒకేఒక సమాన గుణం ప్రవాహశీలత. సముద్రుడు తానుసైతం ప్రవాహశీలత కలిగినవాడు, తనలోను జలతత్వమే ఉంది కనుక, వాటన్నిటినీ స్వీకరించి, ఏ మాత్రం పొంగిపోకుండా స్థిరచిత్తుడై గంభీరంగా ఉంటాడు. వ్యక్తిలో కోరికలు పరుగులెత్తినా వాటన్నింటినీ అధిగమించి వాటిని తనలో కలుపుకొని స్థిరచిత్తుడిగా నిలబడి ఉన్నప్పుడే అతడు స్థితప్రజ్ఞుడై శాంతిని పొందగలడు. అంటే స్థితప్రజ్ఞుడు సాగర సదృశుడు కావాలి. అనేక భోగభాగ్యాలు అందుబాటులో ఉండవచ్చు. కానీ, వాటియందు మాత్రమే తన మనసును నిలపరాదు. నిమిత్త మాత్రుడిగానే వాటిని అనుభవించాలన్నది భగవద్గీత బోధించే శాశ్వత తత్వం.
ఇన్ని ప్రవాహాలు తనలో కలవడం వల్ల సాగరానికి ఎంత పూర్ణత్వం ఒనగూడినా, దాని గొప్పదనానికి మాత్రం స్థిరత్వమే ప్రధాన హేతువు. మానవుడికి ఎన్ని కోరికలున్నా వాటికి కట్టుబడక, అవే జీవిత పరమార్థాలుగా భావించక జీవించేవాడే సాగర సదృశచిత్తుడు. అతడే సాటిలేని స్థితప్రజ్ఞుడు. ఆనందాలు ప్రవాహాలై తనను చేరవచ్చు. అయినా తానుమాత్రం అశాశ్వతమైన ఈ ఆనందాలకు లొంగకుండా పూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగలగాలి. ఒక మహాసాగరం వలె అన్నింటినీ తనలో కలుపుకొని గంభీరంగా జీవించినప్పుడు జీవితం చరితార్థమై కర్తవ్య నిర్వహణలో లక్ష్యం చేరుకోగలిగే ఉత్తమ సాధకుడై నిలబడతాడు. అపురూపమైన శాంతిని అందుకోగలుగుతాడు. ఇది శాశ్వత సత్యం.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment