Monday, March 21, 2022

ఎంతో అద్భుతమైన జీవిత సత్యం. క్షమాగుణం ఎంతటి ఔన్నత్యం కలిగిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

ఎంతో అద్భుతమైన జీవిత సత్యం. తప్పకుండా చదవండి.

♻️ ఓ రోజు ఎక్కడి నుంచో ఓ మనిషి వచ్చి బుద్ధుడి మోహం మీద కాండ్రించి ఉమ్మేశాడు. దాంతో బుద్ధుడి శిష్యులందరూ ఆవేశాలతో రేగిపోయారు. బుద్ధుడి అనుంగు శిష్యుడు ఆనందుడు ఆ వ్యక్తిని " ఇంత సులకనా నీకు ?" అని కసురుకున్నాడు. ఆనందుడు ఆగ్రహంతో మండిపోతూ బుద్ధుడి వైపు తిరిగి "స్వామీ ! మీరు ఆజ్ఞా ఇవ్వండి; వీడు చేసిన పనేమిటో వీడికి అర్థమయ్యేలా చూస్తాను !" అన్నాడు.

❇️ బుద్ధుడు తన ముఖం మీద ఎంగిలిని తుడిచేసుకుని ఆ మనిషితో "మీకు కృతజ్ఞుణ్ణి స్వామి ! నాకు కోపం వస్తుందో రాదో తెలుసుకునే అపూర్వ అవకాశాన్ని మీరు కల్పించారు. నాకు కోపం రావడం లేదు. ఎంతో సంతోషం కూడా కలుగుతోంది. మా ఆనందుడికి కూడా మరో అవకాశాన్ని సృష్టించారు. అందువల్ల ఇంకా కోపం రాగలిగే స్థితి తనకు ఉన్నట్లు ఆనందుడు కూడా నిరూపించుకోగలిగాడు. మీకు మా కృతజ్ఞతలు. మేం కృతార్థులమయ్యాం ! దయచేసి మీరు అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తూ ఉండండి. ఎవరి మీదయినా ఉమ్మేయాలని మీకు అనిపించినప్పుడల్లా మా వద్దకే వస్తూ ఉండండి " -- అన్నాడు.

♻️ ఆ మనిషి ఆ మాటలను భరించలేకపోయాడు. తన చెవులను తానే నమ్మలేకపౌయాడు. ఏం జరుగుతుందో అతడికి అర్థం కావడం లేదు. బుద్ధుడికి కోపం తెప్పించగలనని అతడు అనుకున్నాడు. కానీ తానే విఫలుడయ్యాడు ఆ రాత్రంతా అతడికి నిద్ర పట్టలేదు. ప్రక్కలో అటూ ఇటూ పొర్లుతూనే ఉన్నాడు. కానీ కంటి మీదికి ఒక్క కునుకు కూడా రాలేదు. ఆలోచనలు దెయ్యాల్లా అతడీని పీడించాయి -- బుద్ధుడి మీద తాను ఉమ్మేయడం ఎంతో అవమానించే చర్యే అయినా బుద్ధుడు ఏ తొట్రుబాటూ కలతా చెందకుండా ప్రశాంతంగానే ఉండడమూ, ఏమీ జరగనట్లే సౌమ్యంగానే ఉండడమూ, తన మోహం మీద ఎంగిలిని సంతోషంగానే తుడిచేసుకోవడమూ, " మీకు కృతజ్ఞుడిని స్వామీ ! ఎవరి మీదయినా ఉమ్మేయాలని అనిపించినప్పుడల్లా మా వద్దకే వస్తూ ఉండండి" అనడం--

❇️ ఈ మాటలే మళ్ళీ మళ్ళీ అతడికి గుర్తుకువస్తున్నాయి. ఆ బుద్ధుడి వదనం, ఆ ప్రశాంత వదనం, కరుణ తొణికిసలాడే ఆయన కళ్ళే అతడికి మళ్ళీ మళ్ళీ కనిపించసాగాయి. ఆయన తనకు చెప్పిన కృతజ్ఞతలు మాటవరస కోసం చెప్పినట్లు అనిపించడం లేదు. నిజంగానే ఆయన మాటల్లో కృతజ్ఞత స్పష్టంగా వినిపిస్తోంది. ఆయన వ్యక్తిత్వం మొత్తం ఆ కృతజ్ఞతలను ప్రకటిస్తోంది. ఆయన ప్రవృత్తి మొత్తమూ కృతజ్ఞతతోనే నిండి ఉంది. స్పష్టంగా గోచరమవుతూ ఉంది. మరో ప్రక్క ఆనందుడి ఆగ్రహాగ్ని కూడా ఎర్రగా చెలరేగుతూ దర్శనమిస్తోంది. ఆనందుడిలో వేడి జ్వాల సెగలు, ఆ ప్రక్కనే బుద్ధుడి చల్లని ప్రశాంతత్వం, ప్రేమ తత్వం, కరుణాంతరంగం, అనుభవాల్లోకి వస్తోంది. ఆ వ్యక్తి తనను తానే క్షమించుకోలేని స్థితికి చేరుకున్నాడు. తను చేసిన పనేమిటో ? ఆయన మీదా ఉమ్మేయడం ? -- అంతటి మహానీయుని మీదా ?!

♻️ తెల్లవారగానే ఆ వ్యక్తి బుద్ధుడి వద్దకు పరుగెత్తుకొచ్చాడు. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు, " నన్ను క్షమించానని ఒక్కసారి చెప్పండి స్వామీ ! రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు ! అన్నాడు.

❇️ బుద్ధుడు ఇలా అన్నాడు -- "దాని సంగతి ఇక మరిచిపో. ఎప్పుడో జరిగిపోయిన దానికోసం క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు. ఎంతో గంగా ప్రవాహం వెళ్లిపోయింది !" -- బుద్ధుడు గంగానదీ తీరంలోనే ఓ వృక్షం క్రింద కూర్చుని ఉన్నాడు. ఆ మనిషికి బుద్ధుడు గంగానది వైపు చూపించాడు "చూడు ప్రతిక్షణమూ ఎన్నో నీళ్ళు వెళ్లిపోతూనే ఉన్నాయి. ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి, ఇంకా దాన్నెందుకు మోస్తున్నావు ? సృష్టిలో ప్రస్తుతం లేని దాన్ని గురించి ఆలోచన ఎందుకు ? ఇక ఆ సంగతి మరిచిపో."

♻️ " నేను నిన్ను 'క్షమించ'లేను ! ఎందుకంటే నాకు నీ మీద కోపం ఎప్పుడూ కలగలేదు గునుక ! నాకు కోపం వచ్చి ఉంటే అప్పుడే నేను క్షమించగలుగుతాను. నీకు నిజంగా క్షమాపణలు అవసరం ఉంటే ఆనందుడిని అడుగు. అతడి కాళ్ళ మీద పడు -- అతడెంతో ఆనందిస్తాడు. "

క్షమాగుణం ఎంతటి ఔన్నత్యం కలిగిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment