Thursday, April 28, 2022

సిరి బాల్యం🌹బాల్యంలో మనం విన్న పెద్దల మాటలు🌹

---------సిరి బాల్యం--------🌹బాల్యంలో మనం విన్న పెద్దల మాటలు🌹

నిన్న మధ్యాహ్నం భోజనం చేస్తుంటే పొలమారింది. నెత్తి మీద కొట్టుకుని మంచినీళ్లు తాగుతుంటే "ఎవరో తలుచుకుంటు న్నట్లున్నారు. బహుశా పెద్ద మనవడేమో?" అంది మా ఆవిడ.

"అయ్యుండొచ్చు" అన్నాను నేను కాస్త నిమ్మళించాక.

అన్నం తిని సోఫాలో కూచోగానే, చిన్నప్పటి మా ఇంటి భోజనాల సీను జ్ఞాపకం వచ్చింది. 'ఇప్పటిలా టేబుల్స్ లేవు గదా, ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం బావి దగ్గిరకు వెళ్లి కాళ్ళూచేతులు శుభ్రంగా కడుక్కున్నాకే, నేల పీటల మీద బాసింపట్టు వేసుకుని కూచుని భోంచేసేవాళ్ళం'.

వంటకన్నీ ఇత్తడి గిన్నెలే ఉండేవి ఎక్కువగా. కంచాలు,గ్లాసులు మాత్రం స్టీలువి ఉండేవి. మంచినీళ్ళు తాగే చెంబులు కంచువి కూడా ఉండేవి. చాలా పాత్రల మీద ఎంతో గుండ్రంగా తెలుగు అక్షరాలతో పేర్లు చెక్కి ఉండేవి. కట్టె పొయ్యల మీదే వంటంతా...

అమ్మ పక్కనే కూచుని వడ్డిస్తూ ఉండేది. "ఇంకొంచెం కలుపుకో, నెయ్యి వేసుకున్నావా" అంటూ అందరినీ కనుక్కుంటూ వడ్డించేది.

ఒకవేళ భోంచేస్తున్నప్పుడు ఎవరికైనా పొలమారితే గానీ, పచ్చడి కారానికి ఎక్కిళ్ళు వస్తేగాని, పక్కనే కూచున్న అమ్మ కొన్ని నీళ్లు తీసుకుని వారి నెత్తి మీద జల్లి "నీ పేరేంటి, ఏ ఊళ్ళో పుట్టావు చెప్పు?" అని అడిగేది.

నేను అయితే అడవిపాలెం అని, మా అక్కయితే కాకినాడ అని చెప్పేవాళ్ళం. కాస్త స్థిమిత పడ్డాక నా పేరుకి, ఊరు పేరుకీ, ఎక్కిళ్ళకి ఏమి సంబంధం అని ఆడిగితే, "ఏమో తెలీదు గానీ నీకు ఎక్కిళ్ళు పోయాయా లేదా" అని తిరిగి ప్రశ్న వేసేది అమ్మ. నిజంగానే గమ్మత్తుగా ఎక్కిళ్ళు ఆగిపోయేవి.

ఇలాగే ఇంకో కిటుకు ఉండేది అమ్మ దగ్గిర. "మీ ఫ్రెండ్ రాము గాడి సైకిల్ పోయిందిట గదా" అనో "పక్కింటి పిన్నిగారు ఇంట్లో బిందె ఎవరో ఎత్తుకుపోయారుట" అంటూ ఏవో వింత వార్తలు చెప్పేది.

"నిజమా??" అంటూ మన దృష్టి అటు వెళ్ళేది. ఈ లోపల ఎక్కిళ్ళు, పొలమారడం తగ్గిపోయేవి ఆశ్చర్యంగా.

అమ్మ నవ్వేసి " ఊరికే...నీ దృష్టి మళ్ళిద్దామని" అనేది నవ్వుతూ

అలాగే "అన్నం తినేటప్పుడు అస్సలు మాట్లాడవద్దు" అనేవారు పెద్దలు. మాట్లాడుతూ తింటే అన్నం వంటికి పట్టదుట.

"అన్నం తింటూ మధ్యలో కంచం దగ్గిరనుంచి లేవకూడదు" అనేవారు.

కంచంలో ఏమీ వదిలేయకుండా తినాలి, వృధా చేయకూడదు, కంచంలో చేయి కడగకూడదు అని చిన్నప్పటినుంచే తెలుసుకున్న తరం మనది.

మనతో కూచున్న అందరూ అన్నం తినడం అయ్యాకే లేచి చేయి కడుక్కునేవాళ్ళం.

అమ్మ మాత్రం అందరం తిన్నాక, నాన్నగారు తిన్న పళ్ళెంలోనే తానూ అన్నం తినేది.

రాత్రిపూట "ఉప్పు" అని అడిగేవారు కాదు పెద్దవాళ్ళు. ఎందులోనైన ఉప్పు తగ్గినా, మజ్జిగలోకి కావలసి వచ్చినా, "కాస్త చవి చూపించు" అనేవారు. కంచములో ఒక పక్కకి వేసేవారు గానీ చేతిలో వేసేవారు కాదు.

అలాగే ఆదివారం రోజూ, మళ్లీ ప్రతిరోజూ రాత్రి పూట ఉసిరికాయ పచ్చడి నిషేధం. తినకూడదు అనేవారు.

వడియాలు పెట్టాలంటే ఆ బూడిద గుమ్మడికాయ మీద మగవాళ్ల చేతికి కత్తి ఇచ్చి ఒక చిన్న గాటు పెట్టించిన తరవాత ఆ కాయని ముక్కలు చేసేది అమ్మ

చీకటి పడితే చెట్టు మీద చేయి వేయవద్దు అనేవారు. పూలు గానీ, పళ్ళు గానీ, కరివేపాకు గానీ సూర్యాస్తమయం ముందే కోయాలి అనేవారు.

పసిపిల్లలు ఉయ్యాలలో లేనప్పుడు ఖాళీ ఉయ్యాలని ఊపవద్దు అనేవారు. అమ్మాయికి పుట్టిన పిల్లలకి నామకరణం చేసిన తర్వాత మూడో నెలలోనో, ఐదో నెలలోనో వారి నాయనమ్మగారి ఇంటికి సారె పెట్టి మనవళ్లను పంపిస్తు, ఉయ్యాలలో చందనం బొమ్మ పెట్టే వైనం ఇప్పటికీ జ్ఞాపకం.

ఆడపిల్లలు బియ్యం తింటుంటే నీ పెళ్లి సమయానికి పెద్ద వాన వస్తుంది అని భయపెట్టి ఆ అలవాటు మానిపించేవారు.

ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం వస్తుంటే ఉరిమినప్పుడల్లా "అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి" అంటూ దండం పెట్టుకుని మమ్మల్నీ అలా చేయమనేది అమ్మ.

వినాయకచవితి నాడు సాయంత్రం చుట్టుపక్కల అందరి ఇళ్ళకి వెళ్లి ఆ ఇంటి వినాయకుడిని చూసి రమ్మనేవారు. ఎంతమంది వినాయకులకు మొక్కితే అంత బాగా చదువు వస్తుంది అనేవారు.

నాన్నగారూ ఏదైనా పని మీదో, లేక ఏదైనా ఊరికో ప్రయాణమవుతుంటే శకునం చూసి మరీ రోడ్ ఎక్కేవాళ్ళు.

"పాలమ్మాయి వస్తోంది. మంచిది వెళ్ళిరండి"అని అమ్మ అనేది. ఎవరూ ఎదురు రాకపోతే అమ్మ గానీ, అక్క గానీ అటు వెళ్లి ఇటు ఇంట్లోకి శకునంగా రావడం కూడా జరిగేది మధ్యేమార్గంగా.

గడప మీద కూచోకూడదు అని చెప్పేవారు. ఏదైనా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా గడప దాటి చేయమనేవారు.

ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు అనేవారు.

దొడ్లో కాకి ఆగకుండా కావు కావుమంటుంటే చుట్టాలు వస్తారు అనుకునేవాళ్ళం. అలాగే ఎవరైనా చుట్టాలు అనుకోకుండా వస్తే "రండి రండి" అని సంతోషంగా ఆహ్వానిస్తూనే "పొద్దున్న కాకి అరచినప్పుడే అనుకున్నా ఎవరో ఇంటికి వస్తారని..." అనేవాళ్ళం.

ఒక కాకి చనిపోతే దాని చుట్టూ పది కాకుల గుంపు చేరి కావు కావుమంటూ వాటి సంఘీభావమో, సంతాపమో తెలియచేస్తే వాటి స్నేహాభావాన్ని మెచ్చుకున్నాము. ఆబ్దికాలలో కాకి పిండం తిన్న కాకులను మన పితృదేవతలలాగా భావించి శిరస్సు వంచి మరీ దండం పెట్టేవాళ్ళం.

ఇప్పటి తరానికి ఇవన్నీ చాదస్తాలు, పిచ్చి నమ్మకాలు లాగ అనిపించవచ్చు గానీ ఇవన్నీ వింటూ, చూస్తూ, ఆచరిస్తూ పెరిగిన తరం మనది. ఎందుకు అని ఎదురు తిరగలేదు, ఇప్పటి వారిలా వితండవాదం చేయలేదు, చాదస్తాలు అని కొట్టి పారెయ్య లేదు.
పెద్దల మాట చద్ది మూట అనుకుంటూ ఆచరించాం. హాయిగా ఆనందంగా పెరిగాము...

కాదంటారా?

🙏🙏🙏🙏🇮🇳🙏🙏🙏🙏ఒక మిత్రుడు పంపించగా మనసుకు హాయిగా అనిపించింది. అందుకే మీకూ పంపిస్తున్నాను. ఒక్క సారి ఆనందంగా బాల్యంలో గడిపేయండి.💐🌹🇮🇳🌹💐

No comments:

Post a Comment